Sunday 15 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువది అయిదవసర్గ

                                రామాయణము 

                               యుద్ధకాండ -అరువది అయిదవసర్గ 

మహోదరుని మాటలు విన్న కుంభకర్ణుడు మహోదరునితో "మహొదరా !సహజముగా బయాస్వభావులు ఇటువంటి మాటలు మాట్లాడతారు . మీవంటి వారి మాటలు వినుట వలనే మహారాజుకి ఇప్పుడు ఈ ఆపద వచ్చిపడినది . మీ వంటివారంతా మహారాజు అభిమానము పొందుటకు అతడేమి చేసినను సమర్ధించుచు వుండెదరు . "అని పలికి రావణునితో 
"అన్నా !నేను ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరి యుద్ధమునకు వెళ్లి నీకు ఆందోళన కలిగించుచున్న ఆ రాముడిని హతమార్చెదను . నాకు సైన్యము కూడా అవసరము లేదు . "అని పలికెను . ఆ మాటలు విన్న రావణుడు "నాయనా !కుంభకర్ణా !నీవు యుద్ధమున ఆరితేరినవాడవు . శ్రీరాముడంటే ఈ మహోదరునికి చాలా భయము . అందులకే ఈ విధముగా పలుకుచున్నాడు . నాకు కల బంధువులలో నీవంటి ఆత్మీయుడు సమర్థుడు లేడు . శత్రువును జయించి విజయోత్సాహముతో వచ్చుటకు ఇప్పుడే బయలుదేరి రణరంగమునకు వెళ్లుము . అందులకే నిన్ను నిద్ర నుండి మేల్కొల్పినది . వానరులు కపట స్వభావులు . కావున నీవు వంటరిగా యుద్ధమునకు వెళ్ళవద్దు . నీ సైన్యమును తీసుకువెళ్ళు "అని పలికి కుంభకర్ణుని వివిధ ఆభరణములతో తానె స్వయముగా అలంకరించెను . పిమ్మట కుంభకర్ణుని ఆశీర్వదించెను . 
పిమ్మట కుంభకర్ణుడు రావణుని చుట్టూ ప్రదక్షిణ చేసి శిరస్సు వంచి నమస్కారము చేసి ,యుద్ధమునకు బయలుదేరుతూ తన సైన్యమునకు ఉత్సాహము కలిగించు విధముగా మాట్లాడేను . పిమ్మట అతడు సైన్యముతో సహా యుద్ధరంగమునకు వెళ్తుండగా వారికి అనేక అపశకునములు కనిపించినవి . అయినను చావు మూడిన కుంభకర్ణుడు ఆగక యుద్ధరంగమునకు వెళ్లెను . 

                        రామాయణము యుద్ధకాండ అరువది అయిదవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













No comments:

Post a Comment