Friday 1 July 2016

రామాయణము బాలకాండ -ఇరువదిమూడవ సర్గ

                         రామాయణము 

                       బాలకాండ -ఇరువదిమూడవ సర్గ 

రాత్రి గడిచిన పిమ్మట ప్రభాతవేళ విశ్వామిత్ర మహర్షి తృణశయ్య పై పవళించివున్న రామలక్ష్మణులతో ఇలా పలికెను . "కౌశల్యా దేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామా !తూర్పు దిక్కున ఉషః కాంతులు విలసిల్లుచున్నవి . ఓ పురుష శ్రేష్ఠ లే స్నాన సంధ్యా వందనాది నిత్యా కర్మలను ఆచరించుము . "విశ్వామిత్ర మహర్షి పలికిన గంభీర వచనములు పాటించి ,వీరులైన ఆ రాజకుమారులు స్నానమొనర్చి ,సూర్యునకు అర్ఘ్య ప్రధానములను అర్పించిరి . దేవతలకును ,ఋషులకును తర్పణములు ఇచ్చిరి . మంత్ర రాజమైన గాయత్రిని జపించిరి . మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధముగా ప్రాతః కాలకృత్యములైన సంధ్యోపాసనాదులను నిర్వర్తించిరి . పిదప తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి ,మిక్కిలి సంతోషముతో ప్రయాణమునకు సన్నద్ధులై ఆయనముందు నిలబడిరి . పిమ్మట ఆ గురువు గారి వెంట ప్రయాణము చేయుచున్న ఆ మహావీరులు పవిత్రమైన సరయు నది దివ్యమైన గంగా నదిలో సంగమించే పుణ్య ప్రదేశమును చూసిరి . వారు ఆ నాదీ సంగమ ప్రదేశమున పవిత్రమైన ఒక ఆశ్రమమును చూసిరి . అక్కడ దివ్య తేజస్సు కల ఋషులు వేలకొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించివుండిరి . రామలక్ష్మణులు ఆ పవిత్రయాశ్రమమును చూసి ఎంతో సంతోషించినవారై మహాత్ముడైన విశ్వామిత్రుడితో ఇలా పలికిరి . 
"ఓ మహాత్మా !ఈ పుణ్యాశ్రమము ఎవరిది ?ఇక్కడ నివసించు మహా పురుషుడు ఎవరు ?ఈ  విషయములన్నిటిని వినుటకై మేము మిక్కిలి కుతూహల ముతో వున్నాము "మునీశ్వరుడు వారి మాటలు విని "ఓ రామా పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో తెలిపెదను వినుము "అని చిరునవ్వుతో పలికెను . "సుందరమైన శరీరము కల 'కందర్పుడు 'అనువాడు కలడు . అతనిని పండితులు 'కాముడు 'అని పిలుతురు . ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఇక్కడ సమాధినిష్ఠుడై అవిచ్చిన్నముగా తపమాచరించుచు ఉండెను . ఆ సమయమున దుర్భుద్ధి అయిన కాముడు (మన్మధుడు )ఆయన తపస్సుకు భంగము కలిగించెను . అంతట మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హుంకరించెను . ఓ రఘునందనా !కుపితుడైన శివుని యొక్క కాంతిమంటలకు ఆ దుర్మతి యొక్క శరీరావయములు పూర్తిగా దహించిపోయెను . అది మొదలగుని మన్మధుడు 'అనంగుడు 'అను పేరుతో ప్రసిద్ధుడయ్యెను . ఈ దేశము అంగ దేశము అని ప్రసిద్ధి వహించెను . ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది . ఈ మునులు శివ భక్తులు . నిరంతరము ధర్మ పరాయణులు ,వారికి ఏ పాపములు అంటవు . 
పుణ్యాత్ముడవైన ఓ రామా !పవిత్ర గంగా సరయు నదుల సంగమ స్థానములో కల ఈ ఆశ్రమములో మనము ఈ రాత్రి గడుపుదాము . గంగా నదిని రేపు దాటుదాము . ఓ నరోత్తమా !మనందరమూ స్నానాదికాలు నిర్వర్తించి జప ధ్యానములు ముగించుకుని ,హోమ కార్యములను పూర్తి చేసుకుని ఈ ఆశ్రమములో ప్రవేశిద్దాము . "విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇలా సంభాషించుకొనుచుండగా ఆ ఆశ్రమమున కల మునులు తమ తపః ప్రభావమున దూర దృష్టితో ఆ వారి రాకను తెలుసుకొని ,పరమ ప్రీతితో అక్కడికి వచ్చిరి . ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్య పాద్యాది అతిధి సత్కారములను ఆచరించిరి . అనంతరము వారు రామలక్ష్మణులకు కూడా అలాగే అతిధి మర్యాదలు కావించిరి . విశ్వామిత్రుడు ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించెను . స్థానికులు నియమ నిష్టలతో జీవించేవారు అయిన ఆ మునులతో కూడి విశ్వామిత్ర ,రామలక్ష్మణులు ఆ ఆశ్రమమునకు వెళ్లి అక్కడే హాయిగా గడిపిరి . 

రామాయణము బాలకాండ ఇరువదిమూడవ సర్గ సమాప్తము . 



                          శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
















No comments:

Post a Comment