Sunday 8 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదియెనిమిదవసర్గ

                                       రామాయణము 

                                         యుద్ధకాండ -ఏబదియెనిమిదవసర్గ 

మిక్కిలి పరాక్రమశాలి ఐన ప్రహస్తుడు యుద్ధరంగమునకు వచ్చుట చూసిన శ్రీరాముడు ,విభీషణుడిని 'ఇతడెవరు 'అని ప్రశ్నించెను . శ్రీరాముడి మాటలు విని విభీషణుడు "స్వామీ !యితడు రాక్షసరాజైన రావణుడి సర్వసైన్యాధ్యక్షుడు ఇతడి పేరు ప్రహస్తుడు లంకాసేనలోని మూడు విభాగములకు యితడు అధిపతి ,మిక్కిలి బలశాలి "అని సమాధానము చెప్పెను . 
మహాబలశాలి అయిన ప్రహస్తుడు గర్జించుచు ,రాక్షసయోధులతో కలిసి వచ్చుటను అపారమైన వానరసేన చూసేను . అప్పుడు వానరులంతా ఎంతో కోపముతో గర్జించుచు మహావృక్షములను ,శిలలను చేతపట్టుకొనిరి . వానరరాక్షసయోధుల మధ్య భయంకరముగా యుద్ధము సాగెను . అప్పుడు ప్రహస్తుని సచివులైన నరాంతకుడు ,కుంభహనువు ,మహానాధుడు ,సమున్నతుడు అను నలుగురు రాక్షస యోధులు వానరులను చావుదెబ్బతీసిరి . అది చూసిన ద్వివిదుడు ఒక పర్వతశిఖరమును పట్టుకుని 'నారాంతకుడు 'అను వాడిని చావకొట్టెను . దుర్ముఖుడు అను వానరుడు ఒక మహా వృక్షమును తీసుకుని త్రిప్పుతూ 'సమున్నతుడు 'అను రాక్షసుడిని చంపెను . 
జాంబవంతుడు వీరావేశముతో ఒక శిలను చేతితో పట్టుకుని 'మహానాధుడు 'అను రాక్షసుని వక్షస్థలముపై బలముగా కొట్టెను . తారుడు అను కపియోధుడు ఒక వృక్షమును పెకలించి తీసుకువచ్చి ,'కుంభహనువు 'అను రాక్షసుని పరిమార్చెను . తన నలుగురు సచీవులు మరణించుట చూసిన ప్రహస్తుడు వెంటనే వానరులతో ఘోర యుద్ధమునకు దిగెను . అతడు వానరులను ముప్పతిప్పలు పెట్టసాగెను . అదిచూసిన నీలుడు ప్రహస్తునితో యుద్ధమునకు దిగెను నీలుడిని చూసిన ప్రహస్తుడు రెచ్చిపోయి బాణముల వర్షము కురిపించెను . 
వెంటనే నీలుడు ఒక మహావృక్షముని పెకలించి ,ప్రహస్తునిపై బలముగా మోదెను . ఆ దెబ్బ తిన్న ప్రహస్తుడు కోపముతో నీలుడిపై బాణముల వర్షము కురిపించెను . నీలుడు రెచ్చిపోయి వెంటనే ఒక మద్దిచెట్టుని తీసుకుని ప్రహస్తుని రధాశ్వములను చావకొట్టెను . అనంతరము నీలుడు ప్రహస్తుని ధనుస్సుని లాగుకొనెను . ప్రహస్తుడు ఒక రోకలిని తీసుకుని రథముమీదనుండి కిందకు దూకేను . అప్పుడు నీలుడు ఒక మహావృక్షముతో ప్రహస్తుని వక్షస్థలముపై కొట్టెను . నీలుడి దెబ్బకు లెక్కచేయక రోకలిబండతో నీలుని మీదకు దూకేను . ఒక పెద్ద శిలను తీసుకుని ప్రహస్తుని తలపై కొట్టెను . ఆ దెబ్బకు ప్రహస్తుడు మృత్యుముఖుడయ్యెను . ప్రహస్తుడు మరణించుట చూసిన రాక్షసులు ఆనకట్టతెగినా నీటి వలె లంక వైపుగా పరిగెత్తెను . పిదప నీలుడు విజయోత్సాహముతో శిబిరమునకు చేరెను . తోటివాళ్ళందరూ నీలుడిని పరిపరి విధములుగా పొగిడిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment