Tuesday 23 July 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదియొకటవసర్గ

                                    రామాయణము 

                           యుద్ధకాండ -ముప్పదియొకటవసర్గ 

శ్రీరాముడు వానరసేనతో కూడి సువేలపర్వతము సమీపములో వున్న సంగతి గూఢచారుల ద్వారా విన్న రావణుడు తక్షణ కర్తవ్యమును అలోచించి విధ్వజిహ్నుడు అను మాయావి రాక్షసుడిని పిలిపించి అచ్చముగా శ్రీరామునిలానే వుండే మాయా శిరస్సుని ,ధనుర్భాణములను సృష్టించమని ఆజ్ఞాపించెను . రావణుని ఆదేశము మేరకు విద్ధ్వజిహ్నుడు శ్రీరాముని వంటి శిరస్సుని ,ధనుర్భాణములను సృష్టించి రావణునికి ఇచ్చెను . రావనుడు ఆ మాయా శిరస్సుని విద్ధ్వజహ్నుడి వద్దే ఉంచి సీతాదేవిని చూచుటకు అశోకవనమునకు వెళ్లెను . 
అశోకవనంలో సీతాదేవి అధోముఖముగా చూస్తూ దుఃఖిస్తూ ఉండెను . అప్పుడు రావణుడు సీతాదేవిని సమీపించి "కళ్యాణీ !నేను ఎంతగా బ్రతిమిలాడినను రాముడిని నమ్ముకుని నన్ను తృణీకరించినావు . కానీ ఆనాడు ఖర దూషణాదులను చంపిన ఆ రాముడే నేడు నా వారి చేతిలో హతుడైనాడు . ఇప్పుడు నీకు ఆధారము ఎవ్వరు లేరు . ఈ దెబ్బతో నీ గర్వము అణిగిపోయినది . ఇక దుఃఖించి ప్రయోజనమేమి ?సీతా !ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని వెంటనే నా భార్యవు కమ్ము . ఆ రాముడి గురించిన చింతను విడిచిపెట్టుము . ఆ మరణించిన వాడితో నీకేమి పని ?కావున నన్ను పతిగా స్వీకరించి ,పట్టపురానివి కా . నీ భర్త ఎలా మరణించాడోచెబుతాను విను . 
నీ భర్త రాముడు లక్ష్మణునితో ,సుగ్రీవునితో వానరసైన్యముతో కూడి సముద్రమును దాటి ఈవలి తీరమునకు చేరినాడు . వారందరూ ప్రయాణ పరిశ్రమచే మత్తుగా నిద్రించుచుండగా నడి రేయి సమయములో నా మనుషులు అచటికి చేరినారు . 
మా రాక్షస సైనికులు అడ్డుకత్తులు ,ఇనుపకట్లగుదియలు ,చక్రములను ,దండములను ,ఖడ్గములను బాణములను ,సమ్మెటలను ,గథలను ,ఈటెలను ,రోకళ్ళను ఇంకా వివిధాయుధములను తీసుకుని వానరులను బలముగా కొట్టిరి .  పిమ్మట ప్రహస్తుడు రాముడి యొక్క శిరస్సును ,తన మహా ఖడ్గముతో క్షణములో ఖండించివేసెను . అతడు మెరుపుదాడితో విభీషణుడిని బంధించెను . రాక్షసుల దాటికి తట్టుకొనలేక లక్ష్మణుడు వానరసైన్యముతో కూడి నలుదెసలకు పారిపోయెను . సీతా సుగ్రీవుడి మెడ తెగిపోయెను . రాక్షసుల దెబ్బలకి హనుమంతుడి దవడలు పగిలిపోయెను . జాంబవంతుడి మోకాళ్ళను రాక్షసులు ఖండించిరి . ఇలా మా రాక్షసుల దాటికి చాలామంది వానరులు మరణించిరి . మిగిలిన వారు ప్రాణభయముతో పారిపోయిరి . ఈ విధముగా నీ భర్త వానరసైన్యముతో సహా మరణించెను . నీ భర్త ఖండించిన శిరస్సుని నీకు ఇప్పుడే చూపిస్తాను "అని పలికి 
పక్కనే ఉన్న రాక్షస దాసీలతో "విద్ధ్వజిహ్నుని పిలిపించండి అతడే ఆ రాముడి శిరస్సుని రణభూము నుండి తెచ్చినది "అని ఆదేశించెను . వెంటనే విధ్వజిహ్నుడు రాముడి మాయా శిరస్సుని ధనుర్భాణములని తీసుకువచ్చి రావణుడి ఆదేశము మేరకు సీతాదేవి ముందు వాటిని ఉంచి అతడు పక్కకు తప్పుకొనెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పదియొకటవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment