Sunday 1 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదిమూడవసర్గ

                                రామాయణము 

                               యుద్ధకాండ -ఏబదిమూడవసర్గ 

రాక్షసరాజైన రావణుడు ధూమ్రాక్షుడి మరణ వార్త విని కోపముతో ఊగిపోతూ ఒక మహాసర్పము వలె బుసకొట్టను . పిదప రావణుడు వీరుడు ,మహాబలశాలి ఐన వజ్రద్రంష్టుడిని యుద్ధమునకు వెళ్ళమని ఆజ్ఞాపించెను . 
మాయావి ,రాక్షసులలో ప్రముఖుడు ఐన వజ్రద్రంష్టుడు రావణుని ఆజ్ఞను తలదాల్చి ,అనేకమంది రాక్షసులను వెంట తీసుకుని గజములు ,అశ్వములు ,గాడిదలు ఒంటెలు ధ్వజపటములతో సర్వసన్నద్ధుడై ,రకరకముల ఆయుధములతో తన సైన్యముతో దక్షిణద్వారము వైపుగా యుద్ధమునకు వచ్చెను . అక్కడ అంతకు ముందే అంగదుడు తన సేనతో యుద్దమునకై సిద్ధముగా ఉండెను . వానర వీరులు రాక్షసులసైన్యము వచ్చుట చూసి సమరోత్సాహముతో పెద్దగా గర్జనలు చేసెను . 
వజ్రద్రంష్టుడికి వచ్చేదారిలో అనేక అపశకునములు ఎదురయ్యెను . వాటిని లెక్కచేయక సమరోత్సాహముతో ముందుకు కదిలెను . వానరరాక్షసయోదులమధ్య సమరం మొదలయ్యెను . అస్త్రములు అన్ని ప్రయోగించిన పిమ్మట అవి అయిపోవడంతో కొందరు వీరులు బాహుయుద్దమునకు తలపడిరి . వానరులను చంపుతున్న రాక్షసులను చూసిన అంగదుడు కోపముతో ఓకే పెద్ద చెట్టును పీకి ,దానితో వారిని కొట్టెను ఆ దెబ్బకు వారందరూ మరణించిరి . అది చూసిన మిగిలిన రాక్షసులు భయముతో కంపించిపోయిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదిమూడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 
 






No comments:

Post a Comment