Saturday 2 July 2016

రామాయణము బాలకాండ -ఇరువది నాల్గవ సర్గ

                                         రామాయణము 

                                               బాలకాండ -ఇరువది నాల్గవ సర్గ 

                                                     

శత్రువులను హతమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్య కాంతులతో నిర్మలంగా ఉన్న ప్రాతః కాలము నందు సంద్యోపాసనాది కార్యక్రమములను ముగించుకుని విశ్వామిత్రుని అనుసరించుచు గంగా తీరమునకు చేరిరి . వ్రత నిష్టాపరులు ,మహాత్ములు అయిన ఆ మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి ,విశ్వామిత్ర మునితో ఇలా అనిరి . "ఓ మహా మునీ !ఈ రాజకుమారులు ,మీరు ఈ నావను ఎక్కండి . ఆలస్యము కాకుండా సుఖముగా ప్రయాణము చేయండి . "విశ్వామిత్రుడు సరే అని పలికి సాదరముగా ఆ  వీడ్కోనెను . అనంతరము అతడు రామలక్ష్మణులతో కూడి సాగరమును కలిసెడి గంగా నదిని దాటెను . నావ నది యొక్క మధ్య భాగమునకు చేరగానే అలల తాకిడికి చెలరేగిన ఒక మహా ధ్వని రామలక్ష్మణులకు వినపడెను . అప్పుడు శ్రీరాముడు "ఈ నాదీ మధ్య భాగమున జలతరంగముల ఘర్షణ వల్ల ఉత్పన్నమైన ఈ మహా ధ్వనికి కారణము ఏమిటి ?"అని విశ్వామిత్రుడిని అడిగెను . అంతట ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలు విని ,కుతూహలంతో ఆ శబ్దము యొక్క కారణమును తెలుపసాగెను . 
నరశ్రేష్టుడవైన ఓ రామా !బ్రహ్మ దేవుడు కైలాస పర్వతమునందు తపః సంకల్పంతో ఒక సరస్సును సృష్టించెను . ఆయన మనస్సు చేత నిర్మింపబడింది కావున ఇది 'మానస సరస్సు 'అను  పేరుతో ప్రసిద్ధి కాంచింది . దీనికి 'బ్రహ్మ సరస్సు 'అని పేరు . మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంత వరకు చుట్టుకుని ప్రవహించుచున్నది .సరయు నది . సరస్సు నుండి పుట్టినది కావున దీనికి సరయు నది అనిపేరు . బ్రహ్మ సరసు నుండి పుట్టింది కావున ఇది ఎంతో పవిత్రమైనది . ఈ సరయు నది గంగా నదిలో సంగమించునపుడు నీటి తరంగములు ఘర్షణ వల్ల సాటిలేని ఈ మహా ధ్వని కలిగింది . శ్రీరామా!ఈ నాదీ ద్వయ సంగముమునకు నమస్కరింపుము . ధర్మ వర్తనులైన ఆ రామలక్ష్మణులు ఇరువురు ఆ రెండు నదుల సంగమునకు నమస్కరించిరి . పిమ్మట గంగా నది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందుకు నడవసాగిరి .  వంశమున జన్మించిన శ్రీరామచంద్రుడు జన సంచారము లేని దట్టముగా వున్న ఆ అడవిని చూసి మునీశ్వరుని ఇలా ప్రశ్నించెను . " ఈ అడవి ప్రవేశించటానికి వీలులేకుండా ఉంది . కీచురాళ్ళ రొదలతో నిండినది . భయంకరమైన క్రూర మృగములతో వ్యాప్తమైనది . ఈ అరణ్యము నందు భయంకరముగా కూయుచున్న వివిధ పక్షులు ,సింహ ,వ్యాఘ్ర ,వరాహములు ,ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుచున్నవి. చండ్ర ,నల్లమద్ది ,ఎరుమద్ది ,చెట్లతో ,మారేడు వృక్షములతో ,తమ్మి కలిగొట్ల చెట్లతో రేగు చెట్లతో సంకీర్ణమై భయంకరముగా వున్న ఈ కాననము పేరేమి ?"
మిక్కిలి తేజశ్వి అయిన విశ్వామిత్ర మహాముని శ్రీరాముడితో ఇలా పలికెను . "నాయనా !ఈ కారడవి ఎవరిదో తెలిపెదను వినుము . ఓ నరోత్తమా !పూర్వకాలమున ఇచట 'మాలాడాము ',కరూశము 'అను  రెండు దేశములు దేవ నిర్మితములై ఉండెను . అవి ధనధాన్య సంపదలతో తులతూగుచూ జనులతో కిట కిట లాడుచూ ఉండెను . ఓ రామా !పూర్వము ఇంద్రుడు వృతాసురుని వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మ హత్యా పాతకము చుట్టుకొనెను . తత్పలితముగా అతడు అపవిత్రుడయ్యెను . ఆయనను ఆకలి దప్పులు బాధింపసాగెను . దేవతలు ,తపోధనులు ఋషులు ,ఇంద్రుని గంగా తీర్దోదకముల చేత స్నానము చేయించిరి . దానివలన అతని అపవిత్రయు ,ఆకలిదప్పులు తొలగిపోయెను . అది ఈ ప్రదేశమునే జరిగెను . సంతోషించిన ఇంద్రుడు ఈ దేశమునకు ఒక వరమును ప్రసాదించెను . "నా శరీర మాలిన్యము గ్రహించిన ఈ రెండు ప్రదేశములు 'మలద'కురూశ 'పేర్లతో ప్రసిద్ధి చెందుతాయి .ధనధాన్య సంపదలతో తులతూగుతుంటాయి ". ఓ శత్రు సంహారకా రామా !ఈ రెండు ప్రదేశము ధన ధాన్య సంపదలతో చిరకాలము కొనసాగేను . కొంతకాలము తర్వాత పుట్టినప్పుడే వేయి ఏనుగుల బలము కల ,కామరూపిణి అయినా తాటకి అను యక్షిణి ఇక్కడ నివసించెను . ఆమె బలశాలి అయిన సుందుడు అను వాని భార్య . రామా ! భయపడకు . ఆ తాటకకు 'మారీచుడు 'అను రాక్షసుడు పుత్రుడుగా పుట్టెను అతడు ఇంద్రుడి అంత బలవంతుడు . అతడు మహావీరుడు ,అతని శరీరము ,ముఖములు విశాలమయినవి . భయంకరుడైన ఆ రాక్షసుడు ప్రజలను భాదింప సాగెను . 
ఓ రామా ! దుర్మార్గురాలైన ఆ తాటక 'మలద' కురూశ ' అను ఈ రెండు జానపదములను నిత్యము ధ్వంసము చేస్తూ ఉండేది . ఒకటిన్నర యోజనముల దూరములో ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసిస్తూ ఉండేది . కనుక ఆ తాటక వున్న వనము వున్న దారినే మనమూ వెళ్ళాలి .నా మాటను పాటించి నీ బాహుబలముతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము . ఈ దేశమును మునిపతి వలె ఎట్టి ఉపద్రవములు లేకుండా చేయుము . 

రామాయణము బాలకాండ ఇరువది నాల్గవ సర్గ సమాప్తము . 



                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












                                                 

No comments:

Post a Comment