Sunday 2 April 2017

రామాయణము అరణ్యకాండ -పదియవసర్గ

                                              రామాయణము 

                                                    అరణ్యకాండ -పదియవసర్గ 

పతిభక్తి పరాయణ అయిన సీతాదేవి పలికిన పలుకులు విని ,ధర్మనిరతుడైన శ్రీరాముడు ఆమెకు ఇలా ప్రత్యుత్తరమిచ్చెను . 

"దేవీ !నీవు మహోన్నతమైన జనకమహారాజు వంశమున జన్మించినదానవు . ధర్మజ్ఞురాలవు . నాపై నీకు గల అనురాగము గాఢమైనది . అన్నివిధములుగా నీకు తగినట్లుగా నా హితము కోరుచు వచించితివి . ఓ సీతా !దండకారణ్యము నందు దీక్షతో తపస్సాచరించుచున్న  ఆర్తులై స్వయముగా వచ్చి నన్ను శరణు జొచ్చితిరి . వారు రక్షింపదగినవారు . వారు వనములలో కందమూలాదులను ఆహారముగా తీసుకొనుచు ,ధర్మనిరతులై జీవించుచున్నారు . క్రూరాత్ములైన రాక్షసుల ఆగడములను తట్టుకొనలేక భయగ్రస్తులై వారు సుఖశాంతులకు దూరమయ్యిరి . 
వారు నిరంతరమూ తపోనిధులలో నిరతులై యుందురు . నరమాంసభక్షకులైన భయంకరమైన ఆకారులు అయిన రాక్షసులు ఆ సాధుపురుషులను చంపి తినివేయుచుందురు . దండకారణ్యవాసులు ,ద్విజోత్తములు అయిన ఆ మునులు 'మమ్ములను అనుగ్రహింపుడు 'అని నన్ను వేడుకొనిరి . వారు ఆవిధముగా అభ్యర్ధించుటచే నేను "మీరు నన్ను అభ్యర్ధించుట తగదు . శాసించవలెను . "అని అతి వినమ్రుడనై వారి ఎదుట పలికితిని . అప్పుడు ఆ మునిపుంగవులు "క్రూర రాక్షసులు పెట్టే బాధలు తట్టుకొనలేక ,మమ్ము ఆడుకొనువారి కొరకై వెతుకుచుంటిమి . మా తీవ్రమైన తపః ప్రభావమున ఆ నిశాచరులను (నిశా అనగా రాత్రి . అనగా రాత్రి పూట సంచరించువారైన రాక్షసులు )భస్మము చేయగల శక్తి మాకు కలదు . 
కానీ పెక్కు ఏండ్లు ఆచరించిన తపః ప్రభావమును వారికి వ్యర్ధము చేయుట మాకు సమ్మతము కాదు . ఆ రాక్షసులు నిత్యమూ మమ్ము పెక్కు ఇబ్బందులకు గురి చేస్తుంటారు . మా సహనమును పరీక్షచేస్తుంటారు . ఆ రాక్షసులచే పీడింపబడుచున్న మమ్ము లక్ష్మణునితో కలసి నీవు రక్షింపుము ."అని కోరిరి . ఋషుల విరోధులు అందరూ నాకు విరోదులే . అందువల్లనే రాక్షసులను పూర్తిగా పరిమార్చెదని ప్రతిజ్ఞ చేసినాను . ఓ సీతా !ఆ మునీశ్వరులు నన్ను అడగకున్నను  నేను వారిని రక్షించెదను . ఇప్పుడు నేను ప్రతిజ్ఞ కూడా చేసితిని . మాట నేను తప్పను నీకు సర్వము తెలుసును కదా . సీతా !మన ప్రేమానురాగముల వలన నీ సహృదయము వలన ఈ విషయము ప్రస్తావించివుంటివి . ఇందులకు నేను ఎంతయో సంతసించితిని . ఆత్మీయులు అయిన వారే ఇటుల మాట్లాడగలరు . 
ఓ వైదేహి !నీవు నీ వంశమునకు ,నీ స్వభావమునకు తగినట్లుగా మాట్లాడినావు . నీవు నాకు ప్రాణముల కంటే మిన్న . నీవు నా సహధర్మచారిణివి కదా !కావున నా ధర్మాచరణలో నాతొ పాలుపంచుకొనుము . "అని పలికేను . ఆ తరువాత సీతాలక్ష్మణులతో శ్రీరాముడు తపోవనములకు బయలుదేరెను . 

రామాయణము అరణ్యకాండ పదియవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  












No comments:

Post a Comment