Wednesday 6 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది తొమ్మిదవసర్గ

                                   రామాయణము 



                                       బాలకాండ -ఇరువది తొమ్మిదవసర్గ 

సాటిలేని వైభవములు కల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవుని వలె ఆ వనమును గూర్చి ఇలా ప్రశ్నింపగా ,మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు ఇలా తెలిపెను . 
"మహానుభావుడైన ఓ రామా !దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగములకాలము లోక కళ్యాణమునకై తపమాచరించుచు తత్పల సిద్ధికై ఇక్కడ నివసించెను . వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుటవలన, మహా తపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యకు ఫలసిద్ధి పొందుట వలన దీనికి సిద్దాశ్రమము అని ప్రసిద్ధి ఏర్పడెను . విష్ణువు తపస్సు ఆచరించుచున్న కాలములోనే ప్రహ్లాదుని ముని మనవడు ,విరోచనుని కుమారుడు అయిన 'బలిచక్రవర్తి 'ఇంద్రాది దేవతలను జయించి ,ముల్లోకములకును రాజై పరిపాలించుచు ప్రసిద్ధికెక్కెను . 
'బలి 'యజ్ఞము చేయుచుండగా అగ్నిదేవుడు ని ముందుంచుకుని దేవతలందరూ ఈ ఆశ్రమమున తపమొనరించుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయముగా ఇలా విన్నవించుకున్నారు . 
"ఓ మహా విష్ణూ !విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావము కల యజ్ఞము చేయుచున్నాడు . అది ముగియకముందే ఈ దేవ కార్యము ను నెరవేర్చ ప్రార్ధన యజ్ఞము చేయుచున్న బలి వద్దకు అర్థులు (యాచకులు )అన్ని దిక్కులనుండి ప్రవాహముగా వచ్చుచున్నారు . వారు కోరిన విధముగా ధన ,కనక ,వస్తు వాహనాదులనుఁ ఏమాత్రము వెనకాడక వెంటనే అతడు వారికి దానము చేయుచున్నాడు . ఓ మహా విష్ణూ !మహా మహితాత్ముడవైన నీవు దేవతల హితము కొరకై మాయా యోగమును ఆశ్రయించి ,వామనుడవై అవతరింపుము . మాకు శుభ లాభములను సమకూర్చుము . "
ఓ రామా !ఇంద్రాది దేవతలు తపోనిష్ఠలో వున్న విష్ణుమూర్తిని ప్రార్ధించు సమయమున ,కశ్యప మహర్షి తన భార్య అదితి తో కూడి వేయి సంవత్సరములు తపస్సు చేసి విష్ణుమూర్తిని సంతుష్టునిగా చేసుకొనెను . విష్ణు మూర్తిని ఇలా స్తుతించెను . "ఓ పురుషోత్తమా !నీవు తపస్సు ద్వారా ఆరాధింప తగినవాడివి . తపః ఫలమును ప్రసాదించువాడివి ,జ్ఞాన స్వరూపడవు ,సమస్త కళ్యాణ గుణములు కలవాడవు ,అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సుచే ఆరాధించి దర్శించుకున్నాను . ఓ మహా ప్రభూ చేతనాచేతకాత్మమైన ఈ సమస్త జగత్తు నీలో చూచుచున్నాను ,నీవు ఆద్యంత రహితుడవు ,అట్టి నిన్ను శరణు వేడుచున్నాను . "మిక్కిలి పవిత్రుడైన కశ్యప మహర్షితో శ్రీహరి ప్రీతితో ఇలా అనెను . "నీకు శుభమగుగాక ,వరమును కోరుకో "
అందులకు కశ్యప మహర్షి ఇలా అనెను "వరములను ప్రసాదించు ఓ శ్రీ హరీ !అదితియు ,నేను ,దేవతలు నిన్ను అర్ధించుచున్నాము . సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదించుము . మమ్ము ఆదుకొనగలవాడవు  నీవే . ఓ మహాత్మా !ఓ దేవా !నీవు మాకు పుత్రుడవై జన్మించుము . ఓ అసురసూదనా !ఇంద్రునకు తమ్ముడవు కమ్ము . శోకార్తులైన దేవతలను ఆడుకొనగల శక్తిమంతుడవు నీవే . నీ అనుగ్రహము వలన మా తపస్సులు ఫలించును . నీ సంకల్పమూ నెరవేరును . కావున ఈ ప్రదేశము 'సిద్దాశ్రమముగా 'ప్రసిద్ధి కాంచును . "
అంతట మహా శక్తి శాలి అయిన విష్ణువు అదితి కి పుత్రుడిగా జన్మించెను . వామనరూపమున బలి చక్రవర్తి వద్దకు వెళ్లెను . సమస్త లోకములకు హితమును చేయు ప్రభువైన శ్రీ మహా విష్ణువు వామనుడై అభిమానమును పెట్టుకొనక మూడడుగుల నేలను దానముగా అడిగి ,దానిని స్వీ కరించెను . పిమ్మట త్రివిక్రముడై ముల్లోకములు వ్యాపించి, బలిని అదుపు చేసి ఆ లోకములను ఇంద్రునకు ఇచ్చెను . మహాత్ముడైన వామనుడి పాద స్పర్శ తో పవిత్రమైన ప్రదేశం ఇది . ఇక్కడ అడుగు పెట్టిన వారి సంసారిక బాధలను ఇది దూరము చేయును . నేను త్రివిక్రముడైన వామనుని ఎద కల భక్తిశ్రద్ధలు కారణముగా నేను ఈ ప్రదేశమును ఆశ్రయించితిని . ఓ నరోత్తమా !విఘ్న కారకులైన రాక్షసులు ఈ ఆశ్రమమునకు వచ్చుచుందురు . ఆ దుర్మార్గులను హతమార్చవలసింది ఈ ప్రదేశమే . 
ఓ రామా !పవిత్రమైన ఈ సిద్దాశ్రమమునకు నేడే వెళ్లుదము . నాయనా !ఈ ఆశ్రమము నాది మాత్రమే కాదు నీది కూడా . విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో కూడి ఆశ్రమమున ప్రవేశించి మంచు తొలగి ,పునర్వసు నక్షత్రముతో కూడిన చంద్రుని వలె ప్రకాశించెను . ఆ సిద్దాశ్రమ నివాసులైన మునులందరూ విశ్వామిత్ర మహర్షిని చూసి ,వెంటనే లేచి ,ఆనందముతో సంబరపడిరి . పిమ్మట వారు ముందుకు వచ్చి ,వారికి స్వాగత సత్కారములు గావించిరి . శత్రు భయంకరులైన ,రాజకుమారులు అయిన రామలక్ష్మణులు క్షణకాలం విశ్రాంతి గైకొనిన పిమ్మట ,విశ్వామిత్ర మహర్షికి అంజలి గటించి ఇలా పలికిరి . 
"ఓ మునీశ్వరా !నేడే దీక్షను స్వీకరింపుము ,మీ సంకల్పము నెరవేరును . రాక్షస సంహారము జరిగి తీరును . యజ్ఞము నిర్విఘ్నముగా సాగి ఫలసిద్ధి కలుగును . దీనికి సిద్దాశ్రమము అను  పేరు సార్ధకమగును . "
మహా తేజస్వి అయినా విశ్వామిత్రుడు శ్రీ రాముడు పలికిన ఉత్సాహపూరితమైన పలుకులు విని నియమ నిష్టలతో యజ్ఞ దీక్షను స్వీకరించెను . రామలక్ష్మణులు ప్రశాంత చిత్తులై ఆ రాత్రి గడిపిరి . ఉదయమే మేల్కొని స్నానాదికాలు ఆచరించి ,సూర్యునకు అర్ఘ్య ప్రధానములు ఒనర్చి ,నియమ పూర్వకముగా గాయత్రి మంత్రమును జపించి ,ప్రాతః కాల సంద్యోపాసనము ముగించుకొనిరి . ఇంతలో విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్ని కార్యములను ఆచరించి ,ఆసీనుడై ఉండగా వారు ఆయన వద్దకు వచ్చి నమస్కరించిరి . 

రామాయణము బాలకాండ ఇరువది తొమ్మిదవసర్గ సమాప్తము . 


                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












                                       


                                  

No comments:

Post a Comment