Tuesday 4 April 2017

రామాయణము అరణ్యకాండ -పదునొకండవసర్గ

                                                 రామాయణము 

                                                      అరణ్యకాండ -పదునొకండవసర్గ 

వనప్రయాణములో రాముడు ముందు నడుచుచుండగా సీత ఆయనవెనక ఆవెనక లక్ష్మణుడు అనుసరించుచుండెను .

 క్రమముగా వారు వివిధ పర్వతసానువులను ,వనములను ,కనులకింపగు నదులను ,దర్శించుచు సాగిపోవుచుండిరి . వారు మునులతో కూడి ఇలా కొంతదూరము  వెళ్లిన పిమ్మట సూర్యుడు అస్తమించు సమయము ఆసన్నమాయెను . అప్పుడు వారు మనోహరముగా ఉన్న ఒక తటాకమును కాంచిరి . ఆ  ఎఱ్ఱ తామరలు ,నల్లకలువలు ,ఏనుగుల గుంపులు ,నీటిలో సంచరించే బెగ్గురుపక్షులు ,రాజహంసలు ,కలహంసలు చూడముచ్చటగా ఉండెను . 




స్వచ్ఛమైన జలములతో మనోహరముగా  వున్న ఆ సరస్సు నుండి వీణావేణుమృదంగతాళధ్వనులతో కూడిన మధురగానము వారికి వినపడెను . కానీ అచట ఎవరు కనపడకుండిరి . రామలక్ష్మణులు తమతో వచ్చుచున్న మునులలో 'భృతుడను 'మహర్షిని "ఈ అద్భుత సంగీతము మాకు కుతూహలము రేపుచున్నది . అతిగోప్యము కానిచో దానిని గూర్చి మాకు తెలుపుడు "అని పలికిరి . అప్పుడా 'ధర్మభృతుడు ' "ఓ రామా !ఈ సరస్సు పేరు 'పంచాప్సరము '. మాండకర్ణి అనే మహర్షి తన తపః ప్రభావముచే దీనిని నిర్మించెను . 
ఆ మాండకర్ణి మహర్షి గాలిని ,నీటిని మాత్రమే ఆహారముగా తీసుకొనుచు 10,000 సంవత్సరములు తీవ్రముగా తపమాచరించెను . ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలందరూ భయకంపితులయ్యిరి . వారందరూ వారిలో ఒకరి స్థానమును ఆక్రమించుటకే ఈ మహర్షి ఈ విధముగా తపస్సుచేయుచున్నాడు అని బావించిరి . పిమ్మట ఆ దేవతలు విద్యుత్కాంతులవలె మిఱుమిట్లు గొలిపెడి ఐదుమంది మేటి అప్సరసలను నియోగించిరి . పిమ్మట ఆదివ్యాంగనలు ఆ మాండకర్ణి మునిని వశపరుచుకొనిరి . ఫలితముగా ఆ ఐదుగురు అప్సరసలు ఆ మునికి భార్యలు అయ్యిరి . 
వారికొఱకై ఈ తటాకము యొక్క అడుగుభాగమున ఒక గృహమును ఆ ముని తన తపః ప్రభావమున నిర్మించెను . ఆ ముని తన తపః ప్రభావముచే యవ్వనమును పొంది వారితో కలిసి హాయిగా ఇచటనే ఉంటున్నాడు . ఆ అప్సరసల మధురగానమే ఇప్పుడు మీరు విన్నది . "అని పలికెను . అచటకు దగ్గరలోనే ఉన్న మునుల ఆశ్రమములలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అచటనే కొంతకాలము వసించెను . పిమ్మట పూర్వము తానూ దర్శించి వసించిన మునుల ఆశ్రమములకు మఱియొక పర్యాయము వెళ్లెను . 
సీతారామలక్ష్మణులు ఒక ఆశ్రమమం నందు పదిమాసములు ,మఱియొకచోట ఒక సంవత్సరము ,వేరొకచోట నాలుగు మాసములు ,అట్లే తదితర ఆశ్రమముల నందు వరసగా ఐదుమాసములు ,ఆఱుమాసములు ,ఏడుమాసములు వసించెను . ఇంకనూ వారు వేరువేరు ఆశ్రమములనందు ఒకమాసము ,ఒకమాసము కంటే ఎక్కువ ,అర్ధమాసము కంటే ఎక్కువ మూడుమాసములు ,ఎనిమిది మాసములు హాయిగా వసించెను . ఆ విధముగా పదియేండ్లు గడిచెను . పదిసంవత్సరముల తదుపరి వారు మువ్వురు తిరిగి సుతీక్షణ మహర్షి ఆశ్రమమునకు వెళ్లిరి . అచట కొంతకాలము గడిచిన పిమ్మట అగస్త్యముని ఆశ్రమమును దర్శించవలెననే కోరికను రాముడు సుతీక్షణ మహర్షికి విన్నవించెను . 
ఆయన కోరిక విన్న సుతీక్షణమహర్షి మిగుల సంతసించి ,ఆశ్రమమునకు దారి చెప్పెను . ముందుగా అగస్త్యభ్రాత (అనగా అగస్త్యముని సోదరుడు . ఈయన గురించి ఎక్కడ వచ్చినను ఈయన పేరు తెలుపబడలేదు . అగస్త్యభ్రాత అని మాత్రమే పేర్కొనుట జరిగినది )ఆశ్రమమునకు దారి తెలిపి ,అచట నుండి అగస్త్యుని ఆశ్రమమునకు దారి తెలిపెను . సీతారామలక్ష్మణులు ఆ మహాముని తెలిపిన దారిలో నడుచుకుంటూ అగస్త్యభ్రాత ఆశ్రమము దగ్గరకు వచ్చిరి . అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో "సోదరా !మనము సుతీక్షణ మహర్షి తెలిపిన విధముగానే అగస్త్యభ్రాత ఆశ్రమము దగ్గరకు వచ్చితిమి . ఈయన సోదరుడగు అగస్త్యుడు తన తపః ప్రభావమున లోక హితముకొఱకు మృత్యువును జయించి ఈ దక్షిణ దిశను సురక్షితమయినదిగా చేసెను . 
పూర్వము ఇచట క్రూరులైన వాతాపి ,ఇల్వలుడు అను రాక్షస సోదరులు ఉండెడివారు . వారిలో నిర్దయుడైన ఇల్వలుడు బ్ర్రాహ్మణ రూపమును ధరించి సంస్కృతభాషలో బ్ర్రాహ్మణులను ఆహ్వానించెడివాడు . ఇల్వలుడు తన సోదరుడైన వాతాపిని శాకరూపమున మార్చి శ్రాద్దమునకు తగినట్లుగా కూరగా వండి ,విధివిధానంగా శ్రార్ధ కర్మను జరిపి ,బ్ర్రాహ్మణులకు భోజనపదార్థములలో ఆ కూరను వడ్డించెడివాడు . ఆ విప్రుల భోజనము ముగిసిన పిమ్మట ఇల్వలుడు బిగ్గరగా "వాతాపి బయటకురా "అని అరిచెడివాడు . సోదరుడి పిలుపు విని వాతాపి మేక వలె మారి ఆ బ్ర్రాహ్మణుల ఉదరమును చీల్చుకుని బయటకు వచ్చెడివాడు . ఆ విధముగా నరమాంస భక్షకులైన ఆ రాక్షస సోదరులు వేలకొలది గా బ్ర్రాహ్మణులను హతమార్చుచుండెడివారు . 

ఆ రాక్షసుల ఆగడములు దేవతలు అగస్త్యునికి మొరపెట్టుకొనగా ,అంత ఆ మహాముని వారి ఇంటికి శ్రార్ధ కర్మకు వెళ్లి వారు పెట్టిని భోజనమును భుజించెను . "ఈ భోజనంతో నేను తృప్తి పడితినని "ఆ ముని పలికెను . అప్పుడు ఇల్వలుడు "వాతాపి సోధరా !బయటకు రా "అని పిలిచెను . అప్పుడు అగస్త్యుడు "ఇంకనూ మీ సోదరుడు ఎక్కడ !అతడు ఎప్పుడో జీర్ణమయ్యెను . ఈ పాటికే యమపురికి వెళ్ళినాడు "అని పలికెను . ఆ మాటలు విన్న ఇల్వలుడు ఆమునిపైకి హింసకు దిగెను . అప్పుడాముని తన కంటి చూపుతో వాడిని భస్మము చేసెను . "అని పూర్వ వృత్తాంతమును తెలిపెను . వారు మువ్వురు అగస్త్యభ్రాత  ఆశ్రమమునకు చేరిరి అచట అదితిసత్కారములు పొంది ఆ రాత్రి అచటనే ఉండి మరునాడు ఉదయమే అగస్త్యుడి ఆశ్రమమునకు వెళ్లుచున్నామని చెప్పి అచట నుండి బయలుదేరెను . 
వారు వనములోని అనేక ప్రదేశములను ,వృక్షములను ,చూడముచ్చట గా కల సరస్సులు దాటుకుంటూ అగస్త్యుని ఆశ్రమమునకు దగ్గరకు  చేరిరి .  అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో "లక్ష్మణా !మనము అగస్త్యముని ఆశ్రమము చేరువకు చేరుకొంటిమి . తన తపః ప్రభావముచే వింధ్యపర్వతమును స్తంభింపచేసినందున ఆ మహర్షి "అగస్త్య నామముతో "విఖ్యాతుడయ్యెను .ఈ మునికి భయపడి రాక్షసులు ఇచటకు రారు సరికదా ఈ వైపు కన్నెత్తి కూడా చూడరు . ఇచట దేవతలు ,యక్షులు ,నాగజాతివారు ,గరుడాద్రి పక్షిజాతి వారు ఆహార నియమములను పాటించుచు ,ధర్మనిరతులై నివసించుచుందురు . 
ఈ ఆశ్రమము ప్రాంతము నందలి తపస్సిద్ధి నొందిన మహాత్ములు ,మహర్షులు ,తమ స్థూలదేహములను వీడి దివ్యదేహములను దాల్చి ,సూర్యతేజస్సుతో వెలుగొందెడి విమానములపై స్వర్గము చేరుచుందురు . ఈ ప్రదేశమున శ్రద్దగా సత్కర్మలు ఆచరించెడివారికి వారు ఆరాధించే దేవతలు రాజ్యసంపదలను ,అమరత్వమును ప్రసాదించెదరు . అట్టి మహిమాన్వితమైన ఆశ్రమమునకు మనము రానే వచ్చితిమి . ముందుగా నీవు వెళ్లి నేను సీతా వచ్చామని ఆ మహామునికి విన్నవించు "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ పదునొకండవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  
















No comments:

Post a Comment