Sunday 10 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది యొకటవ సర్గ

                                 రామాయణము 


                                 బాలకాండ -ముప్పది యొకటవ సర్గ 

అలా యాగము సఫలము అయిన పిమ్మట రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడే విశ్రమించిరి . మరునాటి ఉదయము స్నాన సంధ్యావందనాది క్రియలను ఆచరించి ,ఋషులతో కలసి వున్న విశ్వామిత్రుని ఎదుట నిలిచిరి . వారికి అభివాదమొనర్చి వారితో ఇలా అనిరి . 
"ఓ మునీశ్వరా !మేము నీ సేవకులము . మీ ఎదుట నిలిచి వున్నాము . ఇంకను ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి . మీ ఆనతిని శిరసావహించెదము . "ఆ చిన్నారుల పలుకులు విని విశ్వామిత్రాది మహర్షులు ఇలా పలికిరి . "ఓ నరోత్తమా !మిథిలా నగర ప్రభువైన జనక మహారాజు ఒక యాగమును సంకల్పించాడు . అతడు పరమ ధార్మికుడు ,మనమందరం ఆ యాగమును చూచుటకు వెల్దాము . ఓ నరశ్రేష్టా !నీవు కూడా తమ్ముడితో కూడి మాతో రమ్ము అచట అద్భుతమైన ఒక మహా ధనస్సు ఉంది . ఆ ధనువు సాటిలేనిది . శత్రు భయంకరమైనది . ఓ నరశ్రేష్టా !దానిని ఒక యజ్ఞ సభలో దేవతలు మిథిలాధిపతి అయిన దేవరాతునికి ఇచ్చిరి . ఈ శివ ధనస్సును గంధర్వులు ,అసురులు ,రాక్షసులు ,అంటే కాదు దేవతలు సైతము ఎక్కుపెట్టలేరు . ఇక మానవుల విషయము చెప్పవలసిన అవసరము ఏముంది ?ఈ ధనస్సు యొక్క శక్తిని తెలుసుకోగోరి ,మహా బలశాలురైన రాజులు ,రాకుమారులు దానిని ఎక్కుపెట్టుటకు ప్రయత్నించి విఫలురయిరి . 
ఓ మహానుభావా !మిథిలాధిపతి ,మహాత్ముడు అయిన జనకుని చాపమును అచట నీవు చూడగలవు . అద్భుతమైన ఆ యాగమును కూడా దర్శింపవచ్చు . మిథిలాధిపతి అయిన దేవరాతుడు పూర్వము యజ్ఞము చేసినప్పుడు యాగ ఫలముగా దేవతలు ఈ శివ ధనుస్సుని ఆయనకు అనుగ్రహించిరి . విశ్వామిత్ర మహర్షి మునులతో ,రామలక్ష్మణులతో కూడి మిథిలా నగరమునకు బయలుదేరుతూ వానదేవతలతో ఇలా అనెను . "ఓ వానదేవతలారా !మీకు శుభమగుగాక ,యాగమును చేసి ఫల సిద్ధిని పొందితిని . ఈ సిద్దాశ్రమమునుండి బయలుదేరి గంగా నదికి ఉత్తర తీరమునకల హిమాలయములకు వెళ్లుచున్నాను . "
పిమ్మట ఆ మహాముని మహిమాన్వితమైన సిద్దాశ్రమమునకు ప్రదక్షణ చేసి ఉత్తర దిశగా ప్రయాణము సాగించెను . సిద్దాశ్రమమునందు నివసించుచున్న మృగములు ,పక్షులు సైతము ఆయనను అనుసరించగా ఆయన వాటిని వెనకకు పంపివేసెను . వారందరూ కొంత దూరము ప్రయాణింపగా సూర్యుడు అస్తమించు సమయమాయెను . అంతట ఆమునులందరూ శోణ నాదీ తీరమునచేరి , ఆ రాత్రికి అచట బస చేసిరి . రామలక్ష్మణులు ఆ మునులందరికి నమస్కరించి ధీశాలి అయిన విశ్వామిత్రుని ఎదుట కూర్చుండిరి . అంతట శ్రీరాముడు కుతూహలంతో విశ్వామిత్ర మహర్షిని ఇలా ప్రశ్నించెను . "ఓ మహాత్మా !శోణ నాదీ తీరమున దట్టమైన వృక్షములతో శోభిల్లుచున్న ఈ ప్రదేశము ఎవరిది ?ఈ విషయము వినగోరుచున్నాను . దయతో సవిస్తరంగా తెల్పుడు . "విశ్వామిత్రుడు శ్రీరాముడు  సమాధానముగా ఆ ప్రదేశం వృత్తాoతమును మునులందరూ విటుండగా ఇలా తెలిపెను . 

రామాయణము బాలకాండ ముప్పదియొకటవ సర్గ సమాప్తము . 


                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












No comments:

Post a Comment