Wednesday 17 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువది అయిదవసర్గ

                               రామాయణము 

                               యుద్ధకాండ -ఇరువది అయిదవసర్గ 

శ్రీరాముడు సేనతో సహా అపారమైన సముద్రము దాటి సముద్ర తీరమున విడిది చేసినాడని తెలుసుకున్న రావణుడు తన మంత్రులైన శుకసారణులను పిలిపించి వారితో "మహా సముద్రమును దాటి గొప్ప వానర సైన్యము ఈవలి తీరమునకు చేరినది . సముద్రముపై వారధి నిర్మించుట అద్భుతము . నాకు నమ్మశక్యంగా లేదు . ఆ వానర సైన్యము యొక్క సంఖ్యా బలము , దాని శక్తి సామర్ధ్యములు తెలుసుకోవలిసిన అవసరము నాకు ఏర్పడినది కావున మీరిరువురు వానర రూపములలో ఆ వానర సైన్యములోకి ప్రవేశించి , వారి సంఖ్య, బలా బలములు ,తెలుసుకొనండి . వారధి నిర్మించిన విధము తెలుసుకొనండి . రామలక్ష్మణులు ఇకపై ఏమి చేయబోతున్నారు ? మొదలగు సమస్త  విషయములను తెలుసుకుని రండి "అని పలికి వారిని పంపివేసెను . 
రావణుడి ఆజ్ఞ మేరకు వానరులుగా తమ రూపమును మార్చుకున్న శుకసారణులు వానర సైన్యములోకి ప్రవేశించిరి . అపారంగా ఉన్న ఆ సేనను చూడగానే వారికి కాళ్లలో వణుకు మొదలయ్యెను . వారు సైన్యమును లెక్కించుటకు ప్రయత్నించిరి కానీ ఫలితము లేకపోయెను . వారిని చూసిన విభీషణుడు గుర్తించి వెనువెంటనే వారిని తీసుకువెళ్లి శ్రీరాముడి పాదములపై పడవేసి "ప్రభూ !వీరు రావణుని మంత్రులు మన సైన్య బాలసామర్ధ్యములు తెలుసుకొనుటకు ఇచటికి మారువేషములో వచ్చినారు . వీరు వధార్హులు "అని పలికెను . శ్రీరాముడిని చూడగానే వారి గుండె జారిపోయెను . 
అప్పుడు శ్రీరాముడు వారి చూసి నవ్వుతూ "మీరు మా సైన్యమును చూసినారు కదా !మీరు ఇంకా ఏమయినా విషయములు తెలుసుకొనవలసినచో స్వేచ్ఛగా తెలుసుకొనవచ్చును . విభీషణుడు మిమ్ములను దగ్గరుండి తీసుకెళ్లి మీరు కోరిన వివరములు చూపిస్తాడు . మీరు మారు వేషములో వచ్చినప్పటికీ  దూతలు కాబట్టి మిమ్ములను వధించము . మీరు తెలుసుకోదలిచిన విషయములు తెలుసుకుని లంకకు వెళ్ళండి. లంకకు వెళ్లిన పిమ్మట మీ ప్రభువుతో నా సందేశము ఈ విధముగా తెలుపండి "ఓ రావణా! నీవు ఏ బలమును ,బలగమును చూసుకుని ,నేను లేని సమయములో సీతను అపహరించావో ఆ బలమును బలగమును తీసుకుని నా ఎదురుగా నిలువు (నన్ను శరణు వేడు ),లేనిచో నీ సైన్యముతో సహా నా బాణములకు నిన్ను బలి చేస్తాను   "అని పలికెను .
ఆ శుక సారణులు తిన్నగా లంకకు వెళ్లి రాముడి మాటలను యధాతధముగా రావణునికి వినిపించిరి . పిమ్మట వారు రావణునితో "రాజా !శ్రీరాముడు ,లక్ష్మణుడు ,సుగ్రీవుడు ,విభీషణుడు వీరు నలుగురు ప్రాణ మిత్రులుగా ఉండిరి . వారిని జయించుట ఎవ్వరికి సాధ్యము కాదు , సేన లేకపోయినా వారు నలుగురే మన లంకను జయించగల సమర్థులు . శ్రీరాముడి అస్త్ర సామర్ధ్యమును గమనించినచో ఆయన ఒక్కడే మన లంకా నగరమును గెలవగల సమర్థుడు అని  అనిపించుచున్నది . సేన అపారంగా ఉండి ,దుర్భేద్యముగా ఉన్నది . కావున సంధి చేసుకుని సీతాదేవిని అప్పగించుట మంచిది . "అని చెప్పిరి 

రామాయణము యుద్ధకాండ ఇరువదియైదవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
 







No comments:

Post a Comment