Monday 10 April 2017

రామాయణము అరణ్యకాండ - పదునాఱవసర్గ

                                                 రామాయణము 

                                                      అరణ్యకాండ  - పదునాఱవసర్గ 

సీతారామలక్ష్మణులు పంచవటిలో నివసించుచుండగా సకల ప్రాణులకు ఇష్టమైన హేమంతఋతువు ప్రవేశించెను . ప్రక్రుతి రామణీయముగా ఉండెను . వాతావరణము చల్లగా ఉండెను . ఎండబాధించకుండెను . ఆ సమయములో ఒక నాడు ప్రాతః కాలమున లక్ష్మణుడు శ్రీరాముడితో "అన్నా !నీకెంతో ఇష్టమైన హేమంత ఋతువు వచ్చినది . వాతావరణము చల్లగా హాయిగా ఉన్నది . నదులలో నీరు మిక్కిలిగా చల్లగా ఉండి ,స్నానమునకు అనువుగా వుండవు . భరతుడు  కష్టములు తెలియక పెరిగాడు . అతడు నీపై కల ప్రేమవలన జటావల్కల ధారియై తానునూ వనవాస దీక్షను చేయుచున్నాడు . కందమూలాదులు ,పళ్ళు మాత్రమే భుజిస్తూ ,నేలపైనే పరుండుతున్నాడు . 

అతడు చల్లగా వుండు నదీ జలములలో   ఎటుల స్నానము చేయుచున్నాడో ?"కొడుకులు  తండ్రి మాటను అనుసరించక తల్లి మాటను విందురు "అను లోకోక్తిని భరతుడు వమ్ము చేసినాడు . దశరథ మహారాజు భార్య ,భరతుడికి తల్లి ఐన కైకేయి ఇట్టి దురాఘతానికి ఎటుల పాల్పడినదో కదా !"అని పలికెను . ఆమాటలు విన్న శ్రీరాముడు "నాయనా !లక్ష్మణా !పినతల్లిని తప్పుపట్టకుము . ప్రస్తుతము భరతుడి గూర్చి మాట్లాడెదము . నాకును భరతుడు పదేపదే జ్ఞప్తికి వచ్చుచున్నాడు . నీవు ,నేను ,భరతుడు ,శత్రుఘ్నుడు అంధరము కలసి సంతోషముగా వుండు రోజు ఎప్పుడు వచ్చునొకదా !"అని పలికెను . 

ఆ విధముగా మాట్లాడుకొనుచు వారు మువ్వురు గోదావరి నదీ తీరమునకు చేరి స్నానములాచరించి ,దేవతలకు ,ఋషులకు ,పితృదేవతలకు తర్పణములు వదిలిరి . పిమ్మట సూర్యభగవానుని పూజించిరి . 

రామాయణము అరణ్యకాండ పదునాఱవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు .

 

 








 

No comments:

Post a Comment