Sunday 31 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది తొమ్మిదవ సర్గ

                                 రామాయణము 


                      బాలకాండ -ముప్పది తొమ్మిదవ సర్గ 

విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయములు విని రాముడు మిక్కిలి సంతోషి ఆ మునితో ఇలా పలికెను . 
"ఓ మహాత్మా !మా వంశమున ప్రముఖుడు అయిన సగర మహారాజు యజ్ఞము చేసిన విధము వినగోరుచున్నాము . దయతో వివరించండి . "
అప్పుడు విశ్వామిత్రుడు "ఓ రామా !మహాత్ముడైన సగరుని వృత్తాన్తమును వివరించెదను వినుము . "అని పలికెను . హిమవంతుడను పర్వత రాజు శంకరునకు మామ . హిమవత్పర్వతమునకు ,వింధ్య పర్వతమునకు మధ్య ఎత్తైన గిరులు లేకుండుటచే ఆ రెండు పరస్పరము చూచుకొనునట్లు ఉండెను . ఆ రెండు పర్వతముల మధ్య ప్రదేశమునందు ఈ యజ్ఞము జరిగెను . ఓ పురుషోత్తమా !ఆర్యావర్తనము గా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశము యజ్ఞ కర్మలకు అనువయినది . నాయనా! రామా !మహారథుడైన అంశుమంతుడు శక్తివంతములైన ధనుర్భాణములను ధరించి ,సగరుని ఆజ్ఞ మేరకు ఆయన యజ్ఞాశ్వమును అనుసరించెను . 
ఇంద్రుడు మాయామయ శరీరము దాల్చి 'ఉక్డ్యాము 'అను పర్వ దినమున సగరుని యొక్క యజ్ఞాశ్వమును అపహరించెను . అప్పుడు ఋత్వుజులు అందరూ సగరునితో ఇలా పలికిరి . "ఓ సగరా !యజ్ఞాశ్వమును ఎవరో అపహరించుకుపోయారు . ఆ హయమును అపహరించిన వారిని చంపి దానిని తీసుకు రమ్ము . యజ్ఞమునకు భంగము కలిగినచో అరిష్టము సంభవించును . కనుక ఓ రాజా !యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగునట్లు చూడుము . "
అప్పుడు సగరుడు తన 60,000 మంది పుత్రులను పిలిచి నేను యజ్ఞ దీక్షలో వున్నాను కావున ఆ యజ్ఞాశ్వము ఎక్కడ వుందో కనిపెట్టి దానిని తీసుకురమ్మని ఆజ్ఞాపించెను . ఈ భూమండలమున    యజ్ఞాశ్వము జాడ దొరకనిచో భూమిని త్రవ్వి అయినా అది కనపడునంతవరకు వెదుకుడు . యజ్ఞాశ్వము అపహరించినవాడిని కూడా అన్వేషించి పట్టుకొనమని ఆజ్ఞాపించెను .
ఓ రామా !మిక్కిలి బలశాలురు అయిన ఆ 60,000 మంది భూమండలమంతయూ యజ్ఞాశ్వము కొఱకు వెతికి దాని జాడ కానరాక ,వజ్ర సమానములైన తమ గోళ్ళతో భూమిని త్రవ్వుట మొదలుపెట్టేను . వారు అలా త్రవ్వు తుండగా పాతాళములో నివశించే పాములు ,రాక్షసులు ,గంధర్వులు భయ కంపితులై గగ్గోలు పెట్టెను . ఆ సగర పుత్రులు ఆ విధముగా పాతాళము వరకు త్రవ్వి కనపడిన వారిని కనపడినట్టు వీడే యజ్ఞాశ్వమును అపహరించినది అంటూ చంపసాగిరి . దానితో భయ కంపితులు ఐన దేవతలు ,గంధర్వులు ,నాగులు అసురులు మొదలగువారు బ్రహ్మ వద్దకు వెళ్లి దీన వదనములతో ఇలా విన్నవించుకొనిరి 

రామాయణము బాలకాండ ముప్పది తొమ్మిదవసర్గ సమాప్తము . 


               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

 












No comments:

Post a Comment