Sunday 30 April 2017

                                             రామాయణము 

                                            అరణ్యకాండ ---ఇరువది రెండవసర్గ 

రాక్షసులందరి సమక్షమున శూర్పణఖ శూరుడైన ఖరుడిని ఆ విధముగా అవమానింపగా వెంటనే అతడు ఉగ్రుడై ఆమెతో "ఓ సోదరీ !నీకు జరిగిన ఈ అవమానము నాలో క్రోధము ను ప్రజ్వల్లింపచేయుచున్నది . మానవ మాత్రుడైన అల్పాయుష్కుడైన రాముడు నాకొకలెక్కా ?అతడినే కాదు అతడి తమ్ముడు లక్ష్మణుడిని కూడా యమపురికి ఈ దినమునే పంపెదను . నీవు భయమును వీడుము ,కన్నీరును తుడుచుకొనుము . రణరంగమున ఆ రాముడిని పరిమార్చెదను . వాడి వేడి నెత్తురు నీవు ద్రాగుదువు . "అని పలికెను . 
ఖరుడి నోటి వెంట వచ్చిన ఆ మాటలు విని శూర్పణఖ ఎంతో పొంగిపోయెను . తన అన్నను పరిపరి విధములుగా ప్రస్తుతించేను . పిమ్మట ఖరుడు మిక్కిలి బలశాలురైన 14000 మంది రాక్షసులతో ,కత్తులు ,శూలాలు ,బల్లెములు ,బాణములు మొదలగు వాడి ఆయుధములు ధరించి శ్రీరాముడిపై యుద్ధమునకు బయలుదేరెను . ఖరుడి రథచక్రముల శబ్దములకు భూమి దద్దరిల్లేను . అడవిలోని మృగములు ,పక్షులు అన్నీ బెదిరి పారిపోతుండగా ఖరుడు తన సేనతో సహా శ్రీరాముడి పై యుద్ధమునకు ముందు కు కదిలెను . 

రామాయణము అరణ్యకాండ ఇరువది రెండవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


No comments:

Post a Comment