Thursday 28 February 2019

రామాయణము కిష్కిందకాండ -నలుబదిమూడవసర్గ

                                       రామాయణము 

                                    కిష్కిందకాండ -నలుబదిమూడవసర్గ 

సుగ్రీవుడు సుషేణుడిని పడమర దిక్కుకు వెళ్ళమని ఆజ్ఞాపించిన తదుపరి 'శతవలి ' అను వీరునితో "ఓ మహావీరా !నీవు నీతో సమానమైన వీరులను తీసుకునిఉత్తర దిశకు బయలుదేరుము మ్లేచ్ఛదేశములను ,పుళిందులభూములను ,శూరసేనుల రాజ్యములను బాగా అన్వేషించండి . ఇంద్రప్రస్థము దాని పరిసర ప్రదేశములను ,కురుక్షేత్రాది ప్రాణతములను ,మద్రకదేశములను ,కాంభోరాజ్యములను ,యవనుల భూములను ,సకులదేశములను ,ఆరత్తకదేసభాగములను ,బాహ్లిక రాజ్యమును ,రుషిక ప్రదేశం లను ,పురురాజుల భూములను ,టంకణ దేసప్రాంతములను, చీన ,పరమచీన భూములను ,ఎల్లప్పుడూ మంచుతో నిండి వుండు ప్రదేశమును ,దురద దేశములను ,హిమవత్పర్వత ప్రాంతమును ,దట్టముగా వుండే లడ్డుగచెట్లమధ్యను ,పద్మకవృక్షములలోను ,దేవదారు వనములందును ,రావణుని నివాసము కొరకు సీతాదేవి జాడ కొరకు వెతుకుము . 
దేవతలు ,గంధర్వులు సంచరించునట్టి సోమాశ్రమ ప్రాంతములు వెతకండి . పిమ్మట పెద్ద శిఖరములు కల కాళపర్వతము పూర్తిగా వెతుకుము .అది దాటినా పిమ్మట హేమగర్భము అను పర్వతము వచ్చును . పిమ్మట సుదర్శనం అను పెద్ద కొండా వచ్చును . ఈ రెండింటిని బాగా వెతికిన తర్వాత దేవసఖ అను పర్వతము వచ్చును . అక్కడ కూడా బాగా వెతకండి . ఆ పర్వతము దాటినా పిమ్మట ఎటు చూసిన వంద యోజనముల దూరము శూన్య ప్రదేశమే కనపడును . కావున అక్కడ ఎవరు వుండరు . అది కూడా దాటినా పిమ్మట ఒక భయంకరమైన అడవి వచ్చును . అక్కడ మీకు కైలాస పర్వతము కనిపించును . తెల్లని కాంతులతో విరాజిల్లే ఆ పర్వతమును చూసినంతనే మీకు ఒళ్ళు పులకరించును .

 అక్కడ కుబేరుడి భవనము కలదు . అది పరమ రమణీయము . అక్కడ ఆ చుట్టుపక్కలా జాగ్రత్తగా వెతకండి . 
ఆ పిమ్మట మీరు క్రౌంచ గిరికి వెళ్లుము . అక్కడ ఒక భయమకరమైన గుహ కలదు అది కుమారస్వామి తన ఆయుధము ప్రయోగించినపుడు ఏర్పడిందని ప్రసిద్ధి . అక్కడకు జనులు వెళ్లలేరని ప్రసిద్ధి కావున అక్కడ జాగ్రత్తగా వెతకండి . పిమ్మట మైనాకము అను పర్వతము మీకు కనిపించును . ఆ పర్వతము అనేకులైన దేవతలు కిన్నెరు కింపురుషులు లకు నివాసము కావున అక్కడ జాగరూకులై వెతుకుము . ముందుకు వెళ్లిన పిమ్మట ఒక పవిత్రమైన ఆశ్రమము వచ్చును . ఆ ఆశ్రమములో ఉన్న మునీశ్వరులు ను సీతాదేవి జాడకై ప్రార్ధించండి . అక్కడి నుండి ముందుకు వెళ్లిన పిమ్మట అక్కడ సూర్యచంద్రులు కానీ నక్షత్రములు కానీ కనిపించవు . కానీ అక్కడ వుండే మునులు సిద్దులు స్వయంప్రకాశకులు వారి ప్రకాశము వల్లనే అక్కడ వెలుగు ఉండును . అక్కడ వారిని  ప్రార్ధించి సీతాదేవి జాడ తెలుసుకొనుము . 
ఆ పర్వతము  దాటిన పిమ్మట శైలోదము అను పేరు కల నది వచ్చును .

 ఆ నదీ తీరమున ఉత్తర కురు భూములు కలవు . ఆ దేశమున పెక్కు నదులు కలవు అవి జల సమృద్ధి కలవి . ఆ నదులలో వున్న పర్వతములు బంగారు రంగుతో కాంతులీనుతూ అగ్ని పర్వతము వలె ఉండును . అవి వివిధములగు రత్నములకు నిలయములు .

 ఆ ప్రాంతములన్ని బాగా వెతికిన పిమ్మట సోమగిరి అను పర్వతము వచ్చును . ఆ పర్వతము సువర్ణమయము .ఆ పర్వత అందములను  దేవతలు ఆకాశము నుండి చూచుచుందురు . అక్కడ విష్ణువు ,బ్రహ్మ ,శంకరుడు నివసించుచువుండును . ఈ త్రిమూర్తులను భ్రహ్మర్షులు సేవించుచు ఉందురు . ఎట్టిపరిస్థితులలో మీరు ఉత్తర కురుభూములను దాటరాదు . సోమగిరి అందు ప్రవేశించుటకు ఎవ్వరికి సాధ్యము కాదు. మీరు ఇంతవరకు మాత్రమే వెళ్ళగలరు . ఆపై సూర్యరసమే ఉండదు . కనుక ఆ తర్వాత ఏ దేశములు నేను ఎరుగను  కావున అంతవరకూ వెతికి తిరిగి రండు . మీకు కూడా నెలరోజులు గడువు . సీతాదేవి సమాచారమును తెచ్చినచో శ్రీరాముడు మిక్కిలి సంతోషించెను . ఆయన సంతోషించటం ద్వారా ఆ వార్తా తెచ్చినవారు నాకు మిక్కిలి ప్రేమాస్పదులు అవుతారు . "అని పలికెను . 
రామాయణము కిష్కిందకాండ నలుబదిమూడవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




 

                                   

No comments:

Post a Comment