Tuesday 23 July 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదియవసర్గ

                                    రామాయణము 

                                     యుద్ధకాండ -ముప్పదియవసర్గ 

శార్ధూలాది గూఢచారులను చూసి ,రావణుడు అక్కడి వివరములు  అడగ్గా అక్కడి వివరములన్నీ పూసగుచ్చినట్టు చెప్పెను . పిమ్మట అతడు రావణునితో "రాజా !రాముడు నన్ను వదిలిపెట్టినపిమ్మట తన సేనతో ఇటువైపే వచ్చుచున్నాడు . ఆయన గరుడావ్యూహము పన్ని సేనను నడుపుతున్నాడు . రాముడు లంకా ప్రాకారమును చేరుటకు ముందే ఆయనతో యుద్ధమో లేక సీత ను అప్పగించటమో నిశ్చయించుకో "అని పలికెను .   వారి మాటలు విన్న రావణుడు 
శార్ధూలునితో "శార్ధూలా !దేవతలు ,గంధర్వులు ,దానవులు నన్ను ఎదిరించి యుద్ధము చేసినను ,లోకాలన్నీ నన్ను భయపెట్టినను నేను సీతను మాత్రము రామునికి అప్పగించను . మీరు సైన్యమును చూసినారు కదా !వారి బలాబలములు తెలుపుము . "అని పలికెను . 
రావణుడి మాటలు విన్న శార్దూలుడు "శత్రువులకు అజేయుడు ,వానరులకు రాజైన సుగ్రీవుడు ఋక్షరజసుని కుమారుడు . సుప్రసిద్దుడైన జాంబవంతుడు గద్గదుని సుతుడు . గద్గదునిమరియొక కుమారుడు ధూమ్రుడు . ఇంద్రునికి గురువైన బృహస్పతి యొక్క కుమారుడు కేసరి . ఈ కేసరి కుమారుడైన ఆంజనేయుడు ఒంటరిగానే అక్షకుమారుడు మొదలగు రాక్షస వీరులను  హతమార్చెను . ధర్మాత్ముడు వీరుడు ఐన సుషేణుడు వరునిదేవుని పుత్రుడు . రాజా !సౌమ్యుడైన దధిముఖుడు చంద్రుని కుమారుడు . బ్రహ్మదేవుడు మృత్యువు ,సుముఖుడు ,దుర్ముఖుడు ,వేగఁదర్శి అనువారిని వానర రూపములో సృష్టించెను . వానరసేనకు అధిపతి ఐన నీలుడు అగ్నిదేవుని యొక్క ఔరసపుత్రుడు . సుప్రసిద్దుడైన హనుమంతుడు వాయుదేవుని వారము వలన పుట్టినవాడు . అంగదుడు ఇంద్రునికి మనుమడు ,వాలికి పుత్రుడు . 
పరాక్రమవంతుడైన మైందుడు ,ద్వివిదుడు అశ్వినీదేవతల కుమారులు . గజుడు ,గవాక్షుడు ,గవయుడు ,శరభుడు ,గంధమాదనుడు అను ఐదుగురు యమధర్మరాజు కుమారులు . ఈ విధముగా దేవతలా అంశలతో పుట్టిన వానరులు కోట్లమంది . వారు వీరులు శూరులు . వీరు కాక ఇంకా అసంఖ్యాక వానరులు కలరు . వారి సంఖ్యచెప్పనలవి కానిది . దశరథ మహారాజు పుత్రుడు శ్రీరాముడు ,అతడు యువకుడు సింహపరాక్రముడు . ఇతడొక్కడే ఖర దూషణ త్రిశరులను చంపినాడు . విరాధుడు హతమైనది ఇతడి చేతిలోనే . మృత్యుతుల్యుడైన కబంధుడు చంపబడినది ఇతడి చేతిలోనే . వేయిమాటలేల ?ఈ భూమండలమున శ్రీరామునకు సాటి కల పరాక్రమశాలి ఎవడును లేడు . శ్రీరాముడి యొక్క ఉత్తమ గుణములు వర్ణించుట ఈ భూమి అందు ఎవ్వరికి సాధ్యము కాదు . 
ఆ శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడు . అతడు ధర్మాత్ముడు . మదపుటేనుగు వలే దృఢకాయుడు బలశాలి . అతడి బాణముల దాటికి ఇంద్రుడు సైతము మృత్యుముఖం చేరవలసినదే . శ్వేతుడు ,జ్యోతిర్ముఖుడు అనువారు సూర్యుని పుత్రులు . హేమకూటుడు అను వానరుడు వరుణదేవుని సుతుడు . వానరోత్తముడు నలుడు విశ్వకర్మ కుమారుడు . బలశాలి ఐన దుర్ధరుడు వసుసుతుడు . నీకు తమ్ముడు రాక్షసులలో శ్రేష్ఠుడు ఐన విభీషణుడు లంకకు రాజుగా అభిషిక్తుడు అయ్యాడు . సువేల పర్వతము చేరివున్న వానరసైన్యములను గూర్చి పూర్తిగా వివరించితిని . ఇక మిగిలిన కార్యము మేరె నిర్ణయింపవలెను . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పదియవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment