Sunday 3 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది ఐదవసర్గ

                                  రామాయణము 

                         బాలకాండ -ఇరువది ఐదవసర్గ              

విశ్వామిత్ర మహాముని పలికిన పలుకులు విని పురుష శ్రేష్ఠుడైన రాముడు సముచిత రీతిలో ఇలా ప్రశ్నించెను . "ఓ మునీశ్వరా !యక్షులు అంతగా పరాక్రమ వంతులు కారని ప్రతీతి . అబలయిన ఆ తాటక వేయి ఏనుగుల బలము కలిగి ఉండుట ఎట్లు సంభవము ?. అంతట శ్రీరాముని మాటలు విని ,సంతోషముతో విశ్వామిత్రుడు ఇలా పలికెను . "రామా ఆ అబల అంతటి బలవంతురాలగుటకు గల కారణము తెలిపెదను వినుము . వర ప్రభావమున ఆమెకు వేయి ఏనుగుల బలము వచ్చెను . పూర్వము 'సుకేతుడు 'అను ఒక మహా యక్షుడు ఉండెను . అతడు గొప్ప పరాక్రమవంతుడు . సత్ప్రవర్తన కలవాడు . సంతానము లేనివాడు . కావున అతడు ఘోర చేసెను . అతని తపస్సుకి సంతుష్టుడు అయిన బ్రహ్మ ఆ సుకేతునికి ఒక కన్యా రత్నమును ప్రసాదించెను . ఆమె పేరు తాటక . పితామహుడు ఆ కన్యా రత్నమునకు వేయి ఏనుగుల బలమును ఒసంగెను . 
అలా జన్మించిన ఆ తాటక క్రమక్రమముగా పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలై ,చక్కని రూపు శోభలతో విలసిల్లెను . తండ్రి అయిన సుకేతుడు ఆమెను జంభాసురుని కుమారుడు అయిన సుందునకు ఇచ్చి వివాహము చేసెను . కొంత కాలము తర్వాత ఆమె ఒక కుమారుని కనెను .అతని పేరు మారీచుడు . అతడు ఎదిరింపశక్యము కానివాడు . అగస్త్య ముని శాపము నకు గురియై రాక్షసుడు అయ్యెను . ఓ రామా !సుందుడు అగస్త్యుని వలన మృతి చెందెను . అపుడు తాటక తన కుమారుడైన మారీచునితో కూడి అగస్త్య మహామునిని చంపుటకు పూనుకొనెను . తన భర్త మృతికి కారకుడైన అగస్త్యుడి యెడ క్రుద్ధురాలై ఆయనను తినేయుటకు ముందుకు ఉరికెను . కుమారునితో కూడి తన మీదికి విజృభించి వచ్చుచున్న తాటకను చూసి ,మహర్షి అగస్త్య భగవానుడు మిక్కిలి కుదృడాయెను . 'రాక్షసత్వము పొందుము 'అని ముందుగా మారీచుని శపించెను . పిమ్మట "ఓ తాటకా !నీకు ఈ రూపము పోయి భయంకర రూపము ప్రాప్తించును . వికారమైన రూపముతో వికృతమైన ముఖంతో నరమాంస భక్షురాలివి కమ్ము . "అని అతడు తాటకను కూడా శపించెను . 
అట్లు శాపమునకు గురియైన తాటక అందుకు తట్టుకోలేక కోపముతో ఉడికిపోయెను . ఆ కారణముగా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ ప్రాంతమును అంతా ధ్వంసము ఒనర్చుచున్నది . కనుక ఓ రాఘవా !దుష్ప్రవర్తన కలది మిక్కిలి భయంకరమైనది తన పరాక్రముచే లోకములకు ఉపద్రవములను కలిగించుచున్నది అయిన ఈ తాటకను హతమార్చి హువులను కాపాడుము . బ్రాహ్మణులకు హితము కూర్చుము . ఓ రఘునందనా !శాపమునకు లోనైన ఈ తాటకను చంపుటకు నీవు తప్ప ఈ ముల్లోకములో ఎవడును సమర్ధుడు కాడు . ఓ నరోత్తమా ! స్త్రీని చంపుట ఎట్లు ?అని దాని ఎడ కనికరము చూపవద్దు . నాలుగు వర్ణముల వారికి హితమును కూర్చుము . అది రాజకుమారుని కర్తవ్యము . ధర్మ పరిరక్షకుడైన రాజు ప్రజలహితముకై చేయు కార్యములు అవి క్రూరమైనవా ,తద్భిన్నమైనవా అని చూడరాదు . అది పాపకృత్యమైనను ,దోషయుక్తమే అయిననూ దానిని అవశ్వమూ  ఆచరించవలసిందే . రాజ్య భారమును మోయువారికి ఇది విధ్యుక్త ధర్మము . కనుక ఓ కుకుస్తా !అధర్మమునకు ఒడిగట్టిన ఈ తాటకను వధింపుము . 
ఓ రామా !పూర్వము విరోచని సుతుడైన మంధర అను ఆమె భూదేవిని చంపుటకు పూనుకొనగా ఆమెను ఇంద్రుడు చంపెను . అంతే కాక పూర్వము భృగు పత్ని ,శుక్రాచార్యుని తల్లి అయిన 'ఉశన 'అను ఆమె ఇంద్రాది దేవతలను సంహరించుటకు దృఢ వ్రతము చేపట్టగా విష్ణువు ఆమెను చంపివేసెను . ఓ రాకుమారా ఈ విధముగా పెక్కు మంది మహానుభావులు అధర్మములకు ఒడిగట్టిన స్త్రీలను వధించిరి . కావున ఓ రామా !కనికరము చూపక నా మాటను పాటించి ,దుర్మార్గురాలైన తాటకను వధింపుము . 

రామాయణము  బాలకాండ ఇరువది అయిదవ సర్గ సమాప్తము . 



           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















No comments:

Post a Comment