Tuesday 5 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది ఏడవ సర్గ

                                రామాయణము 


                                     బాలకాండ -ఇరువది ఏడవ సర్గ 

మహా యశస్వి అయిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ రాత్రి అచటనే గడిపెను . సంతోషముతో మందహాసము ఒనర్చి శ్రీరామునితో మృదు మధురముగా ఇలా అనెను . "లోక ప్రశంసలు అందుకొనుచున్న ఓ రాకుమారా !తాటక వధతో నేను మిక్కిలి సంతుష్టుడను అయితిని . నీకు భద్రమగుగాక . వివిధములగు అస్త్రములను నీకు పరమ ప్రీతితో ఒసంగెదను . యుద్ధమున నిన్ను ఎదురించెడివారు ఎంతటి వారైనను ,కడకు దేవతలు ,అసురులు ,గంధర్వులు, నాగులు మొదలగువారు ఎవరైనను నేను ఇచ్చే అస్త్రములచే నీకు వశమగుదురు . వారిని నీవు అవలీలగా జయింపగలవు . రఘువీరా !దివ్యమైన దండ చక్రము ,ధర్మ చక్రము ,కాలచక్రము ,తీక్షణమైన విష్ణు చక్రమును ఇంద్రాస్త్రమును ఇచ్చెదను . ఓ నరవరా !వజ్రాస్త్రమును ,శివునికి సంభందించిన మహా శూలమును ,బ్రహ్మ శిరోనామకాస్త్రమును ,ఐషీకాస్త్రమును ,ఉత్తమోత్తమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను . ఓ నరశ్రేష్టా ! రాజకుమారా !మీ ఉభయులకూ 'మోదికి ''శిఖరి 'అణు దివ్యమైన గదలను అందింతును . 
ఓ రామా ధర్మ పాశమును ,కాలపాశమును ,వరుణ పాశమును ,శక్తి సంపన్నమైన వారుణాస్త్రమును ఇచ్చెదను . 'శుష్కాశని ''ఆర్ద్రా శని 'అను రెండు దివ్యాస్త్రములను ,శివునికి సంబందించిన మహాస్త్రమును ,నారాయణాస్త్రమును ఇచ్చెదను . ఆగ్నేయాస్త్రమును ,వాయువ్యాస్త్రమును హయశిరస్సు అను అస్త్రమును ,క్రౌoచాస్త్రమును ,విష్ణు శక్తి ,శివ శక్తి ,అను శక్తి ద్వయమును నీకొసంగెదను . ఇవియే కాక ఇంకా అనేక అస్త్రములను నీకు ఒసంగెదను . ఈ అస్త్రములన్నీ కామ రూప శక్తి కలవి . మహా బాల సంపన్నమైనవి . మిక్కిలి శ్రేష్టమైనవి . వీటిని నీవు నానుండి గ్రహించు . "అని పలికి విశ్వామిత్రుడు శుచియై తూర్పు ముఖంగా కూర్చుని ఆయా అస్త్రములను ,వాటికి సంభందించిన అధిష్టాన దేవతలను మంత్ర పూర్వకముగా రామునికి  ఇచ్చెను . ఆ అస్త్రములను అన్నిటిని పొందుట దేవతలకు సైతము అసాధ్యము . అట్టి మహాస్త్రములన్నియు శ్రీరాముని చేరెను . పిమ్మట ఆ మంత్ర అధిష్టాన దేవతలు అందరూ సంతోషముతో నమస్కరించి ఇలా అనిరి "నిన్ను చేరిన మేమందరము త్రికరణశుద్ధిగా నీ సేవకులమై ఉందుము "
శ్రీ రాముడు చేతి స్పర్శ తో వాటిని స్వీకరించి "స్మరించిన వెంటనే మీరు నన్ను చేరండి " అని ఆదేశించి వారిని పంపివేసెను . మిక్కిలి తేజశ్వి అయినా శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ,ఆ ముని వెంట ప్రయాణమయ్యెను . 





రామాయణము బాలకాండ ఇరువది ఏడవసర్గ సమాప్తము . 



                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు 










No comments:

Post a Comment