Saturday 27 July 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదినాల్గవసర్గ

                                    రామాయణము 

                                       యుద్ధకాండ -ముప్పదినాల్గవసర్గ 

సరమ సీతాదేవిని ఓదార్చుచు ,"సీతా !నేను మారువేషములో శ్రీరాముడి వద్దకు వెళ్లి నీ కుశల వార్తను తెలిపి ,ఆ స్వామికి నీ సందేశమును వినిపించెదను . మరల భద్రముగా తిరిగి రాగలను . ఆ సామర్ధ్యము నాకు కలదు . "అని పలికెను . ఆ మాటలు విన్న సీతాదేవి ,"సరమా !నీవు నాకు ఉపకారము చేయదలిచినచో ,రావణుని వద్దకు వెళ్లి ,అతడు ఏమి ఉపాయములు పన్నుతున్నాడో తెలుసుకొనుము . ఆ మాయావి వలన ఎప్పుడేమి ముప్పు వచ్చునో అని భయసందేహములు కలుగుచున్నవి . నేను గడగడ వణికిపోవుచున్నాను . రావణుడు తన మంత్రులతో చేయు ఉపాయములు నాకు తెలిపి నాకు మహోపకారం చేయుము . "అని పలికెను . 
సరమ సీతాదేవితో "సీతా !నీవు కోరుకున్నది ఇదే అయినచో తప్పకుండ చేసెదను . "అని పలికి వెంటనే బయలుదేరి ,రావణుడు వున్నా చోటికి వెళ్లి వారికి కనపడకుండా దాక్కుని రావణుడు మంత్రులతో పలికే మాటలు అన్నీ విని సీత వద్దకు తిరిగి వచ్చి అక్కడి విషయములు ఇలా చెప్పెను . "సీతా !రావణుడికి అతి సన్నిహితుడు ,వృద్ధుడు ఐన 'అవిద్ధుడు 'అను మంత్రి రావణునికి సీతను అప్పగించుట మంచిదని ఎన్ని విధములుగా అప్పగించుటకు ప్రయత్నించినప్పటికీ అతడు నిన్ను అప్పగించుటకు అంగీకరించలేదు . రణరంగములో రాముడి చేతిలో ఈ రావణుడు ,అతడి పరివారము అంతా హతమయిన తర్వాతకానీ నీకు విముక్తి లేదనుకుంట రావణునికి ఆయువు మూడినందువల్ల అతడి బుద్ధి వక్రించియుండుటచే ఆ దుర్మార్గుడు ఈ దుష్ట నిర్ణయమునకు వచ్చినాడు . అతడు రాముడికి బయపడి నిన్ను వదిలిపెట్టుట కల్ల . "అని పలికెను . 

సీతాదేవితో సరమ ఈ విధముగా మాట్లాడుతుండగానే ,భూతలమును కంపింపచేయుచు ,వానర సైన్యము మ్రోగించిన భేరినాధములు ,శంఖారావంలు ,కోలాహల ధ్వనులు వినిపించెను . ఆ వానరుల కోలాహలం వినపడినంతనే రావణుని భృత్యులు అందరూ తేజస్సును కోల్పోయిరి . తమ ప్రభువు చేసిన తప్పు వలన 'ఇక తమ బ్రతుకులు తెల్లవారినట్టే 'అని భావించిరి . 

రామాయణము యుద్ధకాండ ముప్పదినాల్గవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment