Tuesday 3 September 2019

రామాయణము యుద్ధకాండ - ఏబదిఐదవసర్గ

                                 రామాయణము

                                యుద్ధకాండ - ఏబదిఐదవసర్గ 

అంగదుని చేతిలో వజ్రద్రంష్టుడు నిహతుడయ్యాడని తెలిసిన రావణుడు తన ఎదుట నిలబడివున్న సేనాధిపతి అయిన ప్రహస్తునితో "ప్రహస్తా !వివిధ అస్త్రములు ప్రయోగించుటలో సమర్థుడు అగు అకంపనుని నాయకత్వములో శత్రు భయంకర పరాక్రమములు ఐన రాక్షసయోధులను శీఘ్రముగా యుద్ధమునకు పంపుము . ఆ అకంపనుడు శత్రుసైన్యమును నిగ్రహించుటలో దిట్ట . తన సైన్యమును రక్షించుకొనుటలో మేటి . సేనాపతులలో గట్టివాడు . యుద్ధయోధులలో సమర్థుడు . అనుక్షణము ఇతనికి యుద్ధప్రీతి మెండు . శత్రువులను ముప్పతిప్పలు పెట్టగల ఈ అకంపనుడు ,రామలక్ష్మణులను సుగ్రీవుడు వంటి వానరవీరులను జయించగలడు "అని పలికెను . 

రావణుడి ఆజ్ఞ అందుకున్న అకంపనుడు ,శత్రుభయంకరులైన అనేకమంది రాక్షస వీరులను తీసుకుని యుద్ధమునకు బయలుదేరెను . పూర్వము వలే (ధూమ్రాక్షుడు ,వజ్రద్రంష్టుడు )అకంపనుడు కూడా తనకు అనేక అపశకునములు కనిపించినా వాటిని లక్ష్య పెట్టక యుద్ధరంగమునకు వెళ్లెను . శ్రీరాముని  వానరవీరులు ,రావణుని కొరకు రాక్షసులు తమతమ ప్రాణములు అర్పించుటకు సిద్దపడి ఘోరయుద్ధమునకు సిద్దపడిరి . వానరరాక్షస వీరుల పాదముల తాకిడి వలన చెలరేగిన దుమ్ము ఆ రణరంగమును కప్పివేసెను . 
రాక్షసుల సేనాధిపతి అయిన అకంపనుడు తీవ్రపరాక్రమశాలురు అయిన రాక్షసయోధులను యుద్ధమునకు రెచ్చగొడుతూ వారిని ఉత్సాహపరుస్తూ ,యుద్ధముచేయసాగెను . వానరవీరులు రాక్షసులకు ఎదురుగా నిలబడి ,వారి శస్త్రములను బలవంతముగా లాగుకొని వారిని చెట్లతో ,కొండలతో చంపసాగిరి . ఇంతలో వానరవీరులైన కుముదుడు ,నలుడు ,మైందుడు ద్వివిదుడు మిక్కిలి కోపముతో సాటిలేని విధముగా తమ బలములను ప్రదర్శించిరి . ఆ వానరవీరులు మిక్కిలి వేగముగా సేనాగ్రబాగమున నిలిచి ,వృక్షములను చేత పట్టుకుని రాక్షసులతో ఘోరయుద్ధము చేసిరి . వారవీరులందరూ పెద్దపెద్ద శిలలను తీసుకుని రాక్షసులను పిండిపిండి చేసిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .  







No comments:

Post a Comment