Monday 4 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది ఆఱవ సర్గ

                             రామాయణము 


                                 బాలకాండ -ఇరువది ఆఱవ సర్గ 

మహారాజకుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి మాటలను విని దృఢ నిశ్చయము కలవాడై ఆ మునితో ఇలా అనెను . "గురువర్యా !ఈ విశ్వామిత్ర మాటలను నిస్సంశయముగా పాటింపుము ", అని మా తండ్రిగారి ఆదేశము ఆ మాట నాకు ఉల్లంఘింప రానిది . మా తండ్రిగారి ఆదేశము ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించి తీరేదను . "శత్రుమర్దనుడైన శ్రీరాముడు ఇలా పలికి ధనస్సును దిక్కులు పిక్కటిల్లేటట్లు ధనుష్టంకారము గావించెను . ఆ వింటి నారియొక్క మహా ధ్వనికి తాటకా వనవాసులందరూ ఎంతో భయకంపితులయిరి . తాటక కూడా ఆ భీకర ధ్వనికి మిక్కిలి క్రుద్ధురాలై దిక్కుతోచనిదాయెను . అయోమయ స్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ,ఆలోచించుచు నలుదిక్కులు పరికించి చూసేను . పిమ్మట ఆమె పట్టరాని ఆవేశముతో ఆ శబ్దము వచ్చిన దిక్కుకు మిక్కిలి వేగముగా పరుగులు తీసెను . 
వికారమైన రూపము ,వికృతమైన ముఖము కలిగి ,మిక్కిలి లావైన ,ఎత్తైన శరీరముతో క్రోధోగ్వేగముతో వచ్చుచున్న తాటకను చూసి ,ఆ రాముడు లక్ష్మణునితో ఇలా పలికెను . "ఓ లక్ష్మణా !ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారము చూడుము . ఈమెను చూచినంతనే పిరికి వాని గుండెలు బద్దలగును . మాయలమారి ,ఎదిరింపశక్యము కానీ బలము కలదియు అయిన ఈ తాటక ముక్కు ,చెవులు ఖండించి ,ఈమె వెనుతిరిగి పోవునట్లు చేసెదను . స్త్రీ అగుటవలన ఈమెను చంపుటకు ఇష్టపడుటలేదు . కనుక బ్రతికిపోయినది . ఈమె కాలు ,సేతులు నఱకి వేసి ,ఈమె సామర్ధ్యమును ,గమన శక్తిని నశింపచేయుట యుక్తమని నాకు తోచుచున్నది . "


శ్రీరాముడు ఇలా పలుకుచుండగా కోపముతో ఒళ్ళు మరచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదకు విజృంభించెను . వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారముతో తాటకను భయపెట్టి 'రామలక్ష్మణులకు శుభమగుగాక ,జయము కలుగుగాక 'అని ఆశీర్వచనములు పలికెను . అంతట తాటక రామలక్ష్మణుల పైకి భయంకరముగా ధూళిని ఎగజిమ్మెను . తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావంతో క్షణకాలం పాటు వారికి తోచని స్థితి కలిగించెను . ఇంకను ఆ తాటక తన మాయా శక్తిచే వారికి కనబడకుండా ఆ రామలక్ష్మణులపై రాళ్ల వర్షము కురిపించెను . అంత శ్రీరాముడు క్రుద్ధుడై ,తన శర పరంపరలచే ఆ శిలా వర్షమును భగ్నము ఒనర్చెను . రాఘవుడు తనమీదకి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించెను . ఆ విధముగా చేతులు తెగి డస్సి వున్న తాటక గర్జించుచు తమపైకి వచ్చుచున్డగా  లక్ష్మణుడు మండిపడినవాడై ముక్కు చెవులు కోసెను . 
కామరూపిణి అయిన ఆ యక్షిణి బహురూపములను పొంది ,తన మాయచే వారిని బయపెట్టుటకు ప్రయత్నించెను . మఱియు ఆమె వారికి కనబడకుండా ఉండి ,భయంకరమైన రాళ్ల వానను కురిపించుచు అటు ఇటు తిరగసాగెను . అన్నివైపులనుండి కురుస్తున్న రాళ్ల వానలో చిక్కుబడిన రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రుడు వారితో ఇలా పలికెను . "ఓ రామా !ఇంతవరకు ఆమెపై చూపిన దయ చాలు . పాపాత్మురాలైన ఈ యక్షిణి కటిక దుర్మార్గురాలు . ఇదివరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచు వచ్చినది ,తన మాయ చేత ఈమె బలపడును . ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది . ఈలోపలే ఈమెను హతమార్చుము . రాక్షసులు సంధ్యాకాలములో బలోపేతులగుదురు . అప్పుడు వారిని ఎదుర్కొనుట కష్టము . "
విశ్వామిత్రుని సూచనను అనుసరించి ,రాముడు తన శబ్దవేది విద్యను ప్రదర్శించుచు బాణములు ప్రయోగించెను . ఆ విధముగా రామ బాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచు తన మాయా బలముతో రామలక్ష్మణులపై దాడి చేయుటకు పరుగులు తీసెను . పిడుగు వలె వేగముగా తనమీదకు దూసుకొని వచ్చుచున్న ఆ తాటక వక్షస్థలముపై రాముడు బాణముతో కొట్టెను . వెంటనే ఆ యక్షిణి నేలపైపడి ప్రాణములు కోల్పోయెను . రాముడు ఈవిధముగా ముక్తిని ప్రసాదించెను . ఇంద్రాది దేవతలు 'బాగు బాగు 'అనుచు శ్రీరాముని కొనియాడిరి . ఇంద్రుడు ,ఇతర దేవతలు అందరూ పరమ ప్రీతులై విశ్వామిత్ర మహర్షితో ఇలా అనిరి . 
" ఓ విశ్వామిత్రా !నీకు శుభమగుగాక ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలు అందరూ సంతోషించిరి . రామలక్ష్మణులపై ప్రేమ చూపుతారు . ఓ మహర్షి !ప్రజాపతి అయిన భృశాశ్వుని కుమారులు సత్య పరాక్రములు . వారు తపో బాల సంపన్నులు . అస్త్ర రూపములో వున్న వారిని రాఘవునికి సమర్పింపుము . ఓ మునీ !శ్రీరాముడు స్థిర సంకల్పంతో నీ సేవలొనర్చుచున్నాడు . కావున ఇతడు ఆ అస్త్రములు పొందుటకు పాత్రుడు . ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహా కార్యము నిర్వహింపవలసి ఉంది . "దేవతలు ఈ విధముగా పలికి విశ్వామిత్రుని పూజించి తమతమ నివాసములకు వెళ్లిరి . ఇంతలో సంధ్యా సమయము అయ్యెను . అంతట ఆ మహర్షి ప్రేమతో రాముని శిరస్సుని మూర్కొనెను (ముద్దాడెను ). పిదప రాఘవుడితో ఇలా అనెను . "చూడముచ్చటగా వున్న ఓ రామా !ఈ రాత్రికి ఇచటనే నివసింతుము . రేపు ఉదయము బయలుదేరి మన ఆశ్రమమునకు వెళ్లుదుము . "రాముడు విశ్వమిత్రుని మాటలకు సంతసించెను . వారందరు తాటక వనమందే ఆ రాత్రి గడిపెను . అంతట ఆ వనము శాపవిముక్తమై ,ఆనాటి నుండే కుభేరుని ఉద్యానవనమైన చైత్ర రధము వలె మనోహరముగా విరాజిల్లెను . ప్రాతః కాలమున మునీశ్వరుడు వారిని మేలుకొల్పెను . 

రామాయణము  బాలకాండ ఇరువది ఆరవసర్గ 


                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













No comments:

Post a Comment