Sunday 31 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది తొమ్మిదవ సర్గ

                                 రామాయణము 


                      బాలకాండ -ముప్పది తొమ్మిదవ సర్గ 

విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయములు విని రాముడు మిక్కిలి సంతోషి ఆ మునితో ఇలా పలికెను . 
"ఓ మహాత్మా !మా వంశమున ప్రముఖుడు అయిన సగర మహారాజు యజ్ఞము చేసిన విధము వినగోరుచున్నాము . దయతో వివరించండి . "
అప్పుడు విశ్వామిత్రుడు "ఓ రామా !మహాత్ముడైన సగరుని వృత్తాన్తమును వివరించెదను వినుము . "అని పలికెను . హిమవంతుడను పర్వత రాజు శంకరునకు మామ . హిమవత్పర్వతమునకు ,వింధ్య పర్వతమునకు మధ్య ఎత్తైన గిరులు లేకుండుటచే ఆ రెండు పరస్పరము చూచుకొనునట్లు ఉండెను . ఆ రెండు పర్వతముల మధ్య ప్రదేశమునందు ఈ యజ్ఞము జరిగెను . ఓ పురుషోత్తమా !ఆర్యావర్తనము గా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశము యజ్ఞ కర్మలకు అనువయినది . నాయనా! రామా !మహారథుడైన అంశుమంతుడు శక్తివంతములైన ధనుర్భాణములను ధరించి ,సగరుని ఆజ్ఞ మేరకు ఆయన యజ్ఞాశ్వమును అనుసరించెను . 
ఇంద్రుడు మాయామయ శరీరము దాల్చి 'ఉక్డ్యాము 'అను పర్వ దినమున సగరుని యొక్క యజ్ఞాశ్వమును అపహరించెను . అప్పుడు ఋత్వుజులు అందరూ సగరునితో ఇలా పలికిరి . "ఓ సగరా !యజ్ఞాశ్వమును ఎవరో అపహరించుకుపోయారు . ఆ హయమును అపహరించిన వారిని చంపి దానిని తీసుకు రమ్ము . యజ్ఞమునకు భంగము కలిగినచో అరిష్టము సంభవించును . కనుక ఓ రాజా !యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగునట్లు చూడుము . "
అప్పుడు సగరుడు తన 60,000 మంది పుత్రులను పిలిచి నేను యజ్ఞ దీక్షలో వున్నాను కావున ఆ యజ్ఞాశ్వము ఎక్కడ వుందో కనిపెట్టి దానిని తీసుకురమ్మని ఆజ్ఞాపించెను . ఈ భూమండలమున    యజ్ఞాశ్వము జాడ దొరకనిచో భూమిని త్రవ్వి అయినా అది కనపడునంతవరకు వెదుకుడు . యజ్ఞాశ్వము అపహరించినవాడిని కూడా అన్వేషించి పట్టుకొనమని ఆజ్ఞాపించెను .
ఓ రామా !మిక్కిలి బలశాలురు అయిన ఆ 60,000 మంది భూమండలమంతయూ యజ్ఞాశ్వము కొఱకు వెతికి దాని జాడ కానరాక ,వజ్ర సమానములైన తమ గోళ్ళతో భూమిని త్రవ్వుట మొదలుపెట్టేను . వారు అలా త్రవ్వు తుండగా పాతాళములో నివశించే పాములు ,రాక్షసులు ,గంధర్వులు భయ కంపితులై గగ్గోలు పెట్టెను . ఆ సగర పుత్రులు ఆ విధముగా పాతాళము వరకు త్రవ్వి కనపడిన వారిని కనపడినట్టు వీడే యజ్ఞాశ్వమును అపహరించినది అంటూ చంపసాగిరి . దానితో భయ కంపితులు ఐన దేవతలు ,గంధర్వులు ,నాగులు అసురులు మొదలగువారు బ్రహ్మ వద్దకు వెళ్లి దీన వదనములతో ఇలా విన్నవించుకొనిరి 

రామాయణము బాలకాండ ముప్పది తొమ్మిదవసర్గ సమాప్తము . 


               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

 












Saturday 30 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది ఎనిమిదవ సర్గ

                                 రామాయణము 

                                 బాలకాండ -ముప్పది ఎనిమిదవ సర్గ 

విశ్వామిత్రుడు ఇంకనూ ఇలా చెప్పెను . పూర్వము" సగరుడు "అనే మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను . అతడు మహా వీరుడు ,ధర్మాత్ముడు ఆయనకు సంతానము లేకపోవుటచే తన ఇద్దరు భార్యలు అయిన 'కేశిని ','సుమతి ' అను వారితో కలిసి హిమవత్పర్వతము మీద  భృగు మహర్షి కొరకు  తపస్సు ఆచరించెను . అంత ఆయనకు తపమునకు మెచ్చిన భృగు మహర్షి "పుణ్యాత్ముడైన ఓ మహారాజా !నీకు అనేకమంది పుత్రులు కలుగుతారు . నీకు ఒక భార్య నందు వంశోద్ధారకుడు అయినా ఒక పుత్రుడు ,మరొక భార్య నందు 60,000 మంది పుత్రులు జన్మిస్తార"ని చెప్పగా ,సగరుని భార్యలు మాలో ఎవరికీ ఒక పుత్రుడు ,ఎవరికీ 60,000 మంది పుత్రులు జన్మిస్తారని అడిగెను . అప్పుడు భృగు మహర్షి మీలో ఎవరికీ వంశోద్ధారకు అయిన ఒక పుత్రుడు కావాలి అని అడిగెను . అప్పుడు సగర మహారాజు పెద్ద భార్య ,విదర్భ రాజా కుమార్తె అయిన 'కేశిని 'నాకు వంశోద్ధారకుడు ఆయిన ఒక పుత్రుడు కావాలని అడిగెను . సగరుని రెండవ భార్య ,గరుత్మంతుని సోదరి అయిన 'సుమతి 'మహోత్సాహులు ఆయిన పెక్కు మంది కుమారులు కావాలని కోరుకొనెను . 
ఓ రఘు నందనా !అనంతరము సగరమహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షికి ప్రదక్షణ ,నమస్కారము చేసి అయోధ్యా పురమునకు వెళ్లెను . కొంత కాలమునకు సగరుని పెద్ద భార్యకు 'అసమంజసుడు 'అనే కుమారుడు కలిగెను . రెండవ భార్య నందు 60,000 మంది పుత్రులు పుట్టిరి వారిని దాదులు నేతి కుండలయందు పెంచిరి . 
ఓ నరోత్తమా !రామా !సగరుని పెద్ద కుమారుడు అయిన అసమంజసుడు నిత్యమూ నగరంలోని బాలురుని తీసుకువెళ్లి సరయు నదిలో పడవేసెను . ఇలా అసమంజసుడు పెక్కు చెడ్డ పనులను చేసెను . మంచి వారిని భాదించెను . పౌరులకు హాని కలిగించెను . అందువలన సగరుడు ఆ కుమారుడిని నగరము నుండి వెళ్లగొట్టెను . 
అసమంజసుని కుమారుడైన 'అంశుమంతుడు 'గొప్ప పరాక్రమమంతుడు . అతడు ప్రజలందరికి ప్రీతీ పాత్రుడు . అందరితో ప్రియముగా మాట్లాడుచుండెను . ఓ నరశ్రేష్టా !కొంత కాలమునకు సగర మహారాజు యజ్ఞము చేయవలెనని సంకల్పించెను . వేదజ్ఞుడైన సగర మహారాజు గురువులతో ,ఋత్విజులతో కూడి యజ్ఞ కార్యమును ఆరంభించెను . 

రామాయణము  బాలకాండ ముప్పది ఎనిమదవ సర్గ సమాప్తము . 


                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
















Friday 29 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది ఏడవ సర్గ

                                రామాయణము 

                                బాలకాండ -ముప్పది ఏడవ సర్గ 

సైన్యాధిపతి కొరకు దేవతలు ప్రార్ధించగా బ్రహ్మ దేవుడు శివ తేజస్సుతో జన్మించిన కార్తికేయుడిని సైన్యాధిపతిగా నియమించెను . అతడు ఒక దినము మాత్రమే కృత్తికలు పాలను తాగి రాక్షసులను చంపివేసెను .ఓ రామా !కుమారశ్వామిపై భక్తి కలిగిన మానవుడు ఈ లోకమున దీర్ఘఆయుష్మంతుడై పుత్ర పౌత్రులతో వర్ధిల్లును . అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పెను . 

రామాయణము బాలకాండ ముప్పది ఏడవ సర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .

                              

Thursday 28 July 2016

                             రామాయణము 

                              బాలకాండ -ముప్పది ఆరవసర్గ 

విశ్వామిత్రుడు చెప్పిన గాధను విన్న శ్రీరాముడు గంగా వృత్తాo తమును సంపూర్ణముగా తెలిపమని అడిగెను . దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పెను . 
"ఓ రామా !పరమేశ్వరుడు పార్వతిని వివాహమాడిన పిమ్మట పెక్కు కాలము వారికి సంతానము కలగలేదు . దీర్ఘ కాలము తర్వాత శివునికి సంతానము కలిగిన ఆ తేజో మూర్తి ప్రభావమును లోకము తట్టుకోలేదని ,దేవతలు ప్రార్ధించగా వారి ప్రార్ధనలు విని శివుడు పార్వతితో కలసి తపస్సు చేసెను . అప్పుడు శివుడు దేవతలతో "స్వస్థానము నుండి కదిలిన నా తేజస్సు ఎవరు ధరింపగలరు "అని అడిగెను . వారు భూమాత ధరిస్తుందని చెప్పెను . 
శివ తేజస్సు పర్వతములతో ,వనములతో కూడిన భూమి అంటా వ్యాపించెను . అప్పుడు దేవతలు అగ్ని దేవుడిని ఆ తేజస్సుని భరించమని అడిగెను . అగ్నిచే వ్యాప్తమైన శివ తేజస్సు  స్వేత పర్వతము అయ్యెను . అచట రెల్లుగడ్డి ఏర్పడెను . అక్కడ మహా తేజశ్వి అయిన కుమారశ్వామి జన్మించెను . కృత్తికలు పాలిచ్చి పెంచుటచే కార్తికేయుడు అని ,అగ్నిచే ధరింపబడుట వలన అగ్ని సంభవుడు అని అతడు ప్రసిద్ధి వహించెను . 
అప్పుడు పార్వతి దేవతలతో "ఓ దేవతలారా !నాకు అప్రియమైన పనిని చేసినందుకు మీ పత్నులు సంతానవతులు కాకుండురు గాక !"అని శపించెను . భూమాతని "పెక్కు మంది రాజులకు భార్యవు అవుతావు" అని శపించెను . పార్వతీ పరమేశ్వరులు కైలాశ పర్వతమునకు చేరి తపస్సు చేయసాగెను . 





రామాయణము బాలకాండ   ముప్పది ఆరవ సర్గ సమాప్తము . 


                                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                               







Wednesday 27 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది ఐదవ సర్గ

                                 రామాయణము 


                                     బాలకాండ -ముప్పది ఐదవ సర్గ 

విశ్వామిత్రుడు మహర్షులతోను ,రామలక్ష్మణులతోను కలసి ఆ రాత్రి అక్కడే గడిపిరి . తెల్లవారి లేచి ప్రయాణమునకు ఉపక్రమించెను . శోణ నది ఇసుక తిన్నెలతో నావ ప్రయాణమునకు అనువుగా లేకుండెను . ప్రయాణ మార్గములను బాగా ఎరిగిన విశ్వామిత్రుడు చూపిన దారిన మునులు ,రామలక్ష్మణులు అనుసరించెను . చాలా దూరం నడిచిన పిమ్మట గంగా తీరమునకు చేరిరి . అక్కడ విశ్రమించిరి . ఆ సమయములో శ్రీరాముడు విశ్వామిత్రుడిని ఇలా అడిగెను . 
"ఓ మహానుభావా !స్వర్గ ,మర్త్య ,పాతాళ లోకములలో ప్రవహించు గంగా వృత్తాoతమును దయతో తెలుపుము "అని కోరగా ,విశ్వామిత్రుడు ఇలా తెలిపెను . 
"ఓ రామా !హిమాలయము అను ఒక మహా పర్వతము కలదు . అది గిరులలో శ్రేష్టమైనది ఆ హిమవంతునికి ఇద్దరు కుమార్తెలు . వారిలో పెద్దది గంగ ,రెండవ కుమార్తె ఉమాదేవి . ఒకనాడు దేవతలు లోక ప్రయోజనార్ధమై గంగను తమకు అప్పగింపమని హిమవంతుని కోరారు . అంతట ధర్మాత్ముడైన హిమవంతుడు తన కూతురు గంగను ముల్లోకములు హితము కొరకై వారికి అప్పగించెను . ఆ విధముగా గంగాదేవి ఆకాశమునకు చేరింది . 
హిమవంతుని రెండవ కుమార్తె పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి ఆయన భార్య అయ్యెను . ఈ విధముగా హిమవంతుని ఇద్దరు పుత్రికలు లోక పూజ్యులు అయ్యిరి . 

రామాయణము  బాలకాండ ముప్పది ఐదవ సర్గ సమాప్తము . 



                      శశి ,

ఎం . ఏ ( తెలుగు ),తెలుగు పండితులు . 




                                   

                          









































Wednesday 13 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది నాల్గవ సర్గ

                              రామాయణము 


                                  బాలకాండ -ముప్పది నాల్గవ సర్గ 

ఓ రామా !ఆ బ్రహ్మ దత్తుడు వివాహము చేసుకొని కాంపిల్య నగరమును వెళ్లిన పిమ్మట పుత్రలు లేని కుశనాభుడు పుత్ర ప్రాప్తికై 'పుత్రకామేష్టి యాగమును ఆచరించెను . బ్రహ్మ మానస పుత్రుడు మిక్కిలి ఉదారుడు అయిన కుశుడు తన కుమారుడైన కుశనాభుని పుత్ర కామేష్టి యాగము వద్దకు వచ్చి ఇలా పలికెను . 
"ఓ కుమారా సర్వ సద్గుణములచేతఁ నీకు దీటైన పుత్రుడు నీకు కలుగును . అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకమున చిరస్థాయిగా ఉంటాయి . "అని పలికి ఆకాశ మార్గమున బ్రహ్మ లోకమునకు చేరెను . కొంత కాలమునకు కుశనాభునికి అతని భార్యఘృతాచి  నందు గాది అను పుత్రుడు కలిగెను . అతడే నా తండ్రి నేను కుశ వంశమున పుట్టాను కావున నాకు కౌశికుడు అనే పేరు కూడా కలదు . ఓ రాఘవా సత్యవతి అనే ఆమె నాకు అక్క చక్కని వ్రత నిష్ఠ కలిగినది . ఆమెకు ఋచీకునితో వివాహము జరిగెను . మా అక్క కూడా కుశ వంశమున పుట్టినది కావున ఆమెను కౌశికి అని కూడా పిలుతురు . ఆమె పతి అనుకూలవతి ఐ ప్రవర్తించుచుండేది . కనుక ఆమె పతి మరణించిన పిదప అతడితో పాటు సశరీరంగా స్వర్గమునకు చేరెను . 
పిమ్మట ఆమె కౌశికి అనే పేరుతో నదిగా భూలోకమున ప్రవహించుచుండెను . ఆమె హిమగిరిని ఆశ్రయించి ఉండెను . ఓ రఘునందనా నేను నా సోదరిమీద గల ప్రేమతో హిమాలయ ప్రాంతమున నేను నివశించుచున్నాను . ఆ సత్యవతి పవిత్రురాలు . సత్యము ,ధర్మము ఆమెకు ప్రాణ తుల్యములు . ఓ రామా ! ఈ క్రతు నిర్వహణార్ధమై ఆ ప్రాంతము నుండి ఇక్కడకి వచ్చితిని . ఓ రామా !నా కథాప్రసంగముతో కొంత రాటెయ్ గడిచింది రేపటి మన ప్రయాణమునకు ఇబ్బంది లేకుండా ఇక నిదురింపుడు . నీకు శుభమగును . అంతట రామలక్ష్మణులు ,మిగిలిన మునులు విశ్వామిత్ర మహాముని వైభవమునకు ఆశ్చర్యపడిరి . ఆ మహర్షిని మెచ్చుకొనిరి . పిమ్మట వారు నిద్రలోకి జారుకొనిరి . 

రామాయణము బాలకాండ ముప్పది నాల్గవ సర్గ . 



                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


















Tuesday 12 July 2016

రామాయణము బాలకాండ -ముప్పదిమూడవ సర్గ

                                రామాయణము 



                           బాలకాండ -ముప్పదిమూడవ సర్గ 

సర్వ సమర్ధుడైన కుశనాభుని మాటలు విని ,ఆ 100 మంది కన్యలు జరిగిన అంతా తమ తండ్రికి తెలిపిరి . ఆ మాటలు విన్న మహారాజు తన కుమార్తెలతో ఇలా పలికెను . 
"ఓ పుత్రికలారా !క్షమాశీలురు చేయదగిన పనిని మీరు చక్కగా చేసిరి . ఐకమత్యముతో మెలిగి మన వంశ గౌరవము నిలబెట్టిరి . ఈ జగత్తంతయు క్షమ పైనే నిలచి వున్నది . "
ఓ రామా ఆ కుశనాభ మహారాజు దేశ కాలములకు అనుగుణముగా ,తన వంశమునకు దగినట్లుగా ,కన్యాదాన విషయమై మంత్రులతో బాగుగా ఆలోచించెను . ఈ కాలములోనే "చూలి "అను పేరుగల ముని ఉండేవాడు . అతడు సదాచార సంపన్నుడు . ఒకానొకప్పుడు అతడు బ్రహ్మ కొఱకు తపస్సు చేయుచుండగా ఊర్మిళ కుమార్తె అయిన 'సోమద 'అనే గంధర్వ స్త్రీ ఆయనకు సపర్యలు చేయుచుండెను . ఆ ముని సోమద సపర్యలు మెచ్చుకుని సోమదతో ఇలా అనెను . 
"నీ సపర్యలకు సంతసించితిని . నీకు శుభమగుగాక . నీకేమి వారము కావాలో కోరుకో "ఆనందముతో పొంగిపోయిన ఆ గంధర్వ స్త్రీ మృదు మధురముగా ఇలా అనెను . 
"నీవు తీవ్రమైన తపస్సు ఒనరించి ,బ్రహ్మ వర్ఛస్సుతో వెలుగొందుచూ ,బ్రహ్మ తుల్యుడవు అయితివి . ఓ ధర్మ బుద్దీ !జ్ఞానము కల ఒక పుత్రుడిని ప్రసాదించుము . నేను నిష్ఠతో బ్రహ్మచర్యము ఆచరించుచున్నాను . నేనెవరికీ భార్యను కాను కాబోను . నీ బ్రహ్మ తేజస్సు ప్రభావమున నాకు ఒక పుతృడిని అనుగ్రహింపుము అందులకు నీవే సమర్థుడవు . "
అంత ఆ బ్రహ్మర్షి ఆమె యెడ ప్రసన్నుడై ఒక పుతృడిని ప్రసాదించెను . చూలి మహర్షి యొక్క మానస పుత్రుడు 'బ్రహ్మ దత్తుడు 'అనే పేరుతో ప్రసిద్దిచెందెను . అతడు కాంపిల్య నగరమును పరిపాలించుచు సిరి సంపదలతో తులతూగుతూ ఉండెను . 
ఓ రామా !గొప్ప ధర్మ బుద్ది కల కుశనాభుడు తన 100 మంది కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహము చేయ నిశ్చయించెను . ఆ కుశనాభుని ఆహ్వానించి మర్యాదలు చేసి తన పుత్రికలతో వివాహము చేసెను . బ్రహ్మదత్తుని కార స్పర్శ తగిలినంతనే ఆ కన్యారత్నముల మునపటి రూపము తిరిగి ప్రాప్తించెను . వారు మిక్కిలి ఆనంద భరితులు అయిరి . కుశనాభుడు కూడా మిక్కిలి సంతోషించెను . పిమ్మట పుత్రుకలను వారి భర్తతో కాంపిల్య నగరమును పంపెను . సోమద కూడా జరిగిన దానికి మిక్కిలి సంతోషించి ,కోడళ్లను ప్రేమతో నిమిరేను . వారిని వారి తండ్రిని పొగిడెను . 

రామాయణము బాలకాండ ముప్పది మూడవసర్గ సమాప్తము . 


                 శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












 

Monday 11 July 2016

రామాయణము బాల కాండ -ముప్పది రెండవ సర్గ

                                 రామాయణము 

                                    

                                 బాల కాండ -ముప్పది రెండవ సర్గ 

కుశుడు అణు మహానుభావుడు మా వంశమునకు మూల పురుషుడు . అతడు అయోనిజుడు (బ్రహ్మ మానస పుత్రుడు )గొప్ప తపస్వి ,నియమ నిష్టలతో వ్రతములను ఆచరించువాడు . ధర్మములు బాగుగా ఎరిగినవాడు ,సత్పురుషులను నిత్యము పూజించువాడు . అతని భార్య పేరు వైదర్భి . ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు . భర్తకు మిక్కిలి అనుకూలవతి . ఆ దంపతులకు కుశాంబుడు ,కుశనాభుడు ,ఆధూర్తజసుడు ,వసువు అను నలుగురు కుమారులు కలిగిరి . వారు సద్గుణ సంపన్నులు అన్ని విధముల యోగ్యులు ,తల్లితండ్రులకు దీటైనవారు . ఆ కుమారులను ఉద్దేశించి కుశుడు క్షత్రియ ధర్మములను భోదించు కోరికతో ఇలా అనెను . 
"ఓ పుత్రులారా !ధర్మమును గూర్చి సంపూర్ణముగా తెలుసుకుని రాజ్య పాలన చేయండి "అనెను . పిమ్మట నరవరులు ప్రజాభిమానమును చూరగొన్నవారు అయిన ఆ నలుగురు కుమారులు వెంటనే నాలుగు పురములను ఏర్పాటు చేసుకొనిరి . మహా తేజస్వి అయిన కుశాంబుడు 'కౌశాంబీ 'పురమును ',ఆధూర్తజసుడు ''ధర్మారణ్యము 'అను నగరమును ,'వసువు 'అను రాజకుమారుడు 'గిరివ్రజము 'అను మహా నగరమును నిర్మింపచేసి రి . ఓ రామా !ప్రస్తుతము మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పాలనలోనిది . దీని చుట్టూ 5 పెద్ద పర్వతములు విరాజిల్లుచున్నవి . ఈ   రాజ్యo  శోణ నది ప్రవహించుచున్నది . ఓ రఘురామా !రాజర్షి అయిన కుశనాభుడు ధర్మాత్మురాలైన తన భార్య అగు ఘృతాచి అందు 100 మంది కన్యారత్నములను సంతానంగా పొందెను . ఆ కన్యకామణులు రూప ,యవ్వన ,సౌభాగ్యవతులై పూవులను ,చందనములను ,తిలకములు మొదలగువానిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగలవలె ఉద్యానవనమునకు విచ్చేసిరి . చక్కని ఆభరణములను ధరించినవారై అందరూ గానములతో నృత్యములతో ,వీణాది వాదనములతో పరమానంద భరితులైరి . 
సాటిలేని రూప సౌభాగ్యములు గల ఆ సర్వాంగ సుందరులు ఉద్యాన వనమునకు వచ్చి ,మేఘముల మధ్య తారలవలె విరాజిల్లుచుండిరి . సర్వ సద్గుణ సంపన్నులైన వారి యొక్క రూప వైభవములను ,లావణ్యముల మిసమిసలను చూసి సర్వత్రా సంచరించు దేవుడు ముగ్దుడై వారితో ఇలా అనెను . 
"నేను మిమ్ము వివాహమాడదలిచాను . మానవ రూపముపై మమకారమును వీడుడు . దీర్గాయువును పొందండి . సహజముగా యవ్వనము అస్తిరమైనది .  నన్ను వివాహమాడినచో  యవ్వనము అక్షయము అగును . మీరు  దేవతలు అగుదురు . తిరుగులేని సంచార శక్తి గల ఆ వాయుదేవుని మాటలను విని ఆ 100 మంది   కన్యలు ఆయనను గేలి చేయుచు ఇలా  అనిరి . 
"ఓ సురశ్రేష్టా !నీవు సమస్త ప్రాణులలో ప్రాణముల రూపమున సంచరించెదవు నీ ప్రభావమును  మేమందరము ఎఱుగుదుము . ఎందుకు మమ్ము అవమానించుచున్నావు ?మేమందరము కుశనాభుని కుమార్తెలము దివ్య శక్తి కల నిన్ను నీ అధికారము నుండి తొలగింపగల సామర్ధ్యము మాకు కలదు . కానీ మా తపశ్శక్తిని కాపాడుకొనుటకై మేము ఈ విధముగా చేయము . ఓ దుర్భుద్దీ !మా తండ్రి సత్య వాది . నీవు ఆయనను అవమానింపరాదు ఆయన వలన నీవు మృత్యుముఖమున పడకు . మా తండ్రిగారు నిశ్చయించిన వరునినే మేము భర్తగా సేవించెదము . మా తండ్రియే మాకు ప్రభువు "
వాయు దేవుడు వారి మాటలను విని మిక్కిలి కుపితుడయ్యెను . ఆ ప్రభువు వారి దేహములలో ప్రవేశించి వారిని గూనివారిగా చేసెను . ఆ కారణముగా వారి దేహములు మూరెడు ప్రమాణమునకు కుదించుకునిపోయెను . వారి గర్వము దెబ్బతినెను . వారు రాజభవనమునకు చేరిరి . మఱియు భాదతో ,సిగ్గుతో ,కన్నీరు మున్నీరుగా విలపించుచు నేలపై బడిరి . అంతట ఆ కుశనాభ మహారాజు సహజముగా సౌందర్యవతులైన తన ముద్దు బిడ్డలు దీన వదనులై గూనివారై ఉండుట చూసి ఆశ్చర్యచకితుడై ఇలా అనెను . 
"కుమార్తె లారా !ఇదేమిటి ?మిమ్మందరిని కుబ్జలుగాచేసినవారెవరు . ధర్మమును అవమానించింది ఎవరు ?తెలపండి . మాట్లాడకుండా ఎందుకు నేలపై పడి ఏడుస్తున్నారు ?"అని పలికి రాజు భాదతో నిట్టూర్చి వారి సమాధానమును వినుటకు సావధానుడై ఉండెను . 

రామాయణము  బాలకాండ ముప్పదిరెండవ సర్గ . 

 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు .  




















Sunday 10 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది యొకటవ సర్గ

                                 రామాయణము 


                                 బాలకాండ -ముప్పది యొకటవ సర్గ 

అలా యాగము సఫలము అయిన పిమ్మట రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడే విశ్రమించిరి . మరునాటి ఉదయము స్నాన సంధ్యావందనాది క్రియలను ఆచరించి ,ఋషులతో కలసి వున్న విశ్వామిత్రుని ఎదుట నిలిచిరి . వారికి అభివాదమొనర్చి వారితో ఇలా అనిరి . 
"ఓ మునీశ్వరా !మేము నీ సేవకులము . మీ ఎదుట నిలిచి వున్నాము . ఇంకను ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి . మీ ఆనతిని శిరసావహించెదము . "ఆ చిన్నారుల పలుకులు విని విశ్వామిత్రాది మహర్షులు ఇలా పలికిరి . "ఓ నరోత్తమా !మిథిలా నగర ప్రభువైన జనక మహారాజు ఒక యాగమును సంకల్పించాడు . అతడు పరమ ధార్మికుడు ,మనమందరం ఆ యాగమును చూచుటకు వెల్దాము . ఓ నరశ్రేష్టా !నీవు కూడా తమ్ముడితో కూడి మాతో రమ్ము అచట అద్భుతమైన ఒక మహా ధనస్సు ఉంది . ఆ ధనువు సాటిలేనిది . శత్రు భయంకరమైనది . ఓ నరశ్రేష్టా !దానిని ఒక యజ్ఞ సభలో దేవతలు మిథిలాధిపతి అయిన దేవరాతునికి ఇచ్చిరి . ఈ శివ ధనస్సును గంధర్వులు ,అసురులు ,రాక్షసులు ,అంటే కాదు దేవతలు సైతము ఎక్కుపెట్టలేరు . ఇక మానవుల విషయము చెప్పవలసిన అవసరము ఏముంది ?ఈ ధనస్సు యొక్క శక్తిని తెలుసుకోగోరి ,మహా బలశాలురైన రాజులు ,రాకుమారులు దానిని ఎక్కుపెట్టుటకు ప్రయత్నించి విఫలురయిరి . 
ఓ మహానుభావా !మిథిలాధిపతి ,మహాత్ముడు అయిన జనకుని చాపమును అచట నీవు చూడగలవు . అద్భుతమైన ఆ యాగమును కూడా దర్శింపవచ్చు . మిథిలాధిపతి అయిన దేవరాతుడు పూర్వము యజ్ఞము చేసినప్పుడు యాగ ఫలముగా దేవతలు ఈ శివ ధనుస్సుని ఆయనకు అనుగ్రహించిరి . విశ్వామిత్ర మహర్షి మునులతో ,రామలక్ష్మణులతో కూడి మిథిలా నగరమునకు బయలుదేరుతూ వానదేవతలతో ఇలా అనెను . "ఓ వానదేవతలారా !మీకు శుభమగుగాక ,యాగమును చేసి ఫల సిద్ధిని పొందితిని . ఈ సిద్దాశ్రమమునుండి బయలుదేరి గంగా నదికి ఉత్తర తీరమునకల హిమాలయములకు వెళ్లుచున్నాను . "
పిమ్మట ఆ మహాముని మహిమాన్వితమైన సిద్దాశ్రమమునకు ప్రదక్షణ చేసి ఉత్తర దిశగా ప్రయాణము సాగించెను . సిద్దాశ్రమమునందు నివసించుచున్న మృగములు ,పక్షులు సైతము ఆయనను అనుసరించగా ఆయన వాటిని వెనకకు పంపివేసెను . వారందరూ కొంత దూరము ప్రయాణింపగా సూర్యుడు అస్తమించు సమయమాయెను . అంతట ఆమునులందరూ శోణ నాదీ తీరమునచేరి , ఆ రాత్రికి అచట బస చేసిరి . రామలక్ష్మణులు ఆ మునులందరికి నమస్కరించి ధీశాలి అయిన విశ్వామిత్రుని ఎదుట కూర్చుండిరి . అంతట శ్రీరాముడు కుతూహలంతో విశ్వామిత్ర మహర్షిని ఇలా ప్రశ్నించెను . "ఓ మహాత్మా !శోణ నాదీ తీరమున దట్టమైన వృక్షములతో శోభిల్లుచున్న ఈ ప్రదేశము ఎవరిది ?ఈ విషయము వినగోరుచున్నాను . దయతో సవిస్తరంగా తెల్పుడు . "విశ్వామిత్రుడు శ్రీరాముడు  సమాధానముగా ఆ ప్రదేశం వృత్తాoతమును మునులందరూ విటుండగా ఇలా తెలిపెను . 

రామాయణము బాలకాండ ముప్పదియొకటవ సర్గ సమాప్తము . 


                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Saturday 9 July 2016

రామాయణము బాలకాండ -ముప్పదియవ సర్గ

                                రామాయణము 


                                   బాలకాండ -ముప్పదియవ సర్గ 

శతృ సంహార దక్షులు ,దేశకాలములను గుర్తించి తదనుగుణముగా మాటాడగలవారు అయిన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలా పలికిరి . 
"పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షీ !ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు వస్తారో దయతో తెలపండి . యాగ సంరక్షణార్థం వారిని నిలువరించుటకై మేము సావధానులమై ఉంటాము . "ఈ విధముగా పలుకుచు రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధము చేయుటకై త్వరపడుచుండిరి . అందులకు అచటి ,మునులు అందరూ ఎంతో సంతోషించి ,ఆ రాకుమారులను పొగుడుతూ ఇలా అనిరి . 
"నేటి నుండీ 6 దినములు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉందురు . ఓ రాజకుమారులారా ! మీరు సావధానులై ఈ 6 దినముల యజ్ఞమును రక్షించుచుండవలెను .  రాజకుమారులలో సుప్రసిద్దులైన ఆ రామ లక్ష్మణులు వారి మాటలను విని 6 దినములను రాత్రిబవళ్ళు  జాగరూకులై  తపోవనమును  రక్షించుచుండిరి.  మహాధనుర్దారులైన  ఆ  వీరులు  సావధానులై  ఆ సమీపముననే  నిలిచి  విఘ్నకారకులైన  రాక్షసులయొక్క  బాధనుండి  విశ్వామిత్రామహామునిరక్షణ  కార్యములో  నిమగ్నులై  యుండిరి . 
ఐదుదినములు  క్రమముగా యజ్ఞకార్యక్రమములు జరిగెను. పిమ్మట  ఆఱవనాడు  శ్రీరాముడు  లక్ష్మణునితో " ఏమపారటు  లేక  సర్వసన్నద్ధుడైన  యుండుము " అని పలికెను . 
శ్రీ రాముడు ఇలా పలుకుతుండగానే విశ్వామిత్రునితో ,ఋత్విజులతో కూడిన యజ్ఞ గుండము నుండీ అగ్ని జ్వాలలు ఒక్కసారిగా ఎగిసిపడెను . యజ్ఞ వేదిక సమీపమున  విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములను నిర్వర్తించుచుండిరి . అచట దర్భలు, చమసములు ,శృక్కులు ,సమిధలు అలంకరణకే పుష్పములు మొదలగున్నవి వున్నవి . ఇంతలో యజ్ఞ వేదిక నుండి జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లెను . యజ్ఞము వేదమంత్ర పూర్వకముగా యధాక్రమముగా కొనసాగుచుండెను . ఇంతలో ఆకాశము నుండి భయంకరమైన ఒక మహా శబ్దము వచ్చెను . వర్షాకాలమున ఆకాశమును క్రమ్ముకొనే మేఘము వలె రాక్షసులు తమ మాయలను ప్రయోగించుచు వచ్చిరి . భయంకరులైన మారీచ ,సుబాహువులు, వారి అనుచరులు అచటికి చేరి కుండపోతగా రక్తమును వర్షించిరి . ఆ రక్త వృష్టితో వేదిక యొక్క పరిసరములు అన్నీ తడిసిపోయెను . శ్రీరాముడు అట్టి వేదికను చూసి క్రుద్ధుడై వెంటనే ముందుకు దూసుకొచ్చి ఆకాశమున నున్న రాక్షసులను చూసేను . రాజీవలోచనుడైన శ్రీ రాముడు ఆ విధముగా వచ్చి పడుచున్న రాక్షసులను చూసి లక్ష్మణుని వైపు వెళ్లి సాభిప్రాయముగా చూసి ఇలా అనెను . 
"ఓ లక్ష్మణా ! వాయువు మేఘముల వలె మాంస భక్షకులు దుర్మార్గులు అయిన ఆ రాక్షసులను మానవాస్త్రముతో చెల్లాచెదురు కావించెదను చూడుము . ఇట్టి పిరికి పందలను సంహరించుటకై ఏమాత్రము ఇష్టపడను అని పలికి శ్రీరాముడు తన చాపము నందు శరమును సందించెను . మిక్కిలి క్రుద్ధుడైన రాఘవుడు మిగుల శక్తిమంతమై కాంతులను విరజిమ్ముచున్న మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించెను . ఆ మారీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు నూరు యోజనముల దూరమున సముద్ర జలములలో పడిపోయెను . సీతేషువు అను బలమైన శరాఘాతామునకు గురి అయిన మారీచుడు స్పృహను కోల్పోయి ,గిరగిరా తిరుగుచు దూరమునకు కొట్టుకొని పోవుచుండెను . అట్టి మారీచుని చూసి శ్రీరాముడు లక్ష్మణునితో ఇలా అనెను . 
ఓ లక్ష్మణా !ధర్మ సహితమైన సీతేషువు అను పేరు కల ఈ మానవాస్త్రమును చూడుము . ఇది మారీచుని ప్రాణములను తీయక స్పృహ లేకుండా చేసి వానిని తీసుకొని పోవుచున్నది . ఈ రాక్షసులు కఠినాత్ముడు పాపకర్ములు యజ్ఞములను ధ్వంసము చేయువారు . రక్తమును త్రాగువారు . అట్టి ఈ దుర్మార్గులను కూడా వధించెదను . పిమ్మట శ్రీరాముడు అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహువు యొక్క వక్షస్థలమున కొట్టెను . దాని దెబ్బకు అతడు నెల కూలెను మిక్కిలి పరాక్రమ శాలి ,సద్వర్తనుడు అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతము వాయవ్యాస్త్రముతో తుదముట్టించి మునులకు సంతోషము కలిగించెను . ఈ విధముగా ఆ రఘు నందనుడు యజ్ఞమునకు విఘ్నములనొనరించు రాక్షసులనందరిని హతమార్చెను . పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలను అందుకొనెను . యజ్ఞము నిర్విగ్నముగా సమాప్తమయ్యెను . అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీ రామునితో ఇలా అనెను . 
"ఓ మహా భాహు ! నీ వలన నేను కృతార్థుడనైతిని . నీవు నీ తండ్రి గారికి ఇచ్చిన మాటను నిలబెట్టావు . నీ చర్యతో సిద్దాశ్రమము అను పేరు ఈ ప్రదేశమునకు సార్ధకమయినది . నీ ఖ్యాతి ఇనుమడించింది . 

రామాయణము బాలకాండ ముప్పదియవ సర్గ సమాప్తము . 


                      శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















  

Wednesday 6 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది తొమ్మిదవసర్గ

                                   రామాయణము 



                                       బాలకాండ -ఇరువది తొమ్మిదవసర్గ 

సాటిలేని వైభవములు కల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవుని వలె ఆ వనమును గూర్చి ఇలా ప్రశ్నింపగా ,మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు ఇలా తెలిపెను . 
"మహానుభావుడైన ఓ రామా !దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగములకాలము లోక కళ్యాణమునకై తపమాచరించుచు తత్పల సిద్ధికై ఇక్కడ నివసించెను . వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుటవలన, మహా తపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యకు ఫలసిద్ధి పొందుట వలన దీనికి సిద్దాశ్రమము అని ప్రసిద్ధి ఏర్పడెను . విష్ణువు తపస్సు ఆచరించుచున్న కాలములోనే ప్రహ్లాదుని ముని మనవడు ,విరోచనుని కుమారుడు అయిన 'బలిచక్రవర్తి 'ఇంద్రాది దేవతలను జయించి ,ముల్లోకములకును రాజై పరిపాలించుచు ప్రసిద్ధికెక్కెను . 
'బలి 'యజ్ఞము చేయుచుండగా అగ్నిదేవుడు ని ముందుంచుకుని దేవతలందరూ ఈ ఆశ్రమమున తపమొనరించుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయముగా ఇలా విన్నవించుకున్నారు . 
"ఓ మహా విష్ణూ !విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావము కల యజ్ఞము చేయుచున్నాడు . అది ముగియకముందే ఈ దేవ కార్యము ను నెరవేర్చ ప్రార్ధన యజ్ఞము చేయుచున్న బలి వద్దకు అర్థులు (యాచకులు )అన్ని దిక్కులనుండి ప్రవాహముగా వచ్చుచున్నారు . వారు కోరిన విధముగా ధన ,కనక ,వస్తు వాహనాదులనుఁ ఏమాత్రము వెనకాడక వెంటనే అతడు వారికి దానము చేయుచున్నాడు . ఓ మహా విష్ణూ !మహా మహితాత్ముడవైన నీవు దేవతల హితము కొరకై మాయా యోగమును ఆశ్రయించి ,వామనుడవై అవతరింపుము . మాకు శుభ లాభములను సమకూర్చుము . "
ఓ రామా !ఇంద్రాది దేవతలు తపోనిష్ఠలో వున్న విష్ణుమూర్తిని ప్రార్ధించు సమయమున ,కశ్యప మహర్షి తన భార్య అదితి తో కూడి వేయి సంవత్సరములు తపస్సు చేసి విష్ణుమూర్తిని సంతుష్టునిగా చేసుకొనెను . విష్ణు మూర్తిని ఇలా స్తుతించెను . "ఓ పురుషోత్తమా !నీవు తపస్సు ద్వారా ఆరాధింప తగినవాడివి . తపః ఫలమును ప్రసాదించువాడివి ,జ్ఞాన స్వరూపడవు ,సమస్త కళ్యాణ గుణములు కలవాడవు ,అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సుచే ఆరాధించి దర్శించుకున్నాను . ఓ మహా ప్రభూ చేతనాచేతకాత్మమైన ఈ సమస్త జగత్తు నీలో చూచుచున్నాను ,నీవు ఆద్యంత రహితుడవు ,అట్టి నిన్ను శరణు వేడుచున్నాను . "మిక్కిలి పవిత్రుడైన కశ్యప మహర్షితో శ్రీహరి ప్రీతితో ఇలా అనెను . "నీకు శుభమగుగాక ,వరమును కోరుకో "
అందులకు కశ్యప మహర్షి ఇలా అనెను "వరములను ప్రసాదించు ఓ శ్రీ హరీ !అదితియు ,నేను ,దేవతలు నిన్ను అర్ధించుచున్నాము . సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదించుము . మమ్ము ఆదుకొనగలవాడవు  నీవే . ఓ మహాత్మా !ఓ దేవా !నీవు మాకు పుత్రుడవై జన్మించుము . ఓ అసురసూదనా !ఇంద్రునకు తమ్ముడవు కమ్ము . శోకార్తులైన దేవతలను ఆడుకొనగల శక్తిమంతుడవు నీవే . నీ అనుగ్రహము వలన మా తపస్సులు ఫలించును . నీ సంకల్పమూ నెరవేరును . కావున ఈ ప్రదేశము 'సిద్దాశ్రమముగా 'ప్రసిద్ధి కాంచును . "
అంతట మహా శక్తి శాలి అయిన విష్ణువు అదితి కి పుత్రుడిగా జన్మించెను . వామనరూపమున బలి చక్రవర్తి వద్దకు వెళ్లెను . సమస్త లోకములకు హితమును చేయు ప్రభువైన శ్రీ మహా విష్ణువు వామనుడై అభిమానమును పెట్టుకొనక మూడడుగుల నేలను దానముగా అడిగి ,దానిని స్వీ కరించెను . పిమ్మట త్రివిక్రముడై ముల్లోకములు వ్యాపించి, బలిని అదుపు చేసి ఆ లోకములను ఇంద్రునకు ఇచ్చెను . మహాత్ముడైన వామనుడి పాద స్పర్శ తో పవిత్రమైన ప్రదేశం ఇది . ఇక్కడ అడుగు పెట్టిన వారి సంసారిక బాధలను ఇది దూరము చేయును . నేను త్రివిక్రముడైన వామనుని ఎద కల భక్తిశ్రద్ధలు కారణముగా నేను ఈ ప్రదేశమును ఆశ్రయించితిని . ఓ నరోత్తమా !విఘ్న కారకులైన రాక్షసులు ఈ ఆశ్రమమునకు వచ్చుచుందురు . ఆ దుర్మార్గులను హతమార్చవలసింది ఈ ప్రదేశమే . 
ఓ రామా !పవిత్రమైన ఈ సిద్దాశ్రమమునకు నేడే వెళ్లుదము . నాయనా !ఈ ఆశ్రమము నాది మాత్రమే కాదు నీది కూడా . విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో కూడి ఆశ్రమమున ప్రవేశించి మంచు తొలగి ,పునర్వసు నక్షత్రముతో కూడిన చంద్రుని వలె ప్రకాశించెను . ఆ సిద్దాశ్రమ నివాసులైన మునులందరూ విశ్వామిత్ర మహర్షిని చూసి ,వెంటనే లేచి ,ఆనందముతో సంబరపడిరి . పిమ్మట వారు ముందుకు వచ్చి ,వారికి స్వాగత సత్కారములు గావించిరి . శత్రు భయంకరులైన ,రాజకుమారులు అయిన రామలక్ష్మణులు క్షణకాలం విశ్రాంతి గైకొనిన పిమ్మట ,విశ్వామిత్ర మహర్షికి అంజలి గటించి ఇలా పలికిరి . 
"ఓ మునీశ్వరా !నేడే దీక్షను స్వీకరింపుము ,మీ సంకల్పము నెరవేరును . రాక్షస సంహారము జరిగి తీరును . యజ్ఞము నిర్విఘ్నముగా సాగి ఫలసిద్ధి కలుగును . దీనికి సిద్దాశ్రమము అను  పేరు సార్ధకమగును . "
మహా తేజస్వి అయినా విశ్వామిత్రుడు శ్రీ రాముడు పలికిన ఉత్సాహపూరితమైన పలుకులు విని నియమ నిష్టలతో యజ్ఞ దీక్షను స్వీకరించెను . రామలక్ష్మణులు ప్రశాంత చిత్తులై ఆ రాత్రి గడిపిరి . ఉదయమే మేల్కొని స్నానాదికాలు ఆచరించి ,సూర్యునకు అర్ఘ్య ప్రధానములు ఒనర్చి ,నియమ పూర్వకముగా గాయత్రి మంత్రమును జపించి ,ప్రాతః కాల సంద్యోపాసనము ముగించుకొనిరి . ఇంతలో విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్ని కార్యములను ఆచరించి ,ఆసీనుడై ఉండగా వారు ఆయన వద్దకు వచ్చి నమస్కరించిరి . 

రామాయణము బాలకాండ ఇరువది తొమ్మిదవసర్గ సమాప్తము . 


                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












                                       


                                  

రామాయణము బాలకాండ -ఇరువది ఎనిమిదవసర్గ

                               రామాయణము 


                                  బాలకాండ -ఇరువది ఎనిమిదవసర్గ 

శ్రీ రాముడు శుచియై అస్త్రములను స్వీకరించి మిగుల  సంతసించినవాడై  మార్గమమధ్యన  వెళ్లుచు  విశ్వామిత్రునితో  ఇట్లనెను. 
ఓ  పూజ్యమహర్షీ !  మీ  అనుగ్రహమువలన  అస్త్రములను  బడసితిని. ఇప్పుడు సురాసురులు కూడా నన్ను ఎదిరించలేరు . ఓ మునీశ్వరా !ఈ అస్త్రములను ఉపసంహరించు విద్యలను కూడా ఉపదేశింపుము . "శ్రీ రాముడు ఇలా పలుకగా విశ్వామిత్రుడు మిక్కిలి సంతోషించి ఆ విద్యలను కూడా ఉపదేశించెను . ఆ విద్యలన్నియు శ్రీరాముని చేరెను . ఆ విద్యాధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించిరి . వారు వినమ్రతతో నమస్కరిస్తూ "ఓ నరోత్తమా మేమందరము మీ దాసులము నీకు ఈము చేయవలెనో ఆదేశించండి "అని పలికెను . అంతట రఘురాముడు " మీరు నేను తలుచుకున్నంతనే నా ఎదుట నిలవమి" ఆజ్ఞాపించెను . వారిని పంపివేసెను . 
అంతట వారు శ్రీరామునకు ప్రదక్షణమొనర్చి ,ఆయన నుండి సెలవు తీసుకుని ,తమ యధా స్థానములకు చేరిరి . సర్వ శుభ లక్షణ సమన్వితుడైన శ్రీరాముడు విశ్వామిత్రుని అనుమతి తీసుకుని ఆ మంత్రములు అన్నిటిని లక్ష్మణుడికి ఉపదేశించెను . ముందుకు సాగుతూ విశ్వామిత్రునితో ఇలా పలికెను . "ఓ మునీశ్వరా !ఈ ప్రదేశమున పర్వత సమీపమునందు మేఘ మండలము వలె వున్న వృక్ష సమూహములు ఉన్నవి . దీనిని గురించి తెలుసుకోవాలని నాకు మిక్కిలి కుతూహలంగా వున్నది . ఇది వివిధ మృగములతో కూడి మిక్కిలి మనోహరమై చూడముచ్చటగా వున్నది . ఇక్కడ నానా విధములైన పక్షుల కిలకిలారావములు వీనులవిందు గావించుచున్నవి . ఈ ప్రదేశము ప్రశాంతమై మిక్కిలి హాయిని కలిగించుచున్నది . కనుక భయంకరమైన తాటక వనము నుండి బయట పడ్డాము అనిపిస్తోంది . ఓ మహాత్మా !ఈ ఆశ్రమము ఎవరిదో తెలుపుము . 
ఓ మహా మునీ !పాపాత్ములను ,బ్రహ్మ హత్యలు చేయువారు ,దుర్మార్గులు ,దురాత్ములు అయిన ఆ రాక్షసులు మీ యజ్న కార్యమునకు విఘ్నము కలిగించుటకై వచ్చెడి ప్రదేశమేది ?పూజ్యుడైన ఓ మహర్షి !ఆ రాక్షసులను వధించి ,మీ యజ్ఞ కార్యము రక్షింపవలసిన ప్రదేశమేది ?ఓ మునీశ్వరా !ఈ విషయములను అన్నిటిని వినగోరుచున్నాను . దయతో తెలుపుడు ". 

    రామాయణము బాలకాండ ఇరువది ఎనిమిదవ సర్గ సమాప్తము . 



                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Tuesday 5 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది ఏడవ సర్గ

                                రామాయణము 


                                     బాలకాండ -ఇరువది ఏడవ సర్గ 

మహా యశస్వి అయిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ రాత్రి అచటనే గడిపెను . సంతోషముతో మందహాసము ఒనర్చి శ్రీరామునితో మృదు మధురముగా ఇలా అనెను . "లోక ప్రశంసలు అందుకొనుచున్న ఓ రాకుమారా !తాటక వధతో నేను మిక్కిలి సంతుష్టుడను అయితిని . నీకు భద్రమగుగాక . వివిధములగు అస్త్రములను నీకు పరమ ప్రీతితో ఒసంగెదను . యుద్ధమున నిన్ను ఎదురించెడివారు ఎంతటి వారైనను ,కడకు దేవతలు ,అసురులు ,గంధర్వులు, నాగులు మొదలగువారు ఎవరైనను నేను ఇచ్చే అస్త్రములచే నీకు వశమగుదురు . వారిని నీవు అవలీలగా జయింపగలవు . రఘువీరా !దివ్యమైన దండ చక్రము ,ధర్మ చక్రము ,కాలచక్రము ,తీక్షణమైన విష్ణు చక్రమును ఇంద్రాస్త్రమును ఇచ్చెదను . ఓ నరవరా !వజ్రాస్త్రమును ,శివునికి సంభందించిన మహా శూలమును ,బ్రహ్మ శిరోనామకాస్త్రమును ,ఐషీకాస్త్రమును ,ఉత్తమోత్తమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను . ఓ నరశ్రేష్టా ! రాజకుమారా !మీ ఉభయులకూ 'మోదికి ''శిఖరి 'అణు దివ్యమైన గదలను అందింతును . 
ఓ రామా ధర్మ పాశమును ,కాలపాశమును ,వరుణ పాశమును ,శక్తి సంపన్నమైన వారుణాస్త్రమును ఇచ్చెదను . 'శుష్కాశని ''ఆర్ద్రా శని 'అను రెండు దివ్యాస్త్రములను ,శివునికి సంబందించిన మహాస్త్రమును ,నారాయణాస్త్రమును ఇచ్చెదను . ఆగ్నేయాస్త్రమును ,వాయువ్యాస్త్రమును హయశిరస్సు అను అస్త్రమును ,క్రౌoచాస్త్రమును ,విష్ణు శక్తి ,శివ శక్తి ,అను శక్తి ద్వయమును నీకొసంగెదను . ఇవియే కాక ఇంకా అనేక అస్త్రములను నీకు ఒసంగెదను . ఈ అస్త్రములన్నీ కామ రూప శక్తి కలవి . మహా బాల సంపన్నమైనవి . మిక్కిలి శ్రేష్టమైనవి . వీటిని నీవు నానుండి గ్రహించు . "అని పలికి విశ్వామిత్రుడు శుచియై తూర్పు ముఖంగా కూర్చుని ఆయా అస్త్రములను ,వాటికి సంభందించిన అధిష్టాన దేవతలను మంత్ర పూర్వకముగా రామునికి  ఇచ్చెను . ఆ అస్త్రములను అన్నిటిని పొందుట దేవతలకు సైతము అసాధ్యము . అట్టి మహాస్త్రములన్నియు శ్రీరాముని చేరెను . పిమ్మట ఆ మంత్ర అధిష్టాన దేవతలు అందరూ సంతోషముతో నమస్కరించి ఇలా అనిరి "నిన్ను చేరిన మేమందరము త్రికరణశుద్ధిగా నీ సేవకులమై ఉందుము "
శ్రీ రాముడు చేతి స్పర్శ తో వాటిని స్వీకరించి "స్మరించిన వెంటనే మీరు నన్ను చేరండి " అని ఆదేశించి వారిని పంపివేసెను . మిక్కిలి తేజశ్వి అయినా శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ,ఆ ముని వెంట ప్రయాణమయ్యెను . 





రామాయణము బాలకాండ ఇరువది ఏడవసర్గ సమాప్తము . 



                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు 










Monday 4 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది ఆఱవ సర్గ

                             రామాయణము 


                                 బాలకాండ -ఇరువది ఆఱవ సర్గ 

మహారాజకుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి మాటలను విని దృఢ నిశ్చయము కలవాడై ఆ మునితో ఇలా అనెను . "గురువర్యా !ఈ విశ్వామిత్ర మాటలను నిస్సంశయముగా పాటింపుము ", అని మా తండ్రిగారి ఆదేశము ఆ మాట నాకు ఉల్లంఘింప రానిది . మా తండ్రిగారి ఆదేశము ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించి తీరేదను . "శత్రుమర్దనుడైన శ్రీరాముడు ఇలా పలికి ధనస్సును దిక్కులు పిక్కటిల్లేటట్లు ధనుష్టంకారము గావించెను . ఆ వింటి నారియొక్క మహా ధ్వనికి తాటకా వనవాసులందరూ ఎంతో భయకంపితులయిరి . తాటక కూడా ఆ భీకర ధ్వనికి మిక్కిలి క్రుద్ధురాలై దిక్కుతోచనిదాయెను . అయోమయ స్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ,ఆలోచించుచు నలుదిక్కులు పరికించి చూసేను . పిమ్మట ఆమె పట్టరాని ఆవేశముతో ఆ శబ్దము వచ్చిన దిక్కుకు మిక్కిలి వేగముగా పరుగులు తీసెను . 
వికారమైన రూపము ,వికృతమైన ముఖము కలిగి ,మిక్కిలి లావైన ,ఎత్తైన శరీరముతో క్రోధోగ్వేగముతో వచ్చుచున్న తాటకను చూసి ,ఆ రాముడు లక్ష్మణునితో ఇలా పలికెను . "ఓ లక్ష్మణా !ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారము చూడుము . ఈమెను చూచినంతనే పిరికి వాని గుండెలు బద్దలగును . మాయలమారి ,ఎదిరింపశక్యము కానీ బలము కలదియు అయిన ఈ తాటక ముక్కు ,చెవులు ఖండించి ,ఈమె వెనుతిరిగి పోవునట్లు చేసెదను . స్త్రీ అగుటవలన ఈమెను చంపుటకు ఇష్టపడుటలేదు . కనుక బ్రతికిపోయినది . ఈమె కాలు ,సేతులు నఱకి వేసి ,ఈమె సామర్ధ్యమును ,గమన శక్తిని నశింపచేయుట యుక్తమని నాకు తోచుచున్నది . "


శ్రీరాముడు ఇలా పలుకుచుండగా కోపముతో ఒళ్ళు మరచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదకు విజృంభించెను . వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారముతో తాటకను భయపెట్టి 'రామలక్ష్మణులకు శుభమగుగాక ,జయము కలుగుగాక 'అని ఆశీర్వచనములు పలికెను . అంతట తాటక రామలక్ష్మణుల పైకి భయంకరముగా ధూళిని ఎగజిమ్మెను . తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావంతో క్షణకాలం పాటు వారికి తోచని స్థితి కలిగించెను . ఇంకను ఆ తాటక తన మాయా శక్తిచే వారికి కనబడకుండా ఆ రామలక్ష్మణులపై రాళ్ల వర్షము కురిపించెను . అంత శ్రీరాముడు క్రుద్ధుడై ,తన శర పరంపరలచే ఆ శిలా వర్షమును భగ్నము ఒనర్చెను . రాఘవుడు తనమీదకి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించెను . ఆ విధముగా చేతులు తెగి డస్సి వున్న తాటక గర్జించుచు తమపైకి వచ్చుచున్డగా  లక్ష్మణుడు మండిపడినవాడై ముక్కు చెవులు కోసెను . 
కామరూపిణి అయిన ఆ యక్షిణి బహురూపములను పొంది ,తన మాయచే వారిని బయపెట్టుటకు ప్రయత్నించెను . మఱియు ఆమె వారికి కనబడకుండా ఉండి ,భయంకరమైన రాళ్ల వానను కురిపించుచు అటు ఇటు తిరగసాగెను . అన్నివైపులనుండి కురుస్తున్న రాళ్ల వానలో చిక్కుబడిన రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రుడు వారితో ఇలా పలికెను . "ఓ రామా !ఇంతవరకు ఆమెపై చూపిన దయ చాలు . పాపాత్మురాలైన ఈ యక్షిణి కటిక దుర్మార్గురాలు . ఇదివరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచు వచ్చినది ,తన మాయ చేత ఈమె బలపడును . ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది . ఈలోపలే ఈమెను హతమార్చుము . రాక్షసులు సంధ్యాకాలములో బలోపేతులగుదురు . అప్పుడు వారిని ఎదుర్కొనుట కష్టము . "
విశ్వామిత్రుని సూచనను అనుసరించి ,రాముడు తన శబ్దవేది విద్యను ప్రదర్శించుచు బాణములు ప్రయోగించెను . ఆ విధముగా రామ బాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచు తన మాయా బలముతో రామలక్ష్మణులపై దాడి చేయుటకు పరుగులు తీసెను . పిడుగు వలె వేగముగా తనమీదకు దూసుకొని వచ్చుచున్న ఆ తాటక వక్షస్థలముపై రాముడు బాణముతో కొట్టెను . వెంటనే ఆ యక్షిణి నేలపైపడి ప్రాణములు కోల్పోయెను . రాముడు ఈవిధముగా ముక్తిని ప్రసాదించెను . ఇంద్రాది దేవతలు 'బాగు బాగు 'అనుచు శ్రీరాముని కొనియాడిరి . ఇంద్రుడు ,ఇతర దేవతలు అందరూ పరమ ప్రీతులై విశ్వామిత్ర మహర్షితో ఇలా అనిరి . 
" ఓ విశ్వామిత్రా !నీకు శుభమగుగాక ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలు అందరూ సంతోషించిరి . రామలక్ష్మణులపై ప్రేమ చూపుతారు . ఓ మహర్షి !ప్రజాపతి అయిన భృశాశ్వుని కుమారులు సత్య పరాక్రములు . వారు తపో బాల సంపన్నులు . అస్త్ర రూపములో వున్న వారిని రాఘవునికి సమర్పింపుము . ఓ మునీ !శ్రీరాముడు స్థిర సంకల్పంతో నీ సేవలొనర్చుచున్నాడు . కావున ఇతడు ఆ అస్త్రములు పొందుటకు పాత్రుడు . ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహా కార్యము నిర్వహింపవలసి ఉంది . "దేవతలు ఈ విధముగా పలికి విశ్వామిత్రుని పూజించి తమతమ నివాసములకు వెళ్లిరి . ఇంతలో సంధ్యా సమయము అయ్యెను . అంతట ఆ మహర్షి ప్రేమతో రాముని శిరస్సుని మూర్కొనెను (ముద్దాడెను ). పిదప రాఘవుడితో ఇలా అనెను . "చూడముచ్చటగా వున్న ఓ రామా !ఈ రాత్రికి ఇచటనే నివసింతుము . రేపు ఉదయము బయలుదేరి మన ఆశ్రమమునకు వెళ్లుదుము . "రాముడు విశ్వమిత్రుని మాటలకు సంతసించెను . వారందరు తాటక వనమందే ఆ రాత్రి గడిపెను . అంతట ఆ వనము శాపవిముక్తమై ,ఆనాటి నుండే కుభేరుని ఉద్యానవనమైన చైత్ర రధము వలె మనోహరముగా విరాజిల్లెను . ప్రాతః కాలమున మునీశ్వరుడు వారిని మేలుకొల్పెను . 

రామాయణము  బాలకాండ ఇరువది ఆరవసర్గ 


                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













Sunday 3 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది ఐదవసర్గ

                                  రామాయణము 

                         బాలకాండ -ఇరువది ఐదవసర్గ              

విశ్వామిత్ర మహాముని పలికిన పలుకులు విని పురుష శ్రేష్ఠుడైన రాముడు సముచిత రీతిలో ఇలా ప్రశ్నించెను . "ఓ మునీశ్వరా !యక్షులు అంతగా పరాక్రమ వంతులు కారని ప్రతీతి . అబలయిన ఆ తాటక వేయి ఏనుగుల బలము కలిగి ఉండుట ఎట్లు సంభవము ?. అంతట శ్రీరాముని మాటలు విని ,సంతోషముతో విశ్వామిత్రుడు ఇలా పలికెను . "రామా ఆ అబల అంతటి బలవంతురాలగుటకు గల కారణము తెలిపెదను వినుము . వర ప్రభావమున ఆమెకు వేయి ఏనుగుల బలము వచ్చెను . పూర్వము 'సుకేతుడు 'అను ఒక మహా యక్షుడు ఉండెను . అతడు గొప్ప పరాక్రమవంతుడు . సత్ప్రవర్తన కలవాడు . సంతానము లేనివాడు . కావున అతడు ఘోర చేసెను . అతని తపస్సుకి సంతుష్టుడు అయిన బ్రహ్మ ఆ సుకేతునికి ఒక కన్యా రత్నమును ప్రసాదించెను . ఆమె పేరు తాటక . పితామహుడు ఆ కన్యా రత్నమునకు వేయి ఏనుగుల బలమును ఒసంగెను . 
అలా జన్మించిన ఆ తాటక క్రమక్రమముగా పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలై ,చక్కని రూపు శోభలతో విలసిల్లెను . తండ్రి అయిన సుకేతుడు ఆమెను జంభాసురుని కుమారుడు అయిన సుందునకు ఇచ్చి వివాహము చేసెను . కొంత కాలము తర్వాత ఆమె ఒక కుమారుని కనెను .అతని పేరు మారీచుడు . అతడు ఎదిరింపశక్యము కానివాడు . అగస్త్య ముని శాపము నకు గురియై రాక్షసుడు అయ్యెను . ఓ రామా !సుందుడు అగస్త్యుని వలన మృతి చెందెను . అపుడు తాటక తన కుమారుడైన మారీచునితో కూడి అగస్త్య మహామునిని చంపుటకు పూనుకొనెను . తన భర్త మృతికి కారకుడైన అగస్త్యుడి యెడ క్రుద్ధురాలై ఆయనను తినేయుటకు ముందుకు ఉరికెను . కుమారునితో కూడి తన మీదికి విజృభించి వచ్చుచున్న తాటకను చూసి ,మహర్షి అగస్త్య భగవానుడు మిక్కిలి కుదృడాయెను . 'రాక్షసత్వము పొందుము 'అని ముందుగా మారీచుని శపించెను . పిమ్మట "ఓ తాటకా !నీకు ఈ రూపము పోయి భయంకర రూపము ప్రాప్తించును . వికారమైన రూపముతో వికృతమైన ముఖంతో నరమాంస భక్షురాలివి కమ్ము . "అని అతడు తాటకను కూడా శపించెను . 
అట్లు శాపమునకు గురియైన తాటక అందుకు తట్టుకోలేక కోపముతో ఉడికిపోయెను . ఆ కారణముగా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ ప్రాంతమును అంతా ధ్వంసము ఒనర్చుచున్నది . కనుక ఓ రాఘవా !దుష్ప్రవర్తన కలది మిక్కిలి భయంకరమైనది తన పరాక్రముచే లోకములకు ఉపద్రవములను కలిగించుచున్నది అయిన ఈ తాటకను హతమార్చి హువులను కాపాడుము . బ్రాహ్మణులకు హితము కూర్చుము . ఓ రఘునందనా !శాపమునకు లోనైన ఈ తాటకను చంపుటకు నీవు తప్ప ఈ ముల్లోకములో ఎవడును సమర్ధుడు కాడు . ఓ నరోత్తమా ! స్త్రీని చంపుట ఎట్లు ?అని దాని ఎడ కనికరము చూపవద్దు . నాలుగు వర్ణముల వారికి హితమును కూర్చుము . అది రాజకుమారుని కర్తవ్యము . ధర్మ పరిరక్షకుడైన రాజు ప్రజలహితముకై చేయు కార్యములు అవి క్రూరమైనవా ,తద్భిన్నమైనవా అని చూడరాదు . అది పాపకృత్యమైనను ,దోషయుక్తమే అయిననూ దానిని అవశ్వమూ  ఆచరించవలసిందే . రాజ్య భారమును మోయువారికి ఇది విధ్యుక్త ధర్మము . కనుక ఓ కుకుస్తా !అధర్మమునకు ఒడిగట్టిన ఈ తాటకను వధింపుము . 
ఓ రామా !పూర్వము విరోచని సుతుడైన మంధర అను ఆమె భూదేవిని చంపుటకు పూనుకొనగా ఆమెను ఇంద్రుడు చంపెను . అంతే కాక పూర్వము భృగు పత్ని ,శుక్రాచార్యుని తల్లి అయిన 'ఉశన 'అను ఆమె ఇంద్రాది దేవతలను సంహరించుటకు దృఢ వ్రతము చేపట్టగా విష్ణువు ఆమెను చంపివేసెను . ఓ రాకుమారా ఈ విధముగా పెక్కు మంది మహానుభావులు అధర్మములకు ఒడిగట్టిన స్త్రీలను వధించిరి . కావున ఓ రామా !కనికరము చూపక నా మాటను పాటించి ,దుర్మార్గురాలైన తాటకను వధింపుము . 

రామాయణము  బాలకాండ ఇరువది అయిదవ సర్గ సమాప్తము . 



           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















Saturday 2 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది నాల్గవ సర్గ

                                         రామాయణము 

                                               బాలకాండ -ఇరువది నాల్గవ సర్గ 

                                                     

శత్రువులను హతమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్య కాంతులతో నిర్మలంగా ఉన్న ప్రాతః కాలము నందు సంద్యోపాసనాది కార్యక్రమములను ముగించుకుని విశ్వామిత్రుని అనుసరించుచు గంగా తీరమునకు చేరిరి . వ్రత నిష్టాపరులు ,మహాత్ములు అయిన ఆ మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి ,విశ్వామిత్ర మునితో ఇలా అనిరి . "ఓ మహా మునీ !ఈ రాజకుమారులు ,మీరు ఈ నావను ఎక్కండి . ఆలస్యము కాకుండా సుఖముగా ప్రయాణము చేయండి . "విశ్వామిత్రుడు సరే అని పలికి సాదరముగా ఆ  వీడ్కోనెను . అనంతరము అతడు రామలక్ష్మణులతో కూడి సాగరమును కలిసెడి గంగా నదిని దాటెను . నావ నది యొక్క మధ్య భాగమునకు చేరగానే అలల తాకిడికి చెలరేగిన ఒక మహా ధ్వని రామలక్ష్మణులకు వినపడెను . అప్పుడు శ్రీరాముడు "ఈ నాదీ మధ్య భాగమున జలతరంగముల ఘర్షణ వల్ల ఉత్పన్నమైన ఈ మహా ధ్వనికి కారణము ఏమిటి ?"అని విశ్వామిత్రుడిని అడిగెను . అంతట ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలు విని ,కుతూహలంతో ఆ శబ్దము యొక్క కారణమును తెలుపసాగెను . 
నరశ్రేష్టుడవైన ఓ రామా !బ్రహ్మ దేవుడు కైలాస పర్వతమునందు తపః సంకల్పంతో ఒక సరస్సును సృష్టించెను . ఆయన మనస్సు చేత నిర్మింపబడింది కావున ఇది 'మానస సరస్సు 'అను  పేరుతో ప్రసిద్ధి కాంచింది . దీనికి 'బ్రహ్మ సరస్సు 'అని పేరు . మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంత వరకు చుట్టుకుని ప్రవహించుచున్నది .సరయు నది . సరస్సు నుండి పుట్టినది కావున దీనికి సరయు నది అనిపేరు . బ్రహ్మ సరసు నుండి పుట్టింది కావున ఇది ఎంతో పవిత్రమైనది . ఈ సరయు నది గంగా నదిలో సంగమించునపుడు నీటి తరంగములు ఘర్షణ వల్ల సాటిలేని ఈ మహా ధ్వని కలిగింది . శ్రీరామా!ఈ నాదీ ద్వయ సంగముమునకు నమస్కరింపుము . ధర్మ వర్తనులైన ఆ రామలక్ష్మణులు ఇరువురు ఆ రెండు నదుల సంగమునకు నమస్కరించిరి . పిమ్మట గంగా నది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందుకు నడవసాగిరి .  వంశమున జన్మించిన శ్రీరామచంద్రుడు జన సంచారము లేని దట్టముగా వున్న ఆ అడవిని చూసి మునీశ్వరుని ఇలా ప్రశ్నించెను . " ఈ అడవి ప్రవేశించటానికి వీలులేకుండా ఉంది . కీచురాళ్ళ రొదలతో నిండినది . భయంకరమైన క్రూర మృగములతో వ్యాప్తమైనది . ఈ అరణ్యము నందు భయంకరముగా కూయుచున్న వివిధ పక్షులు ,సింహ ,వ్యాఘ్ర ,వరాహములు ,ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుచున్నవి. చండ్ర ,నల్లమద్ది ,ఎరుమద్ది ,చెట్లతో ,మారేడు వృక్షములతో ,తమ్మి కలిగొట్ల చెట్లతో రేగు చెట్లతో సంకీర్ణమై భయంకరముగా వున్న ఈ కాననము పేరేమి ?"
మిక్కిలి తేజశ్వి అయిన విశ్వామిత్ర మహాముని శ్రీరాముడితో ఇలా పలికెను . "నాయనా !ఈ కారడవి ఎవరిదో తెలిపెదను వినుము . ఓ నరోత్తమా !పూర్వకాలమున ఇచట 'మాలాడాము ',కరూశము 'అను  రెండు దేశములు దేవ నిర్మితములై ఉండెను . అవి ధనధాన్య సంపదలతో తులతూగుచూ జనులతో కిట కిట లాడుచూ ఉండెను . ఓ రామా !పూర్వము ఇంద్రుడు వృతాసురుని వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మ హత్యా పాతకము చుట్టుకొనెను . తత్పలితముగా అతడు అపవిత్రుడయ్యెను . ఆయనను ఆకలి దప్పులు బాధింపసాగెను . దేవతలు ,తపోధనులు ఋషులు ,ఇంద్రుని గంగా తీర్దోదకముల చేత స్నానము చేయించిరి . దానివలన అతని అపవిత్రయు ,ఆకలిదప్పులు తొలగిపోయెను . అది ఈ ప్రదేశమునే జరిగెను . సంతోషించిన ఇంద్రుడు ఈ దేశమునకు ఒక వరమును ప్రసాదించెను . "నా శరీర మాలిన్యము గ్రహించిన ఈ రెండు ప్రదేశములు 'మలద'కురూశ 'పేర్లతో ప్రసిద్ధి చెందుతాయి .ధనధాన్య సంపదలతో తులతూగుతుంటాయి ". ఓ శత్రు సంహారకా రామా !ఈ రెండు ప్రదేశము ధన ధాన్య సంపదలతో చిరకాలము కొనసాగేను . కొంతకాలము తర్వాత పుట్టినప్పుడే వేయి ఏనుగుల బలము కల ,కామరూపిణి అయినా తాటకి అను యక్షిణి ఇక్కడ నివసించెను . ఆమె బలశాలి అయిన సుందుడు అను వాని భార్య . రామా ! భయపడకు . ఆ తాటకకు 'మారీచుడు 'అను రాక్షసుడు పుత్రుడుగా పుట్టెను అతడు ఇంద్రుడి అంత బలవంతుడు . అతడు మహావీరుడు ,అతని శరీరము ,ముఖములు విశాలమయినవి . భయంకరుడైన ఆ రాక్షసుడు ప్రజలను భాదింప సాగెను . 
ఓ రామా ! దుర్మార్గురాలైన ఆ తాటక 'మలద' కురూశ ' అను ఈ రెండు జానపదములను నిత్యము ధ్వంసము చేస్తూ ఉండేది . ఒకటిన్నర యోజనముల దూరములో ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసిస్తూ ఉండేది . కనుక ఆ తాటక వున్న వనము వున్న దారినే మనమూ వెళ్ళాలి .నా మాటను పాటించి నీ బాహుబలముతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము . ఈ దేశమును మునిపతి వలె ఎట్టి ఉపద్రవములు లేకుండా చేయుము . 

రామాయణము బాలకాండ ఇరువది నాల్గవ సర్గ సమాప్తము . 



                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












                                                 

Friday 1 July 2016

రామాయణము బాలకాండ -ఇరువదిమూడవ సర్గ

                         రామాయణము 

                       బాలకాండ -ఇరువదిమూడవ సర్గ 

రాత్రి గడిచిన పిమ్మట ప్రభాతవేళ విశ్వామిత్ర మహర్షి తృణశయ్య పై పవళించివున్న రామలక్ష్మణులతో ఇలా పలికెను . "కౌశల్యా దేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామా !తూర్పు దిక్కున ఉషః కాంతులు విలసిల్లుచున్నవి . ఓ పురుష శ్రేష్ఠ లే స్నాన సంధ్యా వందనాది నిత్యా కర్మలను ఆచరించుము . "విశ్వామిత్ర మహర్షి పలికిన గంభీర వచనములు పాటించి ,వీరులైన ఆ రాజకుమారులు స్నానమొనర్చి ,సూర్యునకు అర్ఘ్య ప్రధానములను అర్పించిరి . దేవతలకును ,ఋషులకును తర్పణములు ఇచ్చిరి . మంత్ర రాజమైన గాయత్రిని జపించిరి . మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధముగా ప్రాతః కాలకృత్యములైన సంధ్యోపాసనాదులను నిర్వర్తించిరి . పిదప తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి ,మిక్కిలి సంతోషముతో ప్రయాణమునకు సన్నద్ధులై ఆయనముందు నిలబడిరి . పిమ్మట ఆ గురువు గారి వెంట ప్రయాణము చేయుచున్న ఆ మహావీరులు పవిత్రమైన సరయు నది దివ్యమైన గంగా నదిలో సంగమించే పుణ్య ప్రదేశమును చూసిరి . వారు ఆ నాదీ సంగమ ప్రదేశమున పవిత్రమైన ఒక ఆశ్రమమును చూసిరి . అక్కడ దివ్య తేజస్సు కల ఋషులు వేలకొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించివుండిరి . రామలక్ష్మణులు ఆ పవిత్రయాశ్రమమును చూసి ఎంతో సంతోషించినవారై మహాత్ముడైన విశ్వామిత్రుడితో ఇలా పలికిరి . 
"ఓ మహాత్మా !ఈ పుణ్యాశ్రమము ఎవరిది ?ఇక్కడ నివసించు మహా పురుషుడు ఎవరు ?ఈ  విషయములన్నిటిని వినుటకై మేము మిక్కిలి కుతూహల ముతో వున్నాము "మునీశ్వరుడు వారి మాటలు విని "ఓ రామా పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో తెలిపెదను వినుము "అని చిరునవ్వుతో పలికెను . "సుందరమైన శరీరము కల 'కందర్పుడు 'అనువాడు కలడు . అతనిని పండితులు 'కాముడు 'అని పిలుతురు . ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఇక్కడ సమాధినిష్ఠుడై అవిచ్చిన్నముగా తపమాచరించుచు ఉండెను . ఆ సమయమున దుర్భుద్ధి అయిన కాముడు (మన్మధుడు )ఆయన తపస్సుకు భంగము కలిగించెను . అంతట మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హుంకరించెను . ఓ రఘునందనా !కుపితుడైన శివుని యొక్క కాంతిమంటలకు ఆ దుర్మతి యొక్క శరీరావయములు పూర్తిగా దహించిపోయెను . అది మొదలగుని మన్మధుడు 'అనంగుడు 'అను పేరుతో ప్రసిద్ధుడయ్యెను . ఈ దేశము అంగ దేశము అని ప్రసిద్ధి వహించెను . ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది . ఈ మునులు శివ భక్తులు . నిరంతరము ధర్మ పరాయణులు ,వారికి ఏ పాపములు అంటవు . 
పుణ్యాత్ముడవైన ఓ రామా !పవిత్ర గంగా సరయు నదుల సంగమ స్థానములో కల ఈ ఆశ్రమములో మనము ఈ రాత్రి గడుపుదాము . గంగా నదిని రేపు దాటుదాము . ఓ నరోత్తమా !మనందరమూ స్నానాదికాలు నిర్వర్తించి జప ధ్యానములు ముగించుకుని ,హోమ కార్యములను పూర్తి చేసుకుని ఈ ఆశ్రమములో ప్రవేశిద్దాము . "విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇలా సంభాషించుకొనుచుండగా ఆ ఆశ్రమమున కల మునులు తమ తపః ప్రభావమున దూర దృష్టితో ఆ వారి రాకను తెలుసుకొని ,పరమ ప్రీతితో అక్కడికి వచ్చిరి . ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్య పాద్యాది అతిధి సత్కారములను ఆచరించిరి . అనంతరము వారు రామలక్ష్మణులకు కూడా అలాగే అతిధి మర్యాదలు కావించిరి . విశ్వామిత్రుడు ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించెను . స్థానికులు నియమ నిష్టలతో జీవించేవారు అయిన ఆ మునులతో కూడి విశ్వామిత్ర ,రామలక్ష్మణులు ఆ ఆశ్రమమునకు వెళ్లి అక్కడే హాయిగా గడిపిరి . 

రామాయణము బాలకాండ ఇరువదిమూడవ సర్గ సమాప్తము . 



                          శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు .