Saturday 20 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువది ఏడవసర్గ

                            రామాయణము 

                                 యుద్ధకాండ -ఇరువది ఏడవసర్గ 

సారణుడు రావణునితో ఇంకా ఇలా చెప్పెను . "ఓ మహారాజా !ఇదిగో ఇటు చూడుము . అక్కడ ఉన్న వానరవీరుడి పేరు 'హరుడు ' ఇతడి అధీనములో ఉన్న వేలకొలది వానరవీరులు వృక్షములను పెకలించి ,చేతపట్టుకుని లంకపై దాడి చేయుటకు సిద్ధముగా ఉన్నారు . ఆ పక్కనే సమూహముగా ఉన్న ఆ భల్లూక సేనను చూసినావా ?ఈ సేనకు నాయకుడు జాంబవంతుడు . యితడు శత్రువులను దెబ్బతీయుటలో సమర్థుడు . యితడు దేవాసుర యుద్ధమునందు ,దేవేంద్రుడికి ఎంతగానో సహాయపడి అతడి చేత అనేక వారములు పొందినాడు . ఈయన అనుచరులు మహోన్నతములైన ఆకారములు కలవారు . మృత్యువుకు భయపడరు . వీరు పర్వత శిఖరములపైకి చేరి ,పెద్దపెద్ద బండలను సైతము శత్రువులపై విసరగలరు . 
ఆ పక్కన కనపడుచున్న వానరోత్తముడి పేరు 'దంభుడు ' మిక్కిలి ఐన ఇతడు తన బలముతో కూడి ఇంద్రునికి సహాయపడుతూ ఉంటాడు . ఇక్కడ కనపడుచున్న వీరుడు 'సన్నాధనుడు 'యితడు వానరులకు పితామహుడు . ఆ ప్రక్కనే ఉన్న వానరయోధుడు 'క్రధనుడు 'యితడు దేవాసుర సంగ్రామములో దేవతలకు సహాయపడుటకై అగ్నిదేవునికి గాంధర్వ కాంత వలన జన్మించాడు . యితడు తన బలముతో కలిసి లంకను నాశనము చేయుటకు ,ఆరాటపడుచున్నాడు . ఇదుగో ఈ సమీపమునే ఉన్న వీరుడు 'ప్రమాథి 'అతడు పెక్కుమంది రోషపూరితులైన సేనలను కలిగినవాడు . 
ఓ మహారాజా !అక్కడ ఉన్న కొండముచ్చులను చూసినావా ?లంకను నేలపాలు చేయుటకు యుద్ధోత్సాహముతో కేకలు వేస్తున్న వీరికి నాయకుడు గవాక్షుడు . అదుగో అటు చూడుము అతడే 'కేసరి 'అను వీరుడు అతను వెనుక అపారంగా ఉన్న సైన్యము లంకను నాశనము చేయటానికి చూస్తున్నట్లుగా వున్నారు . అదుగో ఆ వానర వీరులమధ్యన వున్నవాడు 'శాతవలి 'అను పేరు కల వానర నాయకుడు యితడు భూమండలమున మిక్కిలి పేరు ప్రఖ్యాతలు కలవాడు . ఇతని బలము తిరుగులేనిది . యితడు తన సేనలతో కూడి లంకను భస్మము చేయుటకు కుతూహలపడుచున్నాడు . కార్యసిద్ధి ద్వారా శ్రీరామునికి ప్రీతి కూర్చుటకై యితడు ప్రాణత్యాగమునకు కూడా సిద్దపడును . 
'గజుడు 'గవాక్షుడు 'గవయుడు ''నలుడు ''నీలుడు 'అను వానరవీరులలో ఒక్కొక్కరి వెంట పదికోట్లమంది కపియోధులు కలరు . ఇంకా ఇదేవిధముగా యుద్ధమునకు చురుకుగా పరాక్రమించగల వింధ్యపర్వత వీరులు కలరు వారి సంఖ్య లెక్కింపనలవికానిది . మహారాజా !వీరంతా మిక్కిలి ప్రతిభావంతులు . మహాపర్వతముల వంటి దృఢమైన విశాలమైన శరీరములు కలవారు . అంతేకాదు ఈ భూమండలముపై కల కొండలన్నిటిని క్షణములో ధ్వంసము చేసి ,వాటిని అన్ని దిక్కులకు విసిరివేయకల సమర్థులు . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము . 

                      శశి '

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment