Wednesday 6 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది ఎనిమిదవసర్గ

                               రామాయణము 


                                  బాలకాండ -ఇరువది ఎనిమిదవసర్గ 

శ్రీ రాముడు శుచియై అస్త్రములను స్వీకరించి మిగుల  సంతసించినవాడై  మార్గమమధ్యన  వెళ్లుచు  విశ్వామిత్రునితో  ఇట్లనెను. 
ఓ  పూజ్యమహర్షీ !  మీ  అనుగ్రహమువలన  అస్త్రములను  బడసితిని. ఇప్పుడు సురాసురులు కూడా నన్ను ఎదిరించలేరు . ఓ మునీశ్వరా !ఈ అస్త్రములను ఉపసంహరించు విద్యలను కూడా ఉపదేశింపుము . "శ్రీ రాముడు ఇలా పలుకగా విశ్వామిత్రుడు మిక్కిలి సంతోషించి ఆ విద్యలను కూడా ఉపదేశించెను . ఆ విద్యలన్నియు శ్రీరాముని చేరెను . ఆ విద్యాధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించిరి . వారు వినమ్రతతో నమస్కరిస్తూ "ఓ నరోత్తమా మేమందరము మీ దాసులము నీకు ఈము చేయవలెనో ఆదేశించండి "అని పలికెను . అంతట రఘురాముడు " మీరు నేను తలుచుకున్నంతనే నా ఎదుట నిలవమి" ఆజ్ఞాపించెను . వారిని పంపివేసెను . 
అంతట వారు శ్రీరామునకు ప్రదక్షణమొనర్చి ,ఆయన నుండి సెలవు తీసుకుని ,తమ యధా స్థానములకు చేరిరి . సర్వ శుభ లక్షణ సమన్వితుడైన శ్రీరాముడు విశ్వామిత్రుని అనుమతి తీసుకుని ఆ మంత్రములు అన్నిటిని లక్ష్మణుడికి ఉపదేశించెను . ముందుకు సాగుతూ విశ్వామిత్రునితో ఇలా పలికెను . "ఓ మునీశ్వరా !ఈ ప్రదేశమున పర్వత సమీపమునందు మేఘ మండలము వలె వున్న వృక్ష సమూహములు ఉన్నవి . దీనిని గురించి తెలుసుకోవాలని నాకు మిక్కిలి కుతూహలంగా వున్నది . ఇది వివిధ మృగములతో కూడి మిక్కిలి మనోహరమై చూడముచ్చటగా వున్నది . ఇక్కడ నానా విధములైన పక్షుల కిలకిలారావములు వీనులవిందు గావించుచున్నవి . ఈ ప్రదేశము ప్రశాంతమై మిక్కిలి హాయిని కలిగించుచున్నది . కనుక భయంకరమైన తాటక వనము నుండి బయట పడ్డాము అనిపిస్తోంది . ఓ మహాత్మా !ఈ ఆశ్రమము ఎవరిదో తెలుపుము . 
ఓ మహా మునీ !పాపాత్ములను ,బ్రహ్మ హత్యలు చేయువారు ,దుర్మార్గులు ,దురాత్ములు అయిన ఆ రాక్షసులు మీ యజ్న కార్యమునకు విఘ్నము కలిగించుటకై వచ్చెడి ప్రదేశమేది ?పూజ్యుడైన ఓ మహర్షి !ఆ రాక్షసులను వధించి ,మీ యజ్ఞ కార్యము రక్షింపవలసిన ప్రదేశమేది ?ఓ మునీశ్వరా !ఈ విషయములను అన్నిటిని వినగోరుచున్నాను . దయతో తెలుపుడు ". 

    రామాయణము బాలకాండ ఇరువది ఎనిమిదవ సర్గ సమాప్తము . 



                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












No comments:

Post a Comment