Sunday 15 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదిఆరవసర్గ

                                      రామాయణము 

                                   యుద్ధకాండ -అరువదిఆరవసర్గ 

పెద్ద పర్వతము వంటి బయంకరాకారుడైన కుంభకర్ణుడు యుద్ధభూమిలో అడుగు పెట్టగానే . అతడి భయంకరమైన ఆకారమును చూసి కొందరు వానరులు పారిపోసాగిరి . అది చూసిన నలుడు ,నీలుడు ,గవాక్షుడు మొదలగు వానర ప్రముఖులు వారితో "వానరులారా !మీరు బయపడి పారిపోవలదు . రాక్షసులు శత్రువులను బయపెట్టుటకు సాదారణముగా ఇటువంటి ఆకారములను ధరిస్తారు . కనుక ఇదంతా మాయ . మన ప్రతాపము ముందు రాక్షసుల ప్రతాపము ఎట్టిది ?మన ప్రభువైన శ్రీరామ చంద్రుని ప్రతాపమును తట్టుకొని ఎదురు నిలబడగల వీరుడు ఎవ్వడు లేడు . మీరు బయపడకు యుద్ధము చేయండి "అని పలికెను . 
ఆ మాటలు విన్న వానరులు ధైర్యము తెచ్చుకుని అనేకమైన రాళ్లను ,చెట్లను కుంభకర్ణుడి మీదకు విసిరిరి . అవి కుంభకర్ణుని తాకినంతనే ,అవి నుగ్గునుగ్గయినవి . కుంభకర్ణుడు కోపముతో వానరులపై తన ప్రతాపమును చూపించెను . వానరులను విసిరివేసెను . కొందరిని అణగతొక్కేను . అతడి బీభత్సమును చూసిన వానరులు కొందరు సముద్రములో పడిరి ఇంకొందరు ఆకాశములో ఎగురుతూ పారిపోసాగిరి . మరి కొందరు చెట్లనెక్కి ,ఇంకొందరు పర్వతములో ,గుహలలో దాగుకొనిరి . మిగిలినవారు వచ్చినదారినే మరలిపోవుటకు సిద్దమయ్యిరి . వారిని చూసిన అంగదుడు వారికి ధైర్యము చెప్పి తిరిగి యుద్ధరంగమునకు తీసుకు వచ్చెను . అప్పుడు ఋషభుడు ,శరభుడు ,మైందుడు ,ధూమ్రుడు ,నీలుడు ,కుముదుడు ,సుషేణుడు ,గవాక్షుడు ,రంభుడు ,తారుడు ,ద్వివిదుడు ,పనసుడు ,హనుమంతుడు మున్నగు వానర ప్రముఖులు కుంభకర్ణుని ఎదుర్కొనుటకు త్వరత్వరగా కదిలిరి . 

రామాయణము యుద్ధకాండ అరువదిఆరవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment