Tuesday 10 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదియవసర్గ

                                  రామాయణము 

                                   యుద్ధకాండ -అరువదియవసర్గ 

లంకకు వచ్చిన రావణుడికి మనసులో శ్రీరాముని బాణములు ఏ పక్కనుండి వచ్చి తనను బాధించునో అని భయము కలిగెను . పిమ్మట అతడు తన బంగారు సింహాసనంపై కూర్చుండి ,తనవారితో "దేవేంద్రుడి వంటి పరాక్రమము కలిగిన నేను ఒక మానవుడి చేతిలో ఓడిపోయాను . నేను చేసిన ఘోర తపస్సుఅంతా వ్యర్ధమయిపోయినది . 'నీకు మనుష్యుల వలన ప్రాణభయము కలది దీనిని గుర్తుంచుకో 'అని బ్రహ్మదేవుడు పలికిన మాటలు నేడు నిజమైనవి .
 లోగడ ఇక్ష్వాకు వంశములో ప్రముఖుడైన 'అనరణ్యుడు 'అను రాజు 'మా వంశములో పుట్టిన మహావీరుడి చేతిలో నీవు మరణించెదవు 'అని శపించేను . దశరధుని కుమారుడైన శ్రీరాముడే ఆ మహావీరుడని నేడు నాకు స్పష్టమవుచున్నది . 
పూర్వము నేను వేదవతి అవమానించి ఆమె శాపమునకు గురి అయితిని . ఆమె సీతగా పుట్టి నా మృత్యువునకు కారణమవుచున్నది .  
ఇదివరకు నేను నా బలమును ప్రదర్శించుటకు కైలాసగిరిని కంపింపచేసాను . దానితో కోపించిన పార్వతీదేవి 'ఒక స్త్రీ కారణముగా నీకు మరణము సంభవించును 'అని శపించెను . 
ఒకానొకప్పుడు శివపార్వతులను దర్శించుటకు కైలాసమునకు వెళ్ళినప్పుడు శివుడి వాహనము అయిన నంది నన్ను అడ్డగించెను . వానరముఖముతో వున్న ఆ నందిని చూసి నేను పరిహాసముగా నవ్వాను . అప్పుడు కోపించిన నందీశ్వరుడు 'రావణా !వానరులమూలముగానే నీ వంశము నాశనమవుతుంది 'అని శపించెను . 
చాలారోజుల క్రితము రంభ అను అప్సరస తన ప్రియుడైన నలకూబరుడిని కలుసుకొనుటకు వెళ్ళ్తుండగా ,ఆమె అందచందములకు మోహితుడైన రావణుడు ఆమెను బలాత్కరించెను . అది తెలిసిన నలకూబరుడు 'నీవు పరస్త్రీ పై వ్యామోహపడి అధర్మమునకు పాల్పడినప్పుడు నీ తలవ్రక్కలగును 'అని శపించెను . 
పుంజికస్థల అను ఆమె వరుణిని కూతురు ఒకానొకసమయములో ఆమె బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లుచుండగా ,మార్గమధ్యములో నేను ఆమెను ఆపి బలాత్కరించాను . 'ఈ విషయము తెలిసిన బ్రహ్మదేవుడు నీవు పరకాంతతో ఉంటే నీ తల బ్రద్దలగును 'అని శపించెను . 
నాకు కల పై శాపములన్నిటిని గుర్తుపెట్టుకుని యుద్ధప్రయత్నములు చేయవలెను . రాక్షసులందరు అత్యంత జాగరూకులై లంకను రక్షించవలెను . మహా బలవంతుడైన కుంభకర్ణుని నిద్రనుండి లేపండి . అతడితో యుద్ధము గురించి ఇదివరకే చర్చించి వున్నాను . అతడు తొమ్మిది దినముల క్రితమే నిద్రకు ఉపక్రమించాడు . అతడు తన ఇష్టానుసారము నెలలతరబడి నిద్రపోవుచు ఉండును . అతడు యుద్ధరంగమునకు అడుగుపెట్టినచో ,వానరులను ఆ రాకుమారులను తప్పక వధించగలడు . కావున అతడిని వెంటనే నిద్రలేపండి "అని పలికెను . 
రావణుడి ఆజ్ఞ ప్రకారము వెంటనే కుంభకర్ణుని నిద్రలేపుటకు రాక్షసులు వెళ్లిరి . వారు తమతోపాటుగా అనేక రకముల ఆహారపదార్థములను తీసుకువెళ్లిరి . ముఖ్యముగా కుంభకర్ణునికి ఇష్టమైన మాంసాహారములను తీసుకువెళ్లిరి . వారంతా బయంకరాకారము కలిగి నిద్రపోవుచున్న కుంభకర్ణుని దగ్గరకు వెళ్లిరి . అతడి ఉచ్వాస నిస్వాసములు వారిని కదిపివేయుచు ఉండెను . వారు కష్టపడి నిలదొక్కుకుని కుంభకర్ణుని వద్ద పెద్దగా అరవసాగిరి . తమతో తీసుకువెళ్లిన వాయిద్యములు బిగ్గరగా వాయించసాగిరి . అయినను కుంభకర్ణునిలో ఉలుకుపలుకు లేదు . 

పిమ్మట వారంతా కుంభకర్ణుని వంటికి చందనము పూసిరి . సుగంధద్రవ్యములు పూసిరి పుష్పమాలలతో అలంకరించిరి . పిమ్మట వారు రోకళ్ళతో బలముగా కుంభకరుని కొట్టిరి . అయినను అతడిలో చలనము లేకపోవుటచే ,కొందరు రాక్షసులు పిడికిళ్లతో కొట్టిరి . ఇంకొందరు అతడి జుట్టుపీకిరి . మరికొందరు అతడి చెవులు కొరికిరి . కొంతమంది వందలకొద్దీ  కడవలతో నీటిని తీసుకొచ్చి ,అతడి చెవులో పోసిరి . అయినను కుంభకర్ణుడు ఉలకలేదు పలకలేదు . ఇక లాభములేదని ఏనుగులను తెప్పించి అతడిమీద నడిపించిరి . అప్పుడు కుంభకర్ణునికి అతడి శరీరము మీద పురుగు పాకినట్టు అనిపించి నిద్రలేచేను . 
అతడికి ఎదురుగా వున్న ఆహారము మొత్తము తిని ,తనకు బయపడి దాక్కున్న సైనికులను చూసి "సైనికులారా !భయములేదు బయటకు రండు . ఇప్పుడు నన్ను ఎందుకు నిద్రలేపారు . మన మహారాజుకు ఎటువంటి ఇబ్బంది కలుగలేదుకదా !"అని అడిగెను . అప్పుడు రావణుని సచివుడైన యూపాక్షుడు "ప్రభూ !దేవతలవలన సైతము మనకు ఏనాడు భయము కలుగలేదు . కానీ ఇప్పుడు మనకు మానవుని వలన భయము కలిగినది . వానరయోదులు లంకను చుట్టుముట్టినారు . సీతాపహరణము కారణముగా మన రాజుకు ఆపదవచ్చిపడినది . నేడు శ్రీరాముడి చేతిలో మన ప్రభువు పరాజితుడయ్యెను . "అని పలికెను . 
విషయము తెలుసుకున్న కుంభకర్ణుడు వెంటనే "ఇప్పుడే నేను సైన్యముతో వెళ్లి ,వానరులను రామలక్ష్మణులను చంపినా పిమ్మటే రావణుని దర్శించెదను "అని పలికెను . ఆమాటలు విన్న యూపాక్షుడు "!మహాబాహు !ముందుగా రాజునూ దర్శించుము . మహారాజుతో మాట్లాడి అతడి సలహా తీసుకుని యుద్ధరంగమునకు వెళ్ళుట మంచిది "అని పలికెను . వెంటనే కుంభకర్ణుడు రావణుని వద్దకు వెళ్లెను . రావణుని వద్దకు వెళ్తుండగా ప్రాకారము బయట నుండి కుంభకర్ణుని చూసిన వానరులు కుంభకర్ణుని బయంకరాకారము చూసి బీతిల్లిరి . 

రామాయణము యుద్ధకాండ అరువదియవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment