Saturday 9 July 2016

రామాయణము బాలకాండ -ముప్పదియవ సర్గ

                                రామాయణము 


                                   బాలకాండ -ముప్పదియవ సర్గ 

శతృ సంహార దక్షులు ,దేశకాలములను గుర్తించి తదనుగుణముగా మాటాడగలవారు అయిన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలా పలికిరి . 
"పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షీ !ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు వస్తారో దయతో తెలపండి . యాగ సంరక్షణార్థం వారిని నిలువరించుటకై మేము సావధానులమై ఉంటాము . "ఈ విధముగా పలుకుచు రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధము చేయుటకై త్వరపడుచుండిరి . అందులకు అచటి ,మునులు అందరూ ఎంతో సంతోషించి ,ఆ రాకుమారులను పొగుడుతూ ఇలా అనిరి . 
"నేటి నుండీ 6 దినములు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉందురు . ఓ రాజకుమారులారా ! మీరు సావధానులై ఈ 6 దినముల యజ్ఞమును రక్షించుచుండవలెను .  రాజకుమారులలో సుప్రసిద్దులైన ఆ రామ లక్ష్మణులు వారి మాటలను విని 6 దినములను రాత్రిబవళ్ళు  జాగరూకులై  తపోవనమును  రక్షించుచుండిరి.  మహాధనుర్దారులైన  ఆ  వీరులు  సావధానులై  ఆ సమీపముననే  నిలిచి  విఘ్నకారకులైన  రాక్షసులయొక్క  బాధనుండి  విశ్వామిత్రామహామునిరక్షణ  కార్యములో  నిమగ్నులై  యుండిరి . 
ఐదుదినములు  క్రమముగా యజ్ఞకార్యక్రమములు జరిగెను. పిమ్మట  ఆఱవనాడు  శ్రీరాముడు  లక్ష్మణునితో " ఏమపారటు  లేక  సర్వసన్నద్ధుడైన  యుండుము " అని పలికెను . 
శ్రీ రాముడు ఇలా పలుకుతుండగానే విశ్వామిత్రునితో ,ఋత్విజులతో కూడిన యజ్ఞ గుండము నుండీ అగ్ని జ్వాలలు ఒక్కసారిగా ఎగిసిపడెను . యజ్ఞ వేదిక సమీపమున  విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములను నిర్వర్తించుచుండిరి . అచట దర్భలు, చమసములు ,శృక్కులు ,సమిధలు అలంకరణకే పుష్పములు మొదలగున్నవి వున్నవి . ఇంతలో యజ్ఞ వేదిక నుండి జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లెను . యజ్ఞము వేదమంత్ర పూర్వకముగా యధాక్రమముగా కొనసాగుచుండెను . ఇంతలో ఆకాశము నుండి భయంకరమైన ఒక మహా శబ్దము వచ్చెను . వర్షాకాలమున ఆకాశమును క్రమ్ముకొనే మేఘము వలె రాక్షసులు తమ మాయలను ప్రయోగించుచు వచ్చిరి . భయంకరులైన మారీచ ,సుబాహువులు, వారి అనుచరులు అచటికి చేరి కుండపోతగా రక్తమును వర్షించిరి . ఆ రక్త వృష్టితో వేదిక యొక్క పరిసరములు అన్నీ తడిసిపోయెను . శ్రీరాముడు అట్టి వేదికను చూసి క్రుద్ధుడై వెంటనే ముందుకు దూసుకొచ్చి ఆకాశమున నున్న రాక్షసులను చూసేను . రాజీవలోచనుడైన శ్రీ రాముడు ఆ విధముగా వచ్చి పడుచున్న రాక్షసులను చూసి లక్ష్మణుని వైపు వెళ్లి సాభిప్రాయముగా చూసి ఇలా అనెను . 
"ఓ లక్ష్మణా ! వాయువు మేఘముల వలె మాంస భక్షకులు దుర్మార్గులు అయిన ఆ రాక్షసులను మానవాస్త్రముతో చెల్లాచెదురు కావించెదను చూడుము . ఇట్టి పిరికి పందలను సంహరించుటకై ఏమాత్రము ఇష్టపడను అని పలికి శ్రీరాముడు తన చాపము నందు శరమును సందించెను . మిక్కిలి క్రుద్ధుడైన రాఘవుడు మిగుల శక్తిమంతమై కాంతులను విరజిమ్ముచున్న మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించెను . ఆ మారీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు నూరు యోజనముల దూరమున సముద్ర జలములలో పడిపోయెను . సీతేషువు అను బలమైన శరాఘాతామునకు గురి అయిన మారీచుడు స్పృహను కోల్పోయి ,గిరగిరా తిరుగుచు దూరమునకు కొట్టుకొని పోవుచుండెను . అట్టి మారీచుని చూసి శ్రీరాముడు లక్ష్మణునితో ఇలా అనెను . 
ఓ లక్ష్మణా !ధర్మ సహితమైన సీతేషువు అను పేరు కల ఈ మానవాస్త్రమును చూడుము . ఇది మారీచుని ప్రాణములను తీయక స్పృహ లేకుండా చేసి వానిని తీసుకొని పోవుచున్నది . ఈ రాక్షసులు కఠినాత్ముడు పాపకర్ములు యజ్ఞములను ధ్వంసము చేయువారు . రక్తమును త్రాగువారు . అట్టి ఈ దుర్మార్గులను కూడా వధించెదను . పిమ్మట శ్రీరాముడు అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహువు యొక్క వక్షస్థలమున కొట్టెను . దాని దెబ్బకు అతడు నెల కూలెను మిక్కిలి పరాక్రమ శాలి ,సద్వర్తనుడు అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతము వాయవ్యాస్త్రముతో తుదముట్టించి మునులకు సంతోషము కలిగించెను . ఈ విధముగా ఆ రఘు నందనుడు యజ్ఞమునకు విఘ్నములనొనరించు రాక్షసులనందరిని హతమార్చెను . పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలను అందుకొనెను . యజ్ఞము నిర్విగ్నముగా సమాప్తమయ్యెను . అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీ రామునితో ఇలా అనెను . 
"ఓ మహా భాహు ! నీ వలన నేను కృతార్థుడనైతిని . నీవు నీ తండ్రి గారికి ఇచ్చిన మాటను నిలబెట్టావు . నీ చర్యతో సిద్దాశ్రమము అను పేరు ఈ ప్రదేశమునకు సార్ధకమయినది . నీ ఖ్యాతి ఇనుమడించింది . 

రామాయణము బాలకాండ ముప్పదియవ సర్గ సమాప్తము . 


                      శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















  

No comments:

Post a Comment