Monday 2 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదినాలుగవసర్గ

                                     రామాయణము 

                                      యుద్ధకాండ -ఏబదినాలుగవసర్గ 

అంగదుని అండతో వానరులు రెట్టింపు ఉత్సాహముతో రాక్షసులను చావకొట్టసాగిరి . అది చూసిన వజ్రద్రంష్టుడు వానరులపై బాణములను ప్రయోగించుట మొదలుపెట్టేను ఒక్కో బాణముతో అయిదుగురిని ,ఏడుగురిని ,ఎనిమిదిమందిని కొట్టసాగెను . ఆ బాణపు దెబ్బలకు తట్టుకొనలేక వానరులంతా అంగదుని వద్దకు పరుగులు తీసిరి . రక్తాలొడుతున్న శరీరములతో ఉన్న వానరులద్వారా విషయము గ్రహించిన అంగదుడు వజ్రద్రంష్టుడు తో యుద్ధమునకు సిద్దపడెను . వానరులపై బాణములు వేస్తున్న వజ్రద్రంష్ఠుడిపై ఒక పెద్ద చెట్టుని పీకి విసిరెను . వజ్రద్రంష్టుడు ఏ మాత్రము కంగారుపడకుండా తన బాణముతో ఆ చెట్టుని ముక్కలు చేసెను . వేయి బాణములతో అంగదుని గాయపరిచేను . కానీ అంగదుడు ఆ దెబ్బలను ఏ మాత్రము లెక్కచేయలేదు . 
వెంటనే అంగదుడు పెద్దకొండను తీసుకుని విసిరెను వజ్రద్రంష్టుడు కంగారుపడకుండా ,రథముమీదనుండి కిందకు దూకేను . అంగదుడు విసిరిన కొండవలన వజ్రద్రంష్టుడి రధము నుగ్గునుగ్గయ్యేను . అప్పుడు అంగదుడు పెద్దపెద్ద వృక్షములతో వున్న మరో కొండను తీసుకొచ్చి వజ్రద్రంష్టుడి తలమీద మోదెను . ఆ దెబ్బకు వజ్రద్రంష్టుడు  స్పృహకోల్పోయి కింద పడిపోయెను . కొద్దిసేపటికి తేరుకొనెను . అతడిని చూసిన అంగదుడు అతడితో మరల యుద్ధమునకు దిగెను . ఇద్దరు తమ బాహువులతోనే యుద్ధము చేసుకొనిరి . ఇద్దరి శరీరములు బాగా గాయపడుట వలన రక్తసిత్తములై ఉండెను . ఆ సమయములో అంగదుడు వజ్రద్రంష్టుడి ఒరలో వున్న ఖడ్గమును తీసి అతని ఖడ్గముతో అతడి శిరస్సునే నరికివేసెను . అప్పుడు వజ్రద్రంష్టుడు ప్రాణములు కోల్పోయి నేలపై పడిపోయెను . అది చూసిన రాక్షసులందరూ భయముతో లంక వైపుగా పరుగులు తీసిరి . వానరులంతా అంగదుని చుట్టూ చేరిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదినాలుగవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment