Wednesday 27 February 2019

రామాయణము కిష్కిందకాండ -నలుబదిఒకటవసర్గ

                              రామాయణము 

                           కిష్కిందకాండ -నలుబదిఒకటవసర్గ 

సుగ్రీవుడు , వినతుడు మొదలైన వానర వీరులను తూర్పు వైపు పంపిన పిమ్మట అన్ని విధాలుగా నిగ్గు దేలిన వానరులను దక్షిణ దిశకు పంపెను నీలుడు ,హనుమంతుడు జాంబవంతుడు ,సుహోత్రుడు ,శరారీ ,శరగులుముడు ,గజుడు ,గవాక్షుడు ,గవయుడు ,సుషేణుడు ,ఋషభుడు ,మైందుడు ,ద్వివిదుడు ,విజయుడు, గంధమాధనుడు, హుతాశనమతులైన ,ఉల్కాముఖుడు అసంగుడు ,వాలి కుమారుడైన  అంగదుడు మున్నగు వానర వీరులను  మహావీరుడు వానరప్రభువైన సుగ్రీవుడు సీతాన్వేషణకు దక్షిణ దిక్కుకు పంపెను . ఈ వీరులందరికి యువరాజైన అంగదుని నాయకుడిగా నియమించెను . 

"ఓ వానరవీరులారా మీరు సీతాన్వేషణను వింధ్యపర్వతము నుండి ప్రారంభించుము . అక్కడ నుండి నర్మదా నదికి వెళ్లుము అక్కడ విషపూరిత సర్పములు ఉండును కావున జాగ్రత్త . పిదప రమ్యములైన గోదావరి ,కృష్ణవేణి ,వరద ,పెద్దపెద్ద పాములకు నెలవైన మహాభాగ మొదలగు నదీ తీరములను గాలింపుము . మనోహరములైన విదర్భ ,రుషిక ,మాహిషిక వంగ ,కళింగ ,కౌశిక మొదలగు దేశములన్ని బాగా జాగ్రత్తగా వెతుకుము . 
తర్వాత దండకారణ్యము లోని పర్వత ప్రాంతములను ,నదీనదములను ,గుహలను ,గోదావరి నది యొక్క పాయలను చాలా నిశితముగా పరిశీలింపుడు . అలాగే ఆంద్ర ,పుండ్ర ,చోళ ,పాండ్య ,కేరళ మున్నగు దేశములలో సకల భాగములను అనేషించండి . అక్కడకు దగ్గరలో వున్నా మలయా పర్వతమును వదలక వెతకండి . ఆ గిరి శిఖరములు చిత్రవిచిత్రములుగా ఉండును . మహా గిరిపై చందాన వృక్షములు ఎక్కువ . 
అక్కడనుండి ముందుకు వెళ్తే కావేరి నది వచ్చును . అక్కడ అప్సరసలు విహరిస్తుంటారు . ఆ పర్వతము పై నివసించుచున్న అగస్త్యమునిని దర్శించండి . ఆయన అనుమతితో తామ్రపర్ణి నదిని దాటుము . ఆ నదిలో మొసళ్ళు ఉంటాయి జాగ్రత్త . తర్వాత ముత్యములతో అలంకరింపబడిన పాండ్యరాజుల నగరము వచ్చును . అక్కడ కూడా బాగుగా వెతుకుము . అక్కడ నుండి ముందుకు వెళ్తే మీరు సముద్ర తీరమునకు చేరుతారు . ఆ సముద్రములో అగస్త్యుడు మహేంద్రగిరిని ఉంచాడు . ఆ పర్వతము పరమ రమణీయమైన ప్రాంతము . అక్కడ దేవతలు అప్సరసలు ,తిరుగుతుంటారు . అక్కడికి దేవేంద్రుడు పర్వదినములలో సముద్ర స్నానమునకు తప్పక వచ్చును .
అక్కడ నుండి నూరు యోజనాల దూరము వెళ్తే ఒక మహా ద్వీపము వస్తుంది . అక్కడకు ప్రవేశించుట మానవమాత్రులకు అసాధ్యము . అక్కడ కూడా బాగా వెతకాలి . ఆ ప్రదేశము అంతా రాక్షస రాజైన రావణుని అధీనములో ఉండును . ఆ దక్షిణ సముద్రములో అంగారక అను రాక్షసి కలది అది సముద్రము లో వుండి పైన పయనించు వారి నీడలను ఆకర్షించి వారిని భక్షించుతూ ఉండును . అలంకాద్వీపము (సీతాదేవిని అచ్చటనే వుని ఉండవచ్చని వారి ఊహ )లోని ప్రదేశములన్ని నిశితముగా గాలించండి . అక్కడ సీతాదేవి లేదని ఒకటికి రెండు సార్లు నిర్దారించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి . 
ఆ ద్వీపము దాటి ముందుకు వెళ్లిన తదుపరి పుష్పితాము అనే ఒక పర్వతము వస్తుంది . ముందుగా ఆ పర్వతమునకు నమస్కరించి వెతుకుము . అది దాటినా తదుపరి సూర్యవంతము అనే శైలము వచ్చును . దానికి వెళ్లవలిసిన మార్గము అతి కష్టమైనది . అది కూడా దాటినా పిమ్మట వైద్యుతము అను పర్వతము వచ్చును . అక్కడ కల మేలైన కందమూలములు మధువులు తిని త్రాగి సావధానంగా సీతాదేవి కొరకు వెతకండి . కొంచం ముందుకు వెళ్లిన పిమ్మట కుంజరము అను పర్వతము వచ్చును . అక్కడ నుండి ముందుకు సాగిన తర్వాత భోగవతి అను పురము కలదు . విషసర్పములు ఆ నగరమును రక్షిస్తూ ఉంటాయి . 
అది కూడా దాటినా తర్వాత వృషభ పర్వతము వస్తుంది . దానిని దాటినా తర్వాత భూమి సరిహద్దు కనిపించును . అక్కడ స్వర్గమునకు అర్హులైన వారు మాత్రమే నివసించగలరు . అంఎంతరము కనపడునది పితృలోకము అది యమసాధనము అక్కడికి ఎవ్వరు ప్రవేశించలేరు . కనుక మీరు అక్కడకు వెళ్లొద్దు . నేను చెప్పిన ప్రాంతములు అన్ని కూడా చాలా జాగ్రత్తగా వెతికి క్షేమముగా రండి . సీతని చూసాను అని చెప్పేవాడు ,నాతోపాటు సమానముగా భోగములు అనుభవించగలడు ,మిక్కిలి ప్రేమపార్ధుడు ,గౌరవాస్పదుడు . మీకు కూడా నెల రోజులే సమయము ఆ సమయములోపు మీరంతా తిరిగి రావలెను "అని పలికెను 

రామాయణము కిష్కిందకాండ నలుబదిఒకటవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
  








No comments:

Post a Comment