Sunday 30 April 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువదియొకటవసర్గ

                                          రామాయణము 

                                           అరణ్యకాండ -ఇరువదియొకటవసర్గ 

సమస్త రాక్షసుల వినాశనం కొఱకే దాపురించిందా అన్నట్లు  ఎదుట ఏడ్చుచు మరల వచ్చిన శూరపణఖను చూసిన ఖరుడు  క్రుద్ధుడై "ఏమి సోదరి !ఎందులకు ఏడ్చుచున్నావు ?నీవు ఏడ్చుచున్నావనే కదా !భీకరులైన రాక్షసులను పంపివుంటిని . ఏమి జరిగినది ? నేను పంపిన వీరులు భయంకరులు ,ఎదుటివారిని చంపి తినెడినరరూప రాక్షసులు ,అంతే కానీ చచ్చెడివారు కాదు . అంతటి మహా వీరులను నీతో పంపినప్పటికీ మరలా నీవు ఎందుకు ఏడ్చుచుంటివి ?ఏమి కొంప ములిగినది ?"అని ప్రశ్నించెను . 
అప్పుడా పెద్ద పొట్టగల రాక్షసి ఐన శూర్పణఖ "అన్నా !నా ముక్కు చెవులు కోసిన కారణముగా నీ వద్దకు వచ్చి గోడు వెలబోసుకుంటిని . నీవు వీరులైన పదునాలుగు మంది రాక్షస యోధులను పంపి వంటివి . వారినందరిని నిముష కాలములో ఆ దశరథ పుత్రుడు పరిమార్చినాడు . అతడు గొప్ప పరాక్రమశాలి . అతడి ముందు నీ బలము కూడా చాలదని నా ఉద్దేశ్యము . నీవు కనక అతడిని వధించలేకపోయినట్లయితే నీవు ఈ దండకారణ్యములో వుండు అర్హతను కోల్పోతావు . ఒక మానవుడిని ఎదిరించలేనట్లయితే నీ బతుకు వ్యర్ధము . నీవు పలికే ప్రగల్బాలన్నీ ఒట్టి గాలి మూటలే అవుతాయి . మన రాక్షస జాతికే అవమానము "
అని పలుకుతూ ఆ రాక్షసి రొప్పుతూ ,ఏడ్చుచు ,గగ్గోలు పెడుతూ బిగ్గరగా అరుస్తూ కొంత సేపటికి మూర్ఛపోయెను . 

రామాయణము అరణ్యకాండ ఇరువదిఒకటవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment