Wednesday 13 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది నాల్గవ సర్గ

                              రామాయణము 


                                  బాలకాండ -ముప్పది నాల్గవ సర్గ 

ఓ రామా !ఆ బ్రహ్మ దత్తుడు వివాహము చేసుకొని కాంపిల్య నగరమును వెళ్లిన పిమ్మట పుత్రలు లేని కుశనాభుడు పుత్ర ప్రాప్తికై 'పుత్రకామేష్టి యాగమును ఆచరించెను . బ్రహ్మ మానస పుత్రుడు మిక్కిలి ఉదారుడు అయిన కుశుడు తన కుమారుడైన కుశనాభుని పుత్ర కామేష్టి యాగము వద్దకు వచ్చి ఇలా పలికెను . 
"ఓ కుమారా సర్వ సద్గుణములచేతఁ నీకు దీటైన పుత్రుడు నీకు కలుగును . అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకమున చిరస్థాయిగా ఉంటాయి . "అని పలికి ఆకాశ మార్గమున బ్రహ్మ లోకమునకు చేరెను . కొంత కాలమునకు కుశనాభునికి అతని భార్యఘృతాచి  నందు గాది అను పుత్రుడు కలిగెను . అతడే నా తండ్రి నేను కుశ వంశమున పుట్టాను కావున నాకు కౌశికుడు అనే పేరు కూడా కలదు . ఓ రాఘవా సత్యవతి అనే ఆమె నాకు అక్క చక్కని వ్రత నిష్ఠ కలిగినది . ఆమెకు ఋచీకునితో వివాహము జరిగెను . మా అక్క కూడా కుశ వంశమున పుట్టినది కావున ఆమెను కౌశికి అని కూడా పిలుతురు . ఆమె పతి అనుకూలవతి ఐ ప్రవర్తించుచుండేది . కనుక ఆమె పతి మరణించిన పిదప అతడితో పాటు సశరీరంగా స్వర్గమునకు చేరెను . 
పిమ్మట ఆమె కౌశికి అనే పేరుతో నదిగా భూలోకమున ప్రవహించుచుండెను . ఆమె హిమగిరిని ఆశ్రయించి ఉండెను . ఓ రఘునందనా నేను నా సోదరిమీద గల ప్రేమతో హిమాలయ ప్రాంతమున నేను నివశించుచున్నాను . ఆ సత్యవతి పవిత్రురాలు . సత్యము ,ధర్మము ఆమెకు ప్రాణ తుల్యములు . ఓ రామా ! ఈ క్రతు నిర్వహణార్ధమై ఆ ప్రాంతము నుండి ఇక్కడకి వచ్చితిని . ఓ రామా !నా కథాప్రసంగముతో కొంత రాటెయ్ గడిచింది రేపటి మన ప్రయాణమునకు ఇబ్బంది లేకుండా ఇక నిదురింపుడు . నీకు శుభమగును . అంతట రామలక్ష్మణులు ,మిగిలిన మునులు విశ్వామిత్ర మహాముని వైభవమునకు ఆశ్చర్యపడిరి . ఆ మహర్షిని మెచ్చుకొనిరి . పిమ్మట వారు నిద్రలోకి జారుకొనిరి . 

రామాయణము బాలకాండ ముప్పది నాల్గవ సర్గ . 



                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


















No comments:

Post a Comment