Sunday 21 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదితొమ్మిదవసర్గ

                                 రామాయణము 

                                     యుద్ధకాండ -ఇరువదితొమ్మిదవసర్గ 

శుకసారణుల మాటలు విని వారు చూపించిన వానరవీరులను అపారంగా వున్న వానర సైన్యమును చూసిన పిమ్మట రావణుడు మనసులో కొంత భయపడెను . కానీ ఆ భయము ఏమాత్రము బయటకు కనపడనీయక తనతో శత్రుపక్షమును పొగుడుతూ మాట్లాడినందుకు గాను వారిని ఇరువురిని రావణుడు బాగా తిట్టెను . పిమ్మట వారిని అక్కడనుండి వెళ్లిపొమ్మని కోపించెను . అప్పుడు వారు తలలు వంచుకుని వెళ్లిపోయిరి . పిమ్మట రావణుడు పక్కనే వున్న మహోదరుడితో రాజనీతి అందు బాగుగా నిగ్గుతేలిన చారులను (గూఢచారులను )పిలిపించామని చెప్పెను . 
రావణుడి ఆజ్ఞతో శార్ధూలుడు మొదలగు చారులు రావణుని ముందు నిలిచిరి . రావణుడు వారితో "మీరు వెంటనే శ్రీరాముడు సైన్యముతో విడిది చేసిన ప్రదేశమునకు వెళ్లుము . రాముడు యుద్ధమునకు చేయు ప్రయత్నములను ,అతడు నిద్రించు ప్రదేశములను సకల ఆనుపానులనుఁ తెలుసుకుని రండి . శత్రువుల ఆనుపానులు తెలిసినచో గెలుపు సులభమౌతుంది . "అని పలికెను . 
రావణుడి ఆజ్ఞ తీసుకున్న చారులు వెంటనే రాముడు సైన్యముతో విడిది చేసి ఉన్న సువేలపర్వతము దగ్గరప్రాంతమునకు వెళ్లిరి . అపారంగా వున్న ఆ సేనను చూడగానే వారికి వణుకు మొదలయ్యెను . ధైర్యము కోల్పోయిరి . వారిని చూసి గుర్తించిన విభీషణుడు వారిలో శార్దూలుడిని శ్రీరాముని వద్దకు తీసుకువెళ్లిరి . శ్రీరాముడి వద్దకు తీలుకువెళ్తూనే శార్దూలుడిని అతడి వెనుక వచ్చిన చారులిని వానరులు చావచితకబాదిరి . వారు మూర్చిపోయిరి . చాలాసేపటికి తేరుకొనిరి . శ్రీరాముడు వారిని క్షమించి వదిలివేయటంతో వగర్చుచు లంకకు చేరిరి . 

రామాయణము యుద్ధకాండ ఇరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment