Sunday 23 April 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువదియవసర్గ

                                       రామాయణము 

                                       అరణ్యకాండ -ఇరువదియవసర్గ 

ఖరుడిచే పంపబడిన క్రూరులైన పదునాలుగు మంది రాక్షసులు ,శూర్పణఖ శ్రీరాముని ఆశ్రమమునకు వచ్చి ఆసీనులైవున్న సీతారామలక్ష్మణులను చూసిరి . వారినందరిని చూసిన శ్రీరాముడు లక్ష్మణునితో "లక్ష్మణా !వికృతాకారి అయిన ఈ రాక్షసి రాక్షసులను వెంటబెట్టుకుని వచ్చినది . నీవు ఒక్క క్షణకాలం అప్రమత్తుడవై మీ వదినను రక్షించుము . నేను వీరిని మట్టికరిపించెదను "అని పలికి 
రాక్షసులవైపు తిరిగి ఆ రాక్షసులతో "హింసా ప్రవ్రుత్తి కల మీ వంటి పాపాత్ములను వధించుటకే ,మహర్షుల ఆదేశము అనుసరించి ధనుర్భాణములు ధరించినాను . మీరు నాతొ యుద్ధము చేయదలిచినట్లయితే పారిపోక నిర్భయముగా ఉండుము . ప్రాణములమీద ఏమాత్రము ఆశ ఉన్నచో వెనువెంటనే ఇచట నుండి పొమ్ము "అని పలికెను . 
బ్రహ్మహత్యాపాతకులైన ఆ వికృతాకార రాక్షసులు శ్రీరాముడి పలుకులకు మండిపడి "మహాకాయుడు మాకు ప్రభువు అయిన మా ప్రభువు ఖరుడికి నీవు కోపము తెప్పించినావు . నేడు రణరంగమున నీకు చావు తప్పదు . మేము పెక్కుమంది మి ,నీవు వంటరివి . రణరంగమున మా ఎదుట నిలబడలేవు . ఇక యుద్ధము చేయుట కూడానా ?యుద్ధమునకు రమ్ము !ఈవేళ నీ గర్వమును అణిచివేసి ,నీ ప్రాణములు తీసివేయుదుము "అని పలికి వారందరూ ఒక్కసారిగా వాడియైన శూలములను శ్రీరాముడిపై ప్రయోగించిరి . 

శ్రీరాముడు బంగారు కాంతితో మెరిసిపోయే బాణములతో వాటిని ముక్కలు చేసి అనంతరము వాడి అయిన పదునాలుగు బాణములను ఒకేసారి ఆ పదునాలుగు మందిపై ప్రయోగించెను . ఆ బాణములు వారి శరీరములను చీల్చి బయటకు వచ్చినవి . వారందరూ అక్కడిక్కడే మరణించారు . అది అంతా కళ్లారా చూసిన శూర్పణఖ భీకర శబ్దాలతో గగ్గోలు పెట్టుచు ,ఏడ్చుచు ,ఆర్తనాదములు చేయుచు తన సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్ళినది . 

రామాయణము అరణ్యకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
















No comments:

Post a Comment