Tuesday 12 July 2016

రామాయణము బాలకాండ -ముప్పదిమూడవ సర్గ

                                రామాయణము 



                           బాలకాండ -ముప్పదిమూడవ సర్గ 

సర్వ సమర్ధుడైన కుశనాభుని మాటలు విని ,ఆ 100 మంది కన్యలు జరిగిన అంతా తమ తండ్రికి తెలిపిరి . ఆ మాటలు విన్న మహారాజు తన కుమార్తెలతో ఇలా పలికెను . 
"ఓ పుత్రికలారా !క్షమాశీలురు చేయదగిన పనిని మీరు చక్కగా చేసిరి . ఐకమత్యముతో మెలిగి మన వంశ గౌరవము నిలబెట్టిరి . ఈ జగత్తంతయు క్షమ పైనే నిలచి వున్నది . "
ఓ రామా ఆ కుశనాభ మహారాజు దేశ కాలములకు అనుగుణముగా ,తన వంశమునకు దగినట్లుగా ,కన్యాదాన విషయమై మంత్రులతో బాగుగా ఆలోచించెను . ఈ కాలములోనే "చూలి "అను పేరుగల ముని ఉండేవాడు . అతడు సదాచార సంపన్నుడు . ఒకానొకప్పుడు అతడు బ్రహ్మ కొఱకు తపస్సు చేయుచుండగా ఊర్మిళ కుమార్తె అయిన 'సోమద 'అనే గంధర్వ స్త్రీ ఆయనకు సపర్యలు చేయుచుండెను . ఆ ముని సోమద సపర్యలు మెచ్చుకుని సోమదతో ఇలా అనెను . 
"నీ సపర్యలకు సంతసించితిని . నీకు శుభమగుగాక . నీకేమి వారము కావాలో కోరుకో "ఆనందముతో పొంగిపోయిన ఆ గంధర్వ స్త్రీ మృదు మధురముగా ఇలా అనెను . 
"నీవు తీవ్రమైన తపస్సు ఒనరించి ,బ్రహ్మ వర్ఛస్సుతో వెలుగొందుచూ ,బ్రహ్మ తుల్యుడవు అయితివి . ఓ ధర్మ బుద్దీ !జ్ఞానము కల ఒక పుత్రుడిని ప్రసాదించుము . నేను నిష్ఠతో బ్రహ్మచర్యము ఆచరించుచున్నాను . నేనెవరికీ భార్యను కాను కాబోను . నీ బ్రహ్మ తేజస్సు ప్రభావమున నాకు ఒక పుతృడిని అనుగ్రహింపుము అందులకు నీవే సమర్థుడవు . "
అంత ఆ బ్రహ్మర్షి ఆమె యెడ ప్రసన్నుడై ఒక పుతృడిని ప్రసాదించెను . చూలి మహర్షి యొక్క మానస పుత్రుడు 'బ్రహ్మ దత్తుడు 'అనే పేరుతో ప్రసిద్దిచెందెను . అతడు కాంపిల్య నగరమును పరిపాలించుచు సిరి సంపదలతో తులతూగుతూ ఉండెను . 
ఓ రామా !గొప్ప ధర్మ బుద్ది కల కుశనాభుడు తన 100 మంది కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహము చేయ నిశ్చయించెను . ఆ కుశనాభుని ఆహ్వానించి మర్యాదలు చేసి తన పుత్రికలతో వివాహము చేసెను . బ్రహ్మదత్తుని కార స్పర్శ తగిలినంతనే ఆ కన్యారత్నముల మునపటి రూపము తిరిగి ప్రాప్తించెను . వారు మిక్కిలి ఆనంద భరితులు అయిరి . కుశనాభుడు కూడా మిక్కిలి సంతోషించెను . పిమ్మట పుత్రుకలను వారి భర్తతో కాంపిల్య నగరమును పంపెను . సోమద కూడా జరిగిన దానికి మిక్కిలి సంతోషించి ,కోడళ్లను ప్రేమతో నిమిరేను . వారిని వారి తండ్రిని పొగిడెను . 

రామాయణము బాలకాండ ముప్పది మూడవసర్గ సమాప్తము . 


                 శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












 

No comments:

Post a Comment