Tuesday 10 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదియొకటవసర్గ

                              రామాయణము 

                            యుద్ధకాండ -అరువదియొకటవసర్గ 

భయంకరమైన ,పర్వతము వంటి ఆకారము కల కుంభకర్ణుని ,అతడిని చూసి పారిపోతున్న వానరులను చూసిన శ్రీరాముడు విభీషణుడితో "విభీషణా !ఇతడెవరు ?ఇంతటి పెద్ద భయంకరమైన ఆకారము కల రాక్షసుడిని నేను ఇంతవరకు చూడలేదు . ఇతడి పరాక్రమము ఎట్టిది ?"అని ప్రశ్నించెను . 
ఆ మాటలు విన్న విభీషణుడు "మహాప్రభూ !యితడు విశ్రవసుని కుమారుడు . ఇతడి పేరు కుంభకర్ణుడు . యితడు పుట్టినప్పటినుండే మహా బలవంతుడు . ఇతడికి బ్రహ్మదేవుడు ఆరునెలలు నిద్ర ,ఒక రోజు ఆహారము విధించెను . యితడు అనేకసార్లు దేవతలను సైతము యుద్దములో తరిమికొట్టాడు . ఇప్పుడు యుద్ధము కోసము రావణుడు ఇతడిని నిద్రనుండి లేపించి ఉంటాడు . అతడిని చూసి భయముతో మన వానరులు ఇలా పరుగెతున్నారు . అతడు రణరంగములో పరుగులుపెట్టిన అతడిని ఎదిరించుట కష్టము , మన సైన్యము కూడా అతడి ముందు నిలబడలేదు . కనుక ముందు వారికి ధైర్యము చెప్పవలెను "అని పలికెను . 
విభీషణుడి మాటలు విన్న శ్రీరాముడు నీలుడిని సమస్తసైన్యముతో లంకను మోహరించి యుద్ధమునకు సిద్ధముగా ఉండమని ,పారిపోవుతున్న వానరులకు ధైర్యము చెప్పమని ,అనేక వృక్షములను ,శిలలని ప్రోగుచేయమని ఆజ్ఞ ఇచ్చెను . శ్రీరాముని ఆదేశము ప్రకారము పారిపోవుచున్న వానరులకు ధైర్యము చెప్పి ,శిలలతో వృక్షములతో లంక నాలు ద్వారముల వద్ద వానరులు యుద్దమునకై సిద్ధముగా ఉండిరి . 

రామాయణము యుద్ధకాండ అరువదియొకటవసర్గ సమాప్తము . 

                                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment