Thursday 26 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదియేడవసర్గ

                                    రామాయణము 

                                 యుద్ధకాండ -అరువదియేడవసర్గ 

అంగదుని ప్రోత్సాహముతో ఉత్సాహితులైన హనుమదాది వానరవీరులు తిరిగి సమరభూమికి యుద్ధకాకాంక్షతో వెళ్లిరి . అప్పుడు కుంభకర్ణుడు గదను చేతపట్టి దొరికిన వానరుడిని దొరికినట్టు విసిరివేసెను . కుంభకర్ణుని దెబ్బకు వానరుల దేహములన్నీ చెల్లాచెదురయ్యెను . కుంభకర్ణుడు ఇంకా రెచ్చిపోయి ,ఒకేసారి ఏడుగురిని ,పదిమందిని ,ఇరువదిమందిని ,ముప్పదిమందిని రెండుచేతులతో కబలించుచుండును . అప్పుడు వానరులు ధైర్యము తెచ్చుకుని ,పెద్దపెద్ద వృక్షములు రాళ్లను పట్టుకుని యుద్ధమునకు సిద్ధమయ్యెను . ద్వివిదుడు అను వానరుడు పర్వతమును తీసుకువచ్చి కుంభకర్ణుని మీదకు విసిరెను . కానీ ఆ పర్వతము కుంభకర్ణుని చేరక ,అతడి సైన్యముపై పడెను . ఆ దాటికి కుంభకర్ణుని సైన్యము ,రథములు ,గుఱ్ఱములు నుగ్గునుగ్గయ్యేను . వెంటనే ద్వివిదుడు మరో శిఖరము ను విసరగా ఇంకా కొంతమంది రాక్షస సైనికులు ,రథములు ,గుఱ్ఱములు చనిపోయెను . 
అప్పుడు ధైర్యము తెచ్చుకున్న వానరులు రాక్షసుఁలను ,వారి గుఱ్ఱములను నుగ్గునుగ్గు చేయసాగిరి . హనుమంతుడు ఆకాశములో నిలిచి ,అనేక వృక్షములను ,రాళ్లను కుంభకర్ణుని మీద వర్షించసాగెను . కుంభకర్ణుడు వాటన్నిటిని తన శూలముచే ముక్కలు చేసెను . అప్పుడు హనుమ ఒక గిరిశిఖరమును కుంభకర్ణుని మీదకు విసిరెను . ఆ దెబ్బకు కుంభకర్ణుని శరీరమంతా రక్తసిత్తమయ్యెను . అప్పుడు కుంభకర్ణుడు తన శూలముతో హనుమను వక్షస్థలముపై కొట్టెను . ఆ దెబ్బకు హనుమ ఒక మహానాదం చేసెను . గాయపడిన హనుమను చూసిన రాక్షసులు సంతోషించిరి . వానరులు భయపడిరి . అప్పుడు వానరులకు ధైర్యము చెప్పి నీలుడు ,ఋషభుడు ,శరభుడు ,గవాక్షుడు ,గంధమాదనుడు అను వానరులు కుంభకర్ణుని వైపుగా పరుగు తీసిరి . వారందరూ కుంభకరుని అనేక వృక్షములతో ,గిరిశిఖరములతో ,చేతులతో పిడికిళులతో కొట్టిరి . అప్పుడు కుంభకర్ణునికి దెబ్బ తగలలేదు సరికదా తాకినట్టు కూడా అనిపించలేదు . అప్పుడు కుంభకర్ణుడు ఆ వానరప్రముఖులను గట్టిగా కొట్టెను . అది చూసిన వానరులు పెద్ద సంఖ్యలో కుంభకర్ణుని వైపుగా పరుగిడిరి . తనవైపుగా వచ్చిన వానరులను చేతితో పట్టుకుని ,నోటిలో వేసుకోసాగేను . దొరికినవాళ్లను కాళ్లతో తొక్కసాగెను . కుంభకర్ణుని దాటికి భయపడిన వానరులు శ్రీరామునితో మొరపెట్టుకొనెను . 
అప్పుడు అంగదుడు కుంభకర్ణుని మీదకు దూకి వక్షస్థలం పై బలముగా కొట్టెను . ఆ దెబ్బకు కుంభకర్ణుడు కొద్దీ సేపు స్పృహ తప్పెను . అంతలోనే తేరుకుని అంగదుని కొట్టగా అతడు స్పృహతప్పి నేలపై పడిపోయెను . వెంటనే కుంభకర్ణుడు సుగ్రీవునిపై దాడికి వెళ్లెను తన మీదకు వస్తున్న కుంభకర్ణుని చూసిన వానరరాజు ఆకాశములోకి ఎగిరి ఒక పర్వతశిక్షరమును త్రిప్పి త్రిప్పి అతడి వక్షస్థలముపై కొట్టెను . అప్పుడు ఆ పర్వతము ముక్కముక్కలయ్యేను . కుంభకర్ణుని దాటికి సుగ్రీవుడు కూడా స్పృహ తప్పెను . స్పృహ తప్పిన సుగ్రీవుడిని కుంభకర్ణుడు  లంకకు ఎత్తుకుపోసాగెను . అది చూసిన వానరులు హాహాకారములు చేసిరి . లంకలోకి శత్రువును ఎత్తుకుని వస్తున్న కుంభకర్ణునిపై భవనములపై నుండి పుష్పవర్షము కురిపించిరి . లంకలోకి వెళ్తుండగా ,సుగ్రీవునికి స్పృహ వచ్చెను చుట్టూ చూసి పరిస్థితి అర్ధమవ్వుటచే ,సుగ్రీవుడు కుంభకర్ణుని గోళ్ళతో రక్కుతూ ,పళ్లతో కొరుకుతూ బాధించసాగెను . అది తట్టుకొనలేక కుంభకర్ణుడు సుగ్రీవుని నేలపై బలముగా విసిరికొట్టెను . అప్పుడు రాక్షసులు సుగ్రీవుని బాగా కొట్టిరి . వారి నుండి తప్పించుకుని ,ఆకాశములోకి ఎగిరి శ్రీరాముని వద్దకు సుగ్రీవుడు చేరాడు . 
రక్తసిత్తమైన శరీరముతో కుంభకర్ణుడు సుగ్రీవుడు తప్పించుకుని పోవుటచే కోపముతో ఊగిపోతూ ,వెంటనే మళ్లీ యుద్దభూమికి వెళ్లెను . అతడు కోపముతో ఆకలితో ఊగిపోతూ ,యుద్ధభూమిలో దొరికినవాడిని దొరికినట్టు అతడు వానరుడా ,రాక్షసుడా అని చూడకుండా అందరిని తినసాగేను . అతడు ఒకేసారి పది మందిని ,ఇరువది మందిని ,వందమందిని ఒకేసారి చేతితో తీసుకుని భక్షించసాగెను . భయపడిన వానరులు శ్రీరాముని వద్దకు పరుగిడిరి . అప్పుడు శ్రీరాముడు ధనుస్సుని ధరించి వాయువ్యాస్త్రమును మంత్రించి ప్రయోగించెను . ఆ అస్త్ర దెబ్బకు కుంభకర్ణుని చేయి తెగి పడిపోయెను . ఆ చేయి కింద నున్న కొంతమంది వానరులపై పడుటచే కొందరు వానరులు మరణించిరి . మరి కొంత మంది గాయపడిరి . శ్రీరాముడు అర్ధచంద్రాకార బాణములను రెండింటిని కుంభకర్ణునిపై వేయగా అతడురెండు కాళ్ళు తెగిపోయెను . అప్పుడు శ్రీరాముడు ఇంద్రాస్త్రముతో కుంభకర్ణుని శిరస్సుని ఖండించెను . కుంభకర్ణుని శిరస్సు శ్రీరాముడు తన బాణములతో ఖండించినప్పుడు ,ఎగిరి లంకలో పడెను . అది పడున్నప్పుడు తగులుటచే రాజవీధులకు ఇరువైపులా కల గృహాగోపురములు ముక్కలైపోయెను . ప్రాకారము కూలిపోయెను . దేవతలు సంతోషముతో జయజయద్వానములు చేసిరి . అప్పుడు వానరులంతా మిక్కిలి సంతోషించిరి . 

రామాయణము యుద్ధకాండ అరువదియేడవసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment