Monday 9 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదితొమ్మిదవసర్గ

                                      రామాయణము 

                                    యుద్ధకాండ -ఏబదితొమ్మిదవసర్గ 

రాక్షసుల సర్వసైన్యాధ్యక్షుడైన ప్రహస్తుడు మరణించిన విషయము తెలుసుకున్న రావణుడు కోపముతో వుడికిపోతూ రాక్షసప్రముఖులతో "ఇంద్రుని బలములను సైతము దెబ్బతీసిన మన సైన్యాధ్యక్షుడు తన బలముతో సహా నిహతుడైనాడు . మానవమాత్రుడే కదా అని శ్రీరాముడిని ,వానరులేకదా అని అతని సైన్యమును ఉపేక్షించరాదు . వారి విషయములో మనము జాగ్రత్తగా ఉండాలి . కనుక ఇప్పుడే నేను బయలుదేరి రణరంగమునకు వెళ్లెదను . నేడే రామలక్ష్మణులను ,వానరులను యుద్దభూమికి బలి ఇచ్చెదను . "అని పలికి తన సమస్త సైన్యముతోటి యుద్ధరంగమునకు వెళ్ళుటకు సిద్దపడెను . 
యుద్ధరంగమునకు వెళ్లిన రావణుడు చేతిలో వృక్షాలు ,శిలలు ఆయుధాలుగా కలిగిన అపారంగా వున్న వానరసైన్యమును చూసేను . శ్రీరాముడు లంక నుండి యుద్దభూమికి వస్తున్నరాక్షససైన్యములను చూసి విభీషణుడితో "ఈ సైన్యములు ఎవ్వరివి ?ఇప్పుడు యుద్ధమునకు వచ్చు వారెవరు ?"అని ప్రశ్నించెను . అప్పుడు విభీషణుడు "ప్రభూ !మహాకాయుడు ఎర్రని ముఖము కలిగి ఇటువచ్చుచున్న వాడు అకంపనుడు (రాక్షససైన్యములో ఇద్దరు అకంపనులు కలరు . హనుమ చేతిలో మరణించినవాడు రావణుని సేనాధిపతి ,ఇప్పుడు యుద్ధరంగమునకు వచ్చినవాడు రావణుడి కుమారుడు)సిమ్హద్వజము కలిగిన రధము మీద వచ్చినవాడు ఇంద్రజిత్తు బ్రహ్మదేవుడి వరము వలన యితడు యుద్ధరంగములో శత్రువులకు కనపడకుండా యుద్ధముచేయగలడు . పక్కన రథముపై వున్నవాడు 'అతికాయుడు 'రధికులలో శ్రేష్ఠుడు . 
ఉదయించుచున్నసూర్యుని వంటి  నేత్రములు కలవాడు మహోదరుడు . పిడుగు వంటి వేగము కల ఆ రాక్షసుడు 'పిశాచుడు 'ఉన్నతమైన వృషభము  ఎక్కి వస్తున్నవాడు త్రిశరుడు . విశాలమైన వక్షస్థలం కలిగిన ఆ యోధుడు కుంభాసురుడు . యితడు వచ్చుచున్న వీరుడు నికుంభుడు . యితడు కుంభకర్ణుడి కుమారుడు . వారందరిమధ్యలో అసమానమైన తేజస్సుతో ఉన్న వీరుడు రావణుడు . యితడు సమస్త రాక్షసులకు రాజు "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు "ఔరా !రాక్షసేశ్వరుడైన రావణుడు మహా తేజస్సుతో వున్నాడు బలశాలి అయిన రావణుని పక్షమువారందరూ పర్వతమువలె దృఢకాయులు . ఇన్నాళ్లకు యితడు నాకంట పడినాడు . సీతను అపహరించిన దుర్మార్గుడిని వధించి నా  కోపము చల్లార్చుకుంటాను  . "అని పలికెను .  
రావణుడు యుద్ధరంగమునకు వచ్చుట చూసిన సుగ్రీవుడు ఒక పెద్ద పర్వతమును పీకి రావణుడిపైకి ప్రయోగించెను . అది చూసిన రావణుడు ఆ పర్వతమును తన బాణములతో ధ్వంసము చేసి ,సుగ్రీవుడిపైకి తన బాణమును ప్రయోగించెను . ఆ బాణపు దెబ్బకు సుగ్రీవుడు స్పృహతప్పి నేలపై పడిపోయెను . అది చూసిన రాక్షసులందరూ సంతోషముతో మహానాదములు చేసిరి . అప్పుడు గవాక్షుడు ,గవయుడు ,సుద్రంష్టుడు ,ఋషభుడు ,జ్యోతిర్ముఖుడు ,నభుడు మొదలయిన వానరవీరులు పెద్దశిలలు చేతపట్టుకుని రావణుడి మీదకు దాడికి వెళ్లిరి . రావణుడు తన బాణ పరంపరతో ఆ శిలలన్నిటిని నాశనము చేసి ,వారిపై బాణములు కురిపించగా వారు నేలపై పడిపోయిరి . అనంతరము రావణుడు వానరులపై సరవర్షము కురిపించెను . రావణుడి దాటికి తట్టుకొనలేక వానరులందరూ శ్రీరాముడి వద్దకు వెళ్లి శరణు వేడిరి . 
శ్రీరాముడు ధనుర్భాణములు ధరించి యుద్ధమునకు దిగబోగా ,లక్ష్మణుడు "అన్నా !ఆ దుష్టుడికి వధించుటకు నీవు కదలవలసిన పని లేదు . నీ సేవకుడనైన నేను చాలు "అని పలికెను . అప్పుడు శ్రీరాముడు "లక్ష్మణా !అలాగే యుద్ధమునకు వేళ్ళు . కానీ అతడిని సామాన్యుడిగా భావించకు . జాగ్రత్తగా నిన్ను నీవు రక్షించుకొనుచు ,రావణుడి గమనించి యుద్ధము చేయవలెను అతడు మహావీరుడు "అని పలికెను . అప్పుడు లక్ష్మణుడు అన్న మాటలన్నీ సావధానంగా విని ,అన్నాను కౌగలించుకుని ,అన్నకు ప్రదక్షిణ నమస్కారము చేసి ,ధనుర్భాణములు ధరించి యుద్ధరంగమునకు వెళ్లెను . ఆ యుద్ధరంగములో తన బాణములతో వానరులని వధించుచున్న రావణుడిని లక్ష్మణుడు చూసేను . 
ఇంతలో మహాతేజస్వి అయిన హనుమంతుడు రావణుని చూసి అతడి దగ్గరకు వెళ్లి అతడి రధమును ఎత్తి ,అతడితో "రావణా !బ్రహ్మదేవుడి వర ప్రభావమున దేవదానవయక్షగంధర్వులచే చావులేకుండా వరముపొందినావు . వానర మానవులచే చావుతధ్యము . నా ఎడమచేతితో నిన్ను ఇప్పుడే చంపగలను "అని పలికెను . ఆ మాటలు విన్న రావణుడు కోపముతో "వానరా !నీ ప్రతాపమును ఇప్పుడే చూపించు . ఆ పిదప నేను నిన్ను చంపివేయుదును . "అని పలికెను . ఆమాటలు విన్న హనుమ రావణుడితో "రావణా !నీ కుమారుడైన అక్షకుమారుడు నా చేతిలో మరణించిన విషయము గుర్తుతెచ్చుకో . అప్పుడు నా ప్రతాపమేమిటో నీకు తెలుస్తుంది "అని పలికెను . కోపముతో రావణుడు తన అరచేతితో హనుమ వక్షస్థలముపై ఒక దెబ్బ వేసెను . ఆ బిడ్డకు హనుమ అదిరిపడి వెంటనే తేరుకుని తన అరచేతితో ఒక్క దెబ్బ రావణుని కొట్టెను . ఆ దెబ్బకు రావణుడు చలించిపోయెను . ఇది చూసిన ఋషులు ,వానరులు ,సిద్దులు ,దేవతలు అందరూ హర్షద్వానాములు చేసిరి . 
కాసేపటికి తేరుకున్న రావణుడు హనుమ బలమును పొగిడెను . వెంటనే రావణుడు తన అరచేతితో బలముగా మరియొకసారి హనుమను కొట్టెను . ఆ దెబ్బకు హనుమ స్పృహతప్పి పడిపోగా ,రావణుడు నీలుడిపై తన బాణపరంపరను కురిపించెను . ఆ బాణపరంపరను తట్టుకొని నీలుడు ఒక మహా గిరిశిఖరమును తీసుకుని రావణుడిపై ప్రయోగించెను . మూర్ఛనుండి తేరుకున్న హనుమ రావణుని ఎదిరించుటకు చూచి ఇతరులతో యుద్ధముచేయువానితో యుద్ధము చేయరాదని అక్కడనుండి మరొకచోటకి వెళ్లెను . రావణుడు నీలుడు ప్రయోగించిన గిరిశిఖరమును తన బాణములతో ముక్కలు చేసెను . అప్పుడు నీలుడు కోపముతో మద్దిచెట్లనీ ,సాలవృక్షములను ,మామిడిచెట్లను వరుసగా రావణుడి మీదకు విసిరెను . రావణుడు వాటన్నిటిని ధ్వంసము చేసెను . అప్పుడు నీలుడు సూక్ష్మరూపము ధరించి రావణుడి ధ్వజపటముపై కూర్చుండెను . అది చూసిన రావణుడు క్రుద్ధుడయ్యెను . నీలుడు మహానాదమొనర్చెను . నీలుడు ధ్వజపటముపై ధనస్సుమీద ,కిరీటము మీద తిరుగుండుట చూసిన రామలక్ష్మణులు హనుమ మిక్కిలి ఆశ్చర్యపడిరి . రావణుడు అస్త్రములు ప్రయోగించబోగా నీలుడు తిరుగుతుండుటచే కుదరక మిన్నకుండిపోయెను . అది చూసిన వానరులందరూ సంతోషముతో కోలాహలధ్వనులు చేయుచు ,గంతులు వేసిరి . 
సూక్ష్మరూపమున తనను ఇబ్బందిపెడుతున్న నీలునిపై ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను . ఆ అస్త్రము నీలుని వక్షస్థలమునకు తగలగా అగ్నిపుత్రుడైన నీలుడు తండ్రి ప్రభావమున మరణించక స్పృహతప్పెను . స్పృహతప్పిన నీలుడిని చూసిన రావణుడు అతడి విషయము వదిలి లక్ష్మణుడివైపుగా వెళ్లెను . లక్ష్మణుడిమీద అనేక బాణములను ప్రయోగించెను . ఆ బాణములను లక్ష్మణుడు మధ్యలోనే త్రుంచి ,తానూ అనేక బాణములను రావణుడిపై ప్రయోగించేను . రావణుడు లక్ష్మణుని యుద్ధపటిమకు మెచ్చుకుని ,బ్రహ్మదేవుడు ఇచ్చిన బాణమును లక్ష్మణుని నుదిటిన తగిలేలా కొట్టెను ఆ దెబ్బకు లక్ష్మణుడు చలించిపోయెను . పిమ్మట లక్ష్మణుడు తేరుకుని రావణుడి ధనుస్సుని విరగకొట్టి ,రావణునిపై మూడు బాణములను ప్రయోగించేను . రావణుడు స్పృహతప్పిపోయి కాసేపటికి తేరుకొనెను . అప్పుడు రావణుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన శక్తి ఆయుధమును లక్ష్మణునిపై ప్రయోగించెను . లక్ష్మణుడు తన బాణములతో దానిని భగ్నమొనర్చాలని ప్రయత్నించినా ఆ అస్త్రము లక్ష్మణుని వక్షస్థలములో బలముగా నాటుకొనెను . లక్ష్మణుడు మూర్ఛపోయెను . మూర్ఛితుడైన లక్ష్మణుని ఎత్తుకుపోవుటకు రావణుడు ప్రయత్నించేను . అప్పుడు హనుమ తన పిడికిలితో రావణుని వక్షస్థలమున బలముగా కొట్టెను . ఆ దెబ్బ తట్టుకొనలేక రావణుడు మోకాళ్లపై చతికిలపడెను . అతని నోటినుండి ,చెవుల నుండి ,కళ్ళనుండి రక్తము కారేను . రావణుడు ఎలాగోలా రధముచేరికూలబడెను . అప్పుడు హనుమ లక్ష్మణుని ఎత్తుకుని రాముని వద్దకు చేర్చెను . 
కొంతసేపటికి లక్ష్మణుడు తేరుకొనెను . రావణుడు కూడా తేరుకుని తిరిగి వానరులపై తన బాణవృష్టిని కురిపించసాగెను . అప్పుడు శ్రీరాముడు హనుమ అభ్యర్థనమేరకు హనుమ భుజములపై కూర్చుని యుద్ధరంగమునకు వెళ్లెను . శ్రీరాముడు యుద్ధరంగములో వున్న రావణుని చూసి అతడితో "ఓ దుష్ట రావణా !నీవు నా పట్ల ఘోర అపరాధము చేసితివి . ఇన్నాళ్లు నాకు కనపడకుండా వున్నందువలన ప్రాణములతో వున్నావు . ఇప్పుడు నాకు కనిపించావు . నేను నీ పాలిట మృత్యువుని "అని పలికెను . ఆ మాటలు విన్న రావణుడు రాముని మోయుచున్న హనుమపై బాణములు వేసెను . అది చూసి కోపించిన రాముడు తన బాణములతో రావణుని రాధా చక్రములను ,ధ్వజపటమును ,రధసారధిని ధ్వంసముచేసెను . రావణుడు వేసే బాణములను అన్నిటిని నిర్వీర్యము చేసెను . పిమ్మట శ్రీరాముడి బాణమునకు రావణుడి విల్లు విరిగిపోయెను . రావణుడు యుద్ధభూమిలో నేలపై ఆయుధములేకుండా ఉండుట చూసిన రాముడు అతని కిరీటమును ధ్వంసముచేసి రావణునితో "రావణా !నీవు గొప్ప యుద్ధము చేసినావు . నా పక్షమున అనేకమంది వానరులను చంపినావు . నీవు చాలా అలసి వున్నావు . పైగా నీ వద్ద ఆయుధము ,రధము లేదు . లంకకు వెళ్లి విశ్రాన్తి తీసుకుని రేపు రా "అని పలికెను . రావణుడు లంకకు వెళ్లెను . రావణుడు అవమానంతో తలవంచుని వెళ్ళుట  చూసిన దేవతలు, సిద్దులు ,వానరులు సంతోషించిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదితొమ్మిదవసర్గసమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment