Monday 11 July 2016

రామాయణము బాల కాండ -ముప్పది రెండవ సర్గ

                                 రామాయణము 

                                    

                                 బాల కాండ -ముప్పది రెండవ సర్గ 

కుశుడు అణు మహానుభావుడు మా వంశమునకు మూల పురుషుడు . అతడు అయోనిజుడు (బ్రహ్మ మానస పుత్రుడు )గొప్ప తపస్వి ,నియమ నిష్టలతో వ్రతములను ఆచరించువాడు . ధర్మములు బాగుగా ఎరిగినవాడు ,సత్పురుషులను నిత్యము పూజించువాడు . అతని భార్య పేరు వైదర్భి . ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు . భర్తకు మిక్కిలి అనుకూలవతి . ఆ దంపతులకు కుశాంబుడు ,కుశనాభుడు ,ఆధూర్తజసుడు ,వసువు అను నలుగురు కుమారులు కలిగిరి . వారు సద్గుణ సంపన్నులు అన్ని విధముల యోగ్యులు ,తల్లితండ్రులకు దీటైనవారు . ఆ కుమారులను ఉద్దేశించి కుశుడు క్షత్రియ ధర్మములను భోదించు కోరికతో ఇలా అనెను . 
"ఓ పుత్రులారా !ధర్మమును గూర్చి సంపూర్ణముగా తెలుసుకుని రాజ్య పాలన చేయండి "అనెను . పిమ్మట నరవరులు ప్రజాభిమానమును చూరగొన్నవారు అయిన ఆ నలుగురు కుమారులు వెంటనే నాలుగు పురములను ఏర్పాటు చేసుకొనిరి . మహా తేజస్వి అయిన కుశాంబుడు 'కౌశాంబీ 'పురమును ',ఆధూర్తజసుడు ''ధర్మారణ్యము 'అను నగరమును ,'వసువు 'అను రాజకుమారుడు 'గిరివ్రజము 'అను మహా నగరమును నిర్మింపచేసి రి . ఓ రామా !ప్రస్తుతము మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పాలనలోనిది . దీని చుట్టూ 5 పెద్ద పర్వతములు విరాజిల్లుచున్నవి . ఈ   రాజ్యo  శోణ నది ప్రవహించుచున్నది . ఓ రఘురామా !రాజర్షి అయిన కుశనాభుడు ధర్మాత్మురాలైన తన భార్య అగు ఘృతాచి అందు 100 మంది కన్యారత్నములను సంతానంగా పొందెను . ఆ కన్యకామణులు రూప ,యవ్వన ,సౌభాగ్యవతులై పూవులను ,చందనములను ,తిలకములు మొదలగువానిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగలవలె ఉద్యానవనమునకు విచ్చేసిరి . చక్కని ఆభరణములను ధరించినవారై అందరూ గానములతో నృత్యములతో ,వీణాది వాదనములతో పరమానంద భరితులైరి . 
సాటిలేని రూప సౌభాగ్యములు గల ఆ సర్వాంగ సుందరులు ఉద్యాన వనమునకు వచ్చి ,మేఘముల మధ్య తారలవలె విరాజిల్లుచుండిరి . సర్వ సద్గుణ సంపన్నులైన వారి యొక్క రూప వైభవములను ,లావణ్యముల మిసమిసలను చూసి సర్వత్రా సంచరించు దేవుడు ముగ్దుడై వారితో ఇలా అనెను . 
"నేను మిమ్ము వివాహమాడదలిచాను . మానవ రూపముపై మమకారమును వీడుడు . దీర్గాయువును పొందండి . సహజముగా యవ్వనము అస్తిరమైనది .  నన్ను వివాహమాడినచో  యవ్వనము అక్షయము అగును . మీరు  దేవతలు అగుదురు . తిరుగులేని సంచార శక్తి గల ఆ వాయుదేవుని మాటలను విని ఆ 100 మంది   కన్యలు ఆయనను గేలి చేయుచు ఇలా  అనిరి . 
"ఓ సురశ్రేష్టా !నీవు సమస్త ప్రాణులలో ప్రాణముల రూపమున సంచరించెదవు నీ ప్రభావమును  మేమందరము ఎఱుగుదుము . ఎందుకు మమ్ము అవమానించుచున్నావు ?మేమందరము కుశనాభుని కుమార్తెలము దివ్య శక్తి కల నిన్ను నీ అధికారము నుండి తొలగింపగల సామర్ధ్యము మాకు కలదు . కానీ మా తపశ్శక్తిని కాపాడుకొనుటకై మేము ఈ విధముగా చేయము . ఓ దుర్భుద్దీ !మా తండ్రి సత్య వాది . నీవు ఆయనను అవమానింపరాదు ఆయన వలన నీవు మృత్యుముఖమున పడకు . మా తండ్రిగారు నిశ్చయించిన వరునినే మేము భర్తగా సేవించెదము . మా తండ్రియే మాకు ప్రభువు "
వాయు దేవుడు వారి మాటలను విని మిక్కిలి కుపితుడయ్యెను . ఆ ప్రభువు వారి దేహములలో ప్రవేశించి వారిని గూనివారిగా చేసెను . ఆ కారణముగా వారి దేహములు మూరెడు ప్రమాణమునకు కుదించుకునిపోయెను . వారి గర్వము దెబ్బతినెను . వారు రాజభవనమునకు చేరిరి . మఱియు భాదతో ,సిగ్గుతో ,కన్నీరు మున్నీరుగా విలపించుచు నేలపై బడిరి . అంతట ఆ కుశనాభ మహారాజు సహజముగా సౌందర్యవతులైన తన ముద్దు బిడ్డలు దీన వదనులై గూనివారై ఉండుట చూసి ఆశ్చర్యచకితుడై ఇలా అనెను . 
"కుమార్తె లారా !ఇదేమిటి ?మిమ్మందరిని కుబ్జలుగాచేసినవారెవరు . ధర్మమును అవమానించింది ఎవరు ?తెలపండి . మాట్లాడకుండా ఎందుకు నేలపై పడి ఏడుస్తున్నారు ?"అని పలికి రాజు భాదతో నిట్టూర్చి వారి సమాధానమును వినుటకు సావధానుడై ఉండెను . 

రామాయణము  బాలకాండ ముప్పదిరెండవ సర్గ . 

 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు .  




















No comments:

Post a Comment