Saturday 8 April 2017

రామాయణము అరణ్యకాండ -పదునాల్గవసర్గ

                                          రామాయణము 

                                             అరణ్యకాండ -పదునాల్గవసర్గ 

సీతారామలక్ష్మణులు వంచవటికి పయనించు దారిలో ఒక దృఢమైన శరీరము కల గ్రద్దను చూసేను . మఱ్ఱిచెట్టుమీద వున్న దానిని చూసిన రామలక్ష్మణులు పక్షి అవతారంలో వున్న రాక్షసుడని భావించి ,"నీవెవరు ?నీపేరేమి ?"అని ప్రశ్నించెను . అప్పుడా గ్రద్ద "నాయనా !రామా !నేను మీ తండ్రి అయిన దశరధుని మిత్రుడను . "అని పలికెను . 
తన తండ్రి మిత్రుడని తెలియగానే శ్రీరాముడు ఆ గ్రద్దను పూజించి ,నీవంశము యొక్క పుట్టుపూర్వత్తరాలేవి ?నీపేరేమి ?"అని ప్రశ్నించెను . 

అంతట ఆ గ్రద్ద తన వంశమును గూర్చి ,తనను గూర్చి తెలుపబోవుచు ,ప్రశంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి ఆయనకు ఇలా వివరించెను . "ఓ రామా !ప్రజాపతులలో మొట్టమొదటివాడు కర్దముడు . వరుసగా విక్రీతుడు ,శేషుడు ,సంశ్రయుడు ,బ్రహ్మపుత్రుడు ,స్థాణువు ,మరీచి ,అత్రి ,క్రతువు ,పులహుడు ,దక్షుడు ,వివస్వంతుడు ,కశ్యపుడు ,పులస్త్యుడు ,అంగిరసుడు ,ప్రచేతేసుడు ,అను పదునైదు మంది మిగిలిన ప్రజాపతులు వారిలో కశ్యపుడు చివరివాడు .
దక్షప్రజాపతి కి 60 మంది వారిలో అదితి ,దితి ,ధనువు ,కాళిక ,తామ్ర ,క్రోధవశ ,మనువు ,అనల అను 8మంది సుందరీమణులు ను కశ్యపుడు వివాహమాడాడు . ఓ అరి నూదనా !అదితి యందు ద్వాదశ ఆదిత్యులు ,అష్టవసువులు ,ఏకాదశరుద్రులు ,ఇరువురు అశ్విని దేవతలు మొత్తం ముప్పైమూడుమంది దేవతలు జన్మించిరి . దితి యందు జన్మించినవారు దైత్యులు . పూర్వము ఈ భూమి మీద అధికారము దేవతలకు ,రాక్షసులకు  ఉండేది . ధనువు అనే ఆమె యందు పుట్టినవాడు ఆశ్వగ్రీవుడు ,నరకుడు ,కాలకుడు అనువారు 'కాలిక 'యొక్క పుత్రులు . తామ్ర అను ఆమె క్రౌంచి ,భాసి ,స్వేని ,దృతరాష్ట్రి ,శుకి అను 5గురికి జన్మనిచ్చెను . 
వారిలో' క్రౌంచి' గుడ్లగూబలకు ,;భాసి' నీటి కాకులకు , కోళ్లకు ,'స్వెని 'డేగలు ,గ్రద్దలకు జన్మలనిచ్చిరి . దృతరాష్ట్రి అందు హంసలు ,కలహంసలు ,చక్రవాకములు ,జన్మించెను . శుకి అందు 'నత' పుట్టెను . 'నత 'కుమార్తె వినత . కశ్యపుని భార్య అయిన 'క్రోధవశ 'అను ఆమె యందు మృగి ,మృగమంద ,హరి ,భద్రమధ ,మాతంగి ,శార్దూలి ,స్వేత ,సురభి ,సురస ,కద్రువ అను పదిమంది జన్మించిరి . ఓ పురుషోత్తమా !మృగములన్నియు మృగి యొక్క సంతానము . ఎలుగుబంట్లు ,సవరపుమెకములు ,చమరీ మృగములు ,'మృగమదం'యొక్క సంతానము . 'హరి 'అను ఆమె యొక్క సంతానము  సింహములు ,వానరములు . 'భద్రమధ 'అను ఆమె కూతురు ఐరావతి . 'ఐరావతి 'సంతానము ఐరావతము . 'మాతంగి 'అను ఆమె యొక్క సంతానము ఏనుగులు .' శార్దూలి 'అను ఆమె సంతానము కొండముచ్చులు ,పెద్దపులులు . 
సురభి అను ఆమెకు 'రోహిణి 'గంధర్వి 'అను ఇరువురు కుమార్తెలు కలిగారు . గోవులన్నియు రోహిణి యొక్క సంతానము . గన్ధర్వీ సంతానము అశ్వములు . నాగుల తల్లి సురస . కద్రువ యొక్క సంతానము పాములు . 'మనువు 'అను ఆమె సంతానమే మానవులు . మధురఫలములతో కూడిన వృక్షములన్నియు 'అనల 'అను ఆమె సంతానము . వినతకు 'అనూరుడు (సూర్యుని రద సారధి ),గరుడుడు (విష్ణుమూర్తి వాహనము )అను ఇరువురు కుమారులు కలిగిరి . నేను ,మా అన్న సంపాతి ఆ అనూరుని కుమారులము . నా పేరు జటాయువు . మా తల్లి పేరు స్వేని . అనగా నేను స్వేని ,అనూరుల కుమారుడును . 
నాయనా !ఇది దట్టమైన కీకారణ్యము . క్రూర మృగములు ,రాక్షసులు ఇచట సంచరించుచు ఉందురు . నీవు సమ్మతించినచో నేను మీరు ఫల,మూలములకు వనములో కి వెళ్లిన సమయములో ఈ చిన్నారి బాలిక అయిన సీతను రక్షిస్తూ ఇచటనే ఉండేదను "అని పలికెను . ఆ మాటలు అన్నీ విని శ్రీరాముడు జటాయువును కౌగలించుకుని సీతా రక్షణకు  తన సమ్మతమును తెలిపెను . 

రామాయణము అరణ్యకాండ పదునాల్గవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment