Sunday 21 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదియెనిమిదవసర్గ

                                   రామాయణము 

                                      యుద్ధకాండ -ఇరువదియెనిమిదవసర్గ 

సారణుడు పలికిన విషయములు విన్న పిమ్మట శుకుడు ఆ వివరణ సరిగా లేదని భావించెను . వెంటనే అతడు తన చేతి వేళ్ళతో నిర్దేశించి చూపుతూ ,శ్రీరాముని పక్షంలోని వీరులను గూర్చి రావణునితో ఇలా చెప్పసాగెను . "ప్రభూ !ఇదిగో మనకు ఎదురుగా అసంఖ్యాకంగా కల వానరవీరులు సుగ్రీవుని మిత్రులు . ఈ కామరూపులు దేవతల ,గంధర్వుల అంశలతో పుట్టినవారు . అదిగో అక్కడ కనపడుచున్న యువకులు ఇద్దరూ 'మైందుడు ''ద్వివిదుడు 'బ్రహ్మ యొక్క అనుగ్రహముతో వారు అమృతమును త్రాగినారు . వారు లంకను దెబ్బతీయుటకు ఉవ్విళ్లూరుచున్నారు . 
ఇక్కడ మదపుటేనుగు లాగా వున్న వీరుడు హనుమంతుడు . ఈ వీరుడికి కోపము వచ్చినచో తన ప్రభావముచే మహా సముద్రమును సైతము అతలాకుతలం చేయగలడు . ఇంతకూ ముందు సముద్రమును దాటి ,లంకకు వచ్చి సీతాదేవితో మాట్లాడినది ఇతడే . బాలుడిగా ఉన్నప్పుడే ఉదయించుచున్న సూర్యుని చూసి పండని భ్రమించి సూర్యువద్దకు ఎగిరినాడు . 
అతని పక్కనే శ్యామా వర్ణముతో వున్నవాడు శ్రీరాముడు ఇక్ష్వాకు వంశజులలో అతిరధుడు . ఈయన పరాక్రమములో  లోకములలో ప్రసిద్దికి ఎక్కినవాడు . ధర్మమును ఎప్పుడూ అతిక్రమింపడు . బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటలో ,ఉపసంహరించుటలో సమర్థుడు . తన బాణప్రయోగములతో ఊర్ధ్వలోకములను ,అధోలోకములను చిన్నాభిన్నమొనర్పగలడు . ఇతడి కోపమునకు గురియైనవాడు మృత్ర్యులోకమునకు చేరినట్టే . నీవు దండకారణ్యము నుండి అపహరించి తీసుకువచ్చిన సీతాదేవి ఇతడి భార్యే . 
శ్రీరాముడి కుడిపక్కన మేలిమి బంగారు కాంతులతో విలసిల్లువాడు . ఇతడి తమ్ముడైన లక్ష్మణుడు నీ మీద కోపముతో కన్నులెర్రచేసినాడు . యుద్దములో ఆరితేరినవాడు . సమస్త శాస్త్రములను పుక్కిటపట్టినాడు . ఈ వీరుడొక్కడే యుద్ధమున రాక్షసులను అందరిని పరిమార్చుటకు ఉత్సాహపడుచున్నాడు . 
శ్రీరామ చంద్రుని ఆశ్రయించుకుని ఆ స్వామికి ఎడమవైపున వున్నవాడు నీ సోదరుడైన విభీషణుడు . శ్రీరాముడు ఇతడిని లంకకు రాజుగా పట్టాభిషిక్తుడిని చేసెను . శ్రీరామునికి విభీషనుకి మధ్య కొండవలెఉన్నవాడు  సుగ్రీవుడు . యితడు సమస్త వానరులకు ప్రభువు . అపజయము ఎరుగనివాడు . బలము కీర్తిప్రతిష్టలు ,వివేకము ,శాస్త్రజ్ఞానం వంశోన్నతి మొదలగు విషయములలో వానరులందరిలో శ్రేష్ఠుడు . 
అసంఖ్యాకంగా  మరో మహా సముద్రము వలేవున్న వానరవీరులతో ,విభీషణుడితో ,సుగ్రీవుడు నిన్ను ఎదిరించుటకు అక్కడ వేచివున్నాడు . తగిన విధముగా అలోచించి ,శత్రువుల ముందు పరాభవం కలుగకుండా ,నీకు జయము ప్రాప్తించునట్టు సముచితములైన ఉపాయములను ఆలోచించుము . 

రామాయణము యుద్ధకాండ ఇరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment