Wednesday 28 June 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదియైదవసర్గ

                                          రామాయణము 

                                         అరణ్యకాండ -నలుబదియైదవసర్గ 

సీతాదేవి వనము నుండి వినబడిన ఆర్తస్వరమును తన భర్తదేయని తలంచి 'ఆ రఘువరుని ఆదుకొనుటకై వెంటనే వెళ్లుము 'అని లక్ష్మణునితో పలికెను . "లక్ష్మణా !మీ అన్నగారి ఆర్తనాదము విన్నప్పటి నుండి నా మనసు నిలకడ లేదు . ఆయనకు ఏ ఆపద వాటిల్లినదో అని నాకు మిక్కిలి భయముగా వున్నది . రాక్షసుల మధ్య చిక్కుకుని బాధపడుతున్నారేమో అని నాకు సందేహము కలుగుచున్నది . నీవు శీఘ్రముగా వెళ్లి ఆయనకు తోడ్పడు "అని పలికెను . 
ఆ మాటలు విన్నను లక్ష్మణుడు 'సీతను రక్షించుచు నీవు ఇచటనే వుండు 'అన్న తన అన్న మాటలు జ్ఞప్తికి వచ్చుటచే కదలక అక్కడే ఉండెను . అది చూసిన సీతాదేవి మిక్కిలి క్రుద్ధురాలై "లక్ష్మణా !నీ సోదరునియెడ పైకి ప్రేమ నటించుచుంటివే కానీ ,నిజముగా నీవు ఆయనపాలిటి శత్రువువు . ఏలననగా ఇట్టి ఆపద సమయము నందు నీవు ఆయనకడకు  చేరుటలేదు . నీవు నా మీద కోరికతో రాముని హానిని అభిలషించుచుంటివి . కావుననే శ్రీరాముడు సంకట స్థితిలో ఉండగా ఆ విషయము పక్కన పెట్టి ,ఇక్కడ నన్ను రక్షించు నెపముతో ఉండుటలో అంతరార్ధము ఏమున్నది ?
భర్త ఆపద పాలైనట్లు భావించుచున్న సీతయొక్క మానసికస్థితి భయకంపితమైన లేడిస్టితి వలె ఉండెను . ఆమె శోకమగ్నయై కన్నీరుమున్నీరుగా ఏడ్చుచు ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు ఆమెతో ఈ విధముగా వచించెను . "ఓ వైదేహి !ముల్లోకములవారు ,తిరుగులేని బలములతో ఇంద్రాది దేవతలతో కూడి వచ్చినను ,శ్రీరాముని ఎదుర్కొనలేరు . ఆయనకు ఎట్టి కీడు సంభవించదు . నీ భర్త ఆ మృగమును చంపి శీఘ్రముగనే తిరిగి వచ్చును . నన్ను నమ్ము నిన్ను వంటరిగా వదిలి నేను వెళ్ళలేను . ఇదంతా రాక్షస మాయ అని నా అనుమానము "అని పలుకగా 
ఆ మాటలు విని భర్త ప్రేమ అధికముగా కల ఆ సీతా దేవి మిక్కిలి క్రుద్ధురాలై "దుష్టుడా !పాపాత్ముడా !వంశమునకు చెడ్డపేరు తెచ్చువాఁడా !శ్రీరాముడు వంటరిగా వనములకు వచ్చుట చూసి నీవు నన్ను పొందవలెననెడి క్రూర బుద్దితో ఆయన వెంట వచ్చితివి లేదా మాకు హాని తలపెట్టుటకై ఆ భరతుడి నిన్ను పంపివుండవచ్చు . ఓ సౌమిత్రీ !ఎట్టి పరిస్థితిలో నీ కోరిక కానీ భరతుడి పన్నాగము కానీ నెరవేరదు . నా భర్త లేకుండా ఈ భూతలం మీద ఒక్కక్షణము కూడా బతికి ఉండలేను . నీ కళ్లెదుటే నా ప్రాణములు తీసుకొనెదను . "అని మిక్కిలి పరుష వాక్యములు పలుకగా లక్ష్మణుడు 
"అమ్మా !నీవు నాకు పరమపూజ్యురాలైన దేవతవు . నా సహజస్వభావము బట్టీ నేను అన్నగారి ఆజ్ఞను పాలించుటయందే నిరతుడనై ఉంటిని . అట్టి నన్ను సాధారణ స్త్రీ వలె ఇట్లు శంకించుచున్నావు . అమ్మా !నీవు పొరబడుచున్నావు . దీనివలన ఏమి కీడు రానున్నదో ,తల్లీ నాకు అపశకునములు గోచరించుచున్నవి . మల్లి తిరిగి  నిన్ను మా అన్న గారితో కలిసియుండగా చూసేది భాగ్యము నాకు కలుగునో లేదో   అని నాకు సందేహము కలుగుచున్నది . "అని పలుకగా 
లక్ష్మణుడు శ్రీరాముడి వద్దకు వెళ్ళుటకు జాప్యము చేస్తున్నాడని భావించిన సీతాదేవి మిక్కిలి ఆవేశముతో "లక్ష్మణా !శ్రీరాముడికి దూరమై నేను ఒక్క క్షణమైనను బతకజాలను అందులకై గోదావరిలో దూకెదను ,ఉరివేసుకొందును ,లేదా పర్వత శిఖరము నుండి క్రిందపడెదను . తీవ్రమైన విషము త్రాగెదను ,అగ్నిలో ప్రవేశింతును ,ఎట్టి పరిస్థితిలో పరపురుషుడిని తాకను "అని పలికి . అనంతరము ఆమె గుండెలు బాదుకొనుచు ఏడవసాగెను . సీతాదేవి మొండివైఖరి ఆమె పలికిన తీవ్ర వచనములను సమాధానమౌ చెప్పలేక చేసేది లేక ఆమెకు నమస్కరించి మనస్సులో ఈమెను ఒంటరిగా విడిచి వెళ్ళుట వలన ఇదే ఆపద వచ్చునేమో అని భయపడుతూ ఎట్టకేలకు మనసు దిటవు చేసుకునిలక్ష్మణుడు  శ్రీరాముడు వెళ్లిన వైపుగా బయలుదేరెను . 

రామాయణము అరణ్యకాండ నలుబదియైదవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  









 

Tuesday 27 June 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదినాల్గవసర్గ

                                               రామాయణము 

                                                  అరణ్యకాండ -నలుబదినాల్గవసర్గ 

మహాతేజస్వి అయిన శ్రీరాముడు ఆ విధముగా లక్ష్మణుడితో పలికి ధనుర్భాణములు ధరించి ,లేడి వెనక పరుగిడెను . మారీచుడు రాముని ఆశ్రమమునకు దూరమంగా తీసుకువెళ్ళవలెననే కోరికతో కొంతసేపు కనపడుతూ ,మరికొంతసేపు మాయమై ఈ విధముగా మాయలచే ఆ మారీచుడు శ్రీరాముని ఆశ్రమము నుండి పెక్కు దూరము తీసుకువచ్చెను . 
రాముడు ఆ మాయలు చూసి దానిని ప్రాణములతో పెట్టుకొనుట సాధ్యము కాదని తలచి దానిపై బాణమును ప్రయోగించెను . ఆ బాణము తగిలిన వెంటనే ఆ లేడి రూపమున వున్న మారీచుడు   తాడి చెట్టంత పైకి ఎగిరి తన స్వస్వరూపముతో కింద పడెను . అతడు ఆ బాణపు దెబ్బకు గిలగిలలాడుతూ రావణుడి వచనములు (సీతను ఆశ్రమములో వంటరిగా ఉండునట్లు చేయుము )గుర్తుకువచ్చి హా సీతా !హా లక్ష్మణా !అని బిగ్గరగా అరచి మరణించెను . 
ఆ మరణించిన మారీచుని చూసి రాముడు ఇది అంతయు లక్ష్మణుడు చెప్పినట్టే రాక్షస మాయే . ఈ రాక్షసుడు మరణించుచు అయ్యో సీతా !అయ్యో లక్ష్మణా !అని అరుస్తూ మరణించాడు . సీత ఈ పలుకులు విని ఏమగునో కదా ,లక్ష్మణుడు ఎంత చింతించునో కదా అని దిగులుతో ,భయమునకు లోనయ్యేను . వడివడిగా తన ఆశ్రమము వైపుగా అడుగులు వేయసాగెను . 

              రామాయణము అరణ్యకాండ నలుబదినాల్గవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  







 

Monday 26 June 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదిమూడవసర్గ

                                     రామాయణము 

                              అరణ్యకాండ -నలుబదిమూడవసర్గ 

చక్కని అవయవ సౌభాగ్యము కల సీతాదేవి పూలు కోయుచు ఎంతో రమ్యముగా వున్న ఆ మృగమును పరిశీలించి చూసి "ఆయుధములతో రండు "అని రామలక్ష్మణులను బిగ్గరగా పిలిచెను . ఆ పిలుపు విని అచటికి వచ్చిన రామలక్ష్మణులు ఆ కాంచన మృగమును చూసేను . 


అప్పుడు లక్ష్మణుడు "అన్నా !ఇది సాధారణ మృగము కాదు లోకములో ఇట్టి మృగము ఉండుట అసంభవం . మారీచుడే ఈ మృగము రూపమున వచ్చి ఉంటాడు . అతడు వేట నిమిత్తమై వచ్చు రాజులను ఈ విధముగా మాయా రూపములతో ఏమార్చి హతమార్చెదడు . "అని పలుకుచుండగా సీతాదేవి లక్ష్మణుని చేతి సంజ్ఞతో ఆపి ,రామునితో 
"నాధా !ఈ లేడి చూచుటకు బహు చూడముచ్చటగా వున్నది . ఈ వనవాసములో ఇక్కడ అనేక మృగములు సంచరించుచు ఉండును . వాటన్నిటి కంటే ఇది సౌందర్యమును ఇది మిక్కిలి శ్రేష్టమైనది . మన వాసకాలము ముగియ వచ్చుచున్నది . అంతః పురమునకు ఈ మృగమును తీసుకువెళ్ళినచో అది అంతఃపురమునకే వన్నె తెచ్చును . అత్తగార్లు ,భరతుడు ,చెల్లెల్లు మిక్కిలి సంతోషించెదరు . ఒకవేళ అది ప్రాణములతో దొరకని యెడల అందమైన దాని చర్మముపై నీతో కలసి కూర్చునేదను . "అని పలికెను . 
ఆ మాటలు విన్న శ్రీరాముడు "లక్ష్మణా !సీత ఈ లేడికై ఎంతగా ఆకర్షకుతురాలయినదో చూచితివి కదా !ఈమె కోరిక మృగ చర్మమే కావున నేను దీనిని చంపి అయినను తెచ్చెదను . ఒకవేళ నీవు చెప్పినట్టు ఇది మారీచుడే అయితే వాడు మునులకు ఋషులకు అనేక ఇక్కట్లు కలిగించుచున్నాడు . అనేకమంది మునులను ,వేటకై వచ్చిన రాజులను పరిమార్చినాడు . కావున వీడినిఅవశ్యము నేను చంపవలయును . నీవు సీత రక్షణార్ధమై ఇచటనే ఉండుము . నేను ఈ మృగమును చంపి అయినను తెచ్చెదను . సీత రక్షణ విషయములో అప్రమత్తుడవై ఉండుము . జటాయువు సహాయము తీసుకొనుము "అని పలికి ఆ మాయా మృగము వెనుక పరుగిడెను . 

రామాయణము అరణ్యకాండ నలుబదిమూడవసర్గ సమాప్తము . 

                                  శశి ,

ఎం .ఏ  (తెలుగు 0,తెలుగు పండితులు . 









Saturday 24 June 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదిరెండవసర్గ

                                                రామాయణము 

                                                 అరణ్యకాండ -నలుబదిరెండవసర్గ 

మారీచుడు ఆ విధముగా పరుష వాక్యములు పలికినప్పటికీ రావణుడిపై కల భయముతో "సరే వెళ్ళెదము "అని పలికి శ్రీరామాశ్రమమునకు వెళ్ళుటకు అంగీకరించెను . అప్పుడు రావణుడు సంతోషముతో మారీచుని కౌగలించుకుని ,తన రథముపై ఎక్కించుకుని శ్రీరామాశ్రము దగ్గరలోకి తీసుకెళ్లి ,బంగారు లేడీగా మారి రాముని దూరముగా తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించెను . మారీచుడు రావణుని ఆజ్ఞ ప్రకారము బంగారు వర్ణము వెండి మచ్చలు కల సుందరమైన లేడీగా మారి ఆ రామాశ్రమ పరిసర ప్రాంతములలో తిరుగాడసాగెను . 
కొంతసేపు పచ్చికను మేస్తూ ,ఇంకొంతసేపు ఎగురుతూ ,పరిగెడుతూ ,కొంతసేపు విశ్రమిస్తూ సీతాదేవి కంట పడవలెనని అది ఆ చుట్టుపక్కలననే తిరగాడా సాగెను . మిగిలిన జింకలు ,జంతువులూ వాటికి కల పరిజ్ఞానంతో అది మామూలు మృగము కాదని గ్రహించి దూరముగా పారిపోయెను . జాతి లక్షణము న ఆ రాక్షసులు జంతువులను భుజించువాడే అయినను ఇప్పుడు వాటిని స్పృశించి ఊరకుండెను కానీ భుజించుటలేదు . 
అలా రెండు ఘడియల కాలము గడిచిన పిమ్మట రామపత్ని అగు సీతాదేవి పూజకు పూలు కోయుటకై ఆశ్రమము వెలుపలికి వచ్చెను . ఆమె వృక్షములు ,మొక్కలు చుట్టూ పూలు కోయుటకై తిరుగాడసాగెను ఆమె పరమ సాధ్వి . పెక్కు కాలము(13 సంవత్సరములు ) వనవాసము చేసిన పతివ్రతాశిరోమణి . ఆమె రమ్యమైన ఆ మృగమును చూచెను . జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి వివిధములగు రత్నశోభతో విలసిల్లుచున్న అట్టి లేడిని ఇదివరలో చూచి ఎరుగదు . అందువలన ఆమె మిక్కిలి ఆశ్చర్యముతో కళ్ళు పెద్దవి చేసి దానిని చూసేను . 

రామాయణము అరణ్యకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం .  ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  





    

Wednesday 21 June 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదియొకటవసర్గ

                                     రామాయణము 

                                  అరణ్యకాండ -నలుబదియొకటవసర్గ 

రావణుడు పలికిన మాటలు విన్న మారీచుడు కోపముతో "ఓ దుష్టబుద్ధి కల రావణా !నేను ఎంతగా చెప్పినప్పటికీ మరణమాసన్నమగుట చే నా మాటలు నీ చెవికి ఎక్కుటలేదు . నీ చేతిలో మరణించుట కంటే ,నీ శత్రువైన రాముని చేతిలో మరణించుట నాకు సంతోషము . నేను లేడి రూపధారుడనై అచటికి వెళ్లిన పిదప నా మరణము తధ్యము . నా మరణానంతరము నీ మరణమూ తధ్యము . 
సీతాపహరము నీవు చేసినచో నీ బంధుపరివారముతో సహా నాశనమగుట తధ్యము "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ నలుబదియొకటవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

Monday 19 June 2017

                                            రామాయణము 

                                             అరణ్యకాండ -నలుబదియవసర్గ 

 మారీచుడు ఆ విధముగా హితోక్తి పలికినప్పటికీ చావు ఘడియలు సమీపించిన రావణుడు అతడి మాటలు ఏమాత్రమూ లక్ష్యపెట్టక "మారీచా !దుష్టుడు ,క్రూరస్వభావుడు ,మానవమాత్రుడు ఐన ఆ అల్పుడు గూర్చి నీవు పలికిన మాటలకు నేను ఏ మాత్రమూ బెదరను . నీవే కాదు దేవతలు సైతము నన్ను సీతాపహరణ యోచన నుండి మరల్చలేరు . 
ఇది తధ్యము . ఖరుడు మొదలగు రాక్షస వీరులను చంపిన రాముడిపై నేను తప్పక ప్రతీకారము తీర్చుకొనెదను . నీవు బంగారవర్ణపు లేడీగా మారి వారి ఆశ్రమం పరిసరాలలో చరించు . అప్పుడు సీత లేడిపై ఆశపడి రాముడిని ఆ లేడి కావలెనని కోరును . రాముడు దానికై పరిగెత్తును . అతడిని దూరముగా తీసుకెళ్లి ,నీవు శ్రీరాముడి కంఠ స్వరముతో ఆపద వచ్చినట్టుగా బిగ్గరగా అరువుము . అప్పుడు లక్ష్మణుడు సైతము అచటి నుండి రాముడు వెళ్లిన వైపుగా వెళ్ళును . ఆసమయములో నేను సునాయాసముగా సీతను అపహరించెదను . 
ఓ మారీచా !నేను చెప్పినట్టుగా చేసి తీరవలెను . ఇది నా ఆజ్ఞ నా ఆజ్ఞను అతిక్రమించినచో నిన్ను నేను చంపివేయుదును . లేడి వేషములో రాముని ఆశ్రమమునకు వెళ్ళినచో నీవు ఎటులైనను తప్పించుకొను అవకాశము కలదు . కానీ నా మాటను అతిక్రమించినచో నీకు మరణము తప్పదు ఇది సత్యము . "అని పలికెను . 

         రామాయణము అరణ్యకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  





   

Sunday 18 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదితొమ్మిదవసర్గ

                                              రామాయణము 

                                            అరణ్యకాండ -ముప్పదితొమ్మిదవసర్గ 

ఓ  రావాణా! నాటియుద్దమున  శ్రీ రాముని  అనుగ్రహముచే  ఎట్టకేలకు  సురక్షితుడనై   ప్రాణములతో  బయటపడి  ఇట్లుంటిని.  ఇప్పుడుగూడ  జరిగిన మరియొక వృతాంతమున  గూర్చి తెలిపెదను  సావదానముగావినుము. 
శ్రీరాముని వలన  ఆ  విధముగా  ప్రాణాపాయస్థితికి  లోనైనను  నేను  ఆయనయెడ  విరోధభావమును  మాత్రమును  వీడలేదు.  ఒక  నాడు  మృగ  రూపమును  దాల్చిన   ఇద్దరు  రాక్షసులతో  గూడి  నేను దండకారుణ్యమున  ప్రవేశించితిని  నేను మాంసమును  భక్షించేడి   ఒక  మహాక్రూర  మృగరూపమును  ధరించి  ఆ  ఆవిడయందు  తిరుగాసాగితిని  అప్పుడు నిప్పులు  గ్రక్కుచున్న  నాలుకతో  దృఢమైన     శరీరముతో  వాడియైన  కోఱలతో మహా బలశాలినై ఉంటిని . 
ఆ విధముగా మిగుల భయంకరరూపమున నేను అగ్నిశాలలయందును ,పవిత్ర జలాశయాల తీరమునందు తపమొనరించెడి మునీశ్వరులను హింసించుచు సంచరించుచుండిని . దండకారణ్యమున ధర్మకార్యనిరతులై న తాపసులను చంపి ,వారి రక్తమాంసములు భక్షించుటయే నాపనిగా ఉండెను . నేను అట్లు తిరుగుచు ,ధర్మాత్ముడై,మునివేషములోవున్న శ్రీరాముని ,సీతాదేవిని ,లక్ష్మణుని సమీపించితిని . శ్రీరాముడు మహాబలశాలి అయినను "యితడు తాపస వృత్తిలో వున్నాడు కదా !ఎవ్వరిని హింసించడు కదా !"అని భావించి ఆయనపై నాకు కల కోపముతో బుద్ధిహీనుడనై శ్రీరాముని చంపదలచి ఆయన మీదకు దూకితిని . 
అప్పుడు శ్రీరాముడు ధనుస్సుని ఆకర్ణాంతము లాగి ,శత్రుసంహారకములైన మూడు బాణములను మాపై ప్రయోగించెను . ఆ బాణములు మా ముగ్గురిని వెంటాడినవి . ఆయన బాణముపు దెబ్బ రుచి నాకు ముందే తెలియుట చే నేను ఎలాగోలా తప్పించుకుంటిని . కానీ నా మిత్రులు ఇద్దరు ఆ బాణపు దెబ్బలకు మరణించితిరి . పిమ్మట పశ్చాత్త్తాపపడి ,దుశ్చరితలు మాని ,తపోనిష్ఠలో నిమగ్నమయితిని . ఆ రోజు నుండి నాకు ఎటు చూసినా శ్రీరాముడే కనపడుచున్నాడు . ఏ చిన్న చప్పుడు విన్నను నేను భయముతో వణికిపోవుచున్నాను . నేను నీ మంచి కోసమే ఇదంతా చెప్పుచున్నాను "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పది తొమ్మిదవసర్గ సమాప్తము . 

                                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Saturday 17 June 2017

రామాయణము అరణ్యకాండ - ముప్పదిఎనిమిదవ సర్గ

                                     రామాయణము 

                                          అరణ్యకాండ   - ముప్పదిఎనిమిదవ  సర్గ 

నేను ఒకానొకప్పుడు  పర్వత సమానమైన  శరీరము  గలిగి,  వేయిఏనుగుల  బలముగలవాడనై,  పరాక్రమ  గర్వముతో  ఈ  భూమిపై  సంచరించుచుంటిని  నల్లని మేఘమువలె  ఒప్పుచు  మేలిమి  బంగారు  కుండలములను  కిరీటమును  ధరించి  పరిఘ  అను  ఆయుధమును  చేతబట్టి, దండకారణ్యమున  ఋషుల  మాంసములను  భక్షించుచు  తిరుగసాగితిని. 
ఆ విశ్వామిత్రమహాముని  శ్రీ  రాముని, పరమప్రీతితో  వెంటనిడుకుని,  తన  ఆశ్రమమునకు  చేరెను. పిమ్మట  ఆ మహర్షి  దండకారణ్యమునందలి  తన ఆశ్రమమున  యజ్ఞ  దీక్షను   గైకొనెను.  అప్పుడు  శ్రీ  రాముడు  తన అద్భుతమైన  ధనస్సును  చేతబట్టి  టంకార మొనర్చుచు   యజ్ఞరక్షణకై  సర్వసంపన్నద్ధుడై  నిలిచెను. 
ఆసమయమున  శ్రీ రాముడు  సర్వశుభలక్షణములు  గలిగి,  కిశోరదశ యందేయుండెను  ఇంకను  యవ్వన   మంకురింపలేదు. తామరరేకులవంటికన్నులు  గల్గియున్న  అతడు  బ్రహ్మచర్యసూచకములైన  ఏక్వాస్త్రమును  శిఖము  ధరించియుండెను.  అతడు  ధనుర్దారియై,    బంగారు  ,ఆభరణములను దాల్చి,  తన  అపూర్వశోభలతో  ఉదయించుచున్న  బాలచంద్రునివలె  ఒప్పుచు  దండకారణ్యమున  ప్రకాశింపజేయుచుండెను.  
నేను మేఘమువలె  నల్లని  శరీరముగలవాడనయి  మేలిమి  బంగారు  కుండలములను  దాల్చి  అదే  సమయమున  ఆ  ఆశ్రమముకడకు   చేరితిని.  నేను  మిగులఁబలశాలియై    యుండుటయేగాక    దేవతలచేతను  చావులేకుండునట్లు  వరములను  పొందియుండుటచే  మిక్కిలి  గర్వితుడనై  ఆయుధమును  చేబూని   యుంటిని  అట్టి నన్ను జూచి  శ్రీ రాముడు  ఏ మాత్రము  చలింపక  ధనస్సును  ఎక్కుపెట్టేను  
శ్రీ రాముని  సౌర్యపరాక్రమములను  నేను  "యితడు  బాలుడే  గదా "అని  తలచి  ఆయనను  సరకుగొనక (లక్ష్య పెట్టక ) త్వరత్వరగా  విశ్వామిత్రుని  యజ్ఞ వేదిక వద్దకు   పరుగు పెట్టితిని. 
ఇంతలో ఆ రఘువరుడు   శత్రుసంహారకమై  ఒక  వాడిబాణమును  నాపై   ప్రయోగించెను .  ఆ  బాణము  యొక్క  దెబ్బకు  నేను  నూరుయోజనములదూరమునున్న  సముద్రములో  పడిపోతిని.  నాయనా! రావాణా!  ఆ వీరుడు  నన్ను  హతమార్చుటకు  సమర్దుడేయైనను  అప్పుడు  చంపదలంపక  ప్రాణములతో  వదిలిపెట్టను. ఆయన బాణము వేగము  నెట్టినీయబడి  స్పృహలేనివాడనై  గంభీరమైన సముద్రమున  పడితిని  చాలాకాలనమునకు  స్పృహ వచ్చినా పిమ్మట  తిన్నగా  లంకకు చేరితిని. 
ఓ  రావణ! ఆయన  కృపవలన  బ్రతికిబయటపడి  ఇప్పుడు  ఇట్లుంటిని  బాలుడై న  శ్రీ రాముడు  పూర్తిగా  అస్త్రవిద్యలను  నీర్వేకున్నాను  ఎట్టి క్లిష్టకార్యములనైనను  అవలీలగా  చేయగలసమర్దుడు  కనుక  నాడు  నా  షహాయకులందఱను  ఆ వీరుని  చేతిలో  నిహతులైరి  అందువలన  నేను  నిన్ను  ఇట్లు  నివారించుచుంటిని  అయినను  ఆయనతో త్వరలోనే తీరుని  ఆపదలపాలగుట  తద్థ్యము . 
ఓ  రాక్షసరాజా! సీతాదేవికొరకై  నీవు  రామునితో  యుద్ధమునకు  సిద్దమైనచో  భోగవిలాసములలో  తెలియాడుచున్నవారను  సామాజికములై  ఉత్సవములలో  నిమగ్నులైన వారను  అగు  రాక్షసులను  సంతమమును  అనర్థములను  తెచ్చిపెట్టినవాడవగుదువు  మరియు  హర్మ్యములతోడును  ప్రసాదములతోడును  బారులుతీరి, వివిధములగు  రత్నములతో అలంకృతమై ,కళకళలాడుచున్న లంకా పట్టణము సర్వ నాశనమై పోవుటను నీవు చూడగలవు . 
ఓ రాజా !పరసతులను ఆశించుట కంటే మించిన పాపము మరియొకటి లేదు . నీ అధీనములో వున్న వేలకొలది యువతులతో సుఖించుట నీకు మేలు . నీ కులము ను ,గౌరవమును ,ఐశ్వర్యము ను ,రాజ్యమును ,నీకు మిగుల ఇష్టమైన నీ ప్రాణములను కాపాడుకొనుము . ఓ రావణా !నీ మేలు కోరి నేని ఇంతగా నివారించుచున్నను సీతాదేవిని బలవంతముగా అపహరించినచో నీ చతురంగ బలములన్నియు క్షీణించును . నీ ఆత్మీయులందరూ నశింతురు . కడకు నీవును శ్రీరాముని బాణములకు ఆహుతిఅయి మృత్యువాతబడుదువు . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











Sunday 11 June 2017

                             రామాయణము 

                     అరణ్యకాండ ,ముప్పది ఏడవసర్గము 

ఆ రాక్షస రాజు పలుకులు విని,మాటనేర్పరియు ,ప్రగ్న్యవంతుడును ఐన మారీచుడు అతనితో ఇట్లు నుడివెను 
           ఓ ప్రభు!  నీకు సరియైన గూఢచారులు  లేరు. నీవు  చపలుడవు.  కనుక మహా వీరుడైన శ్రీ రాముని  గూర్చి  నిజముగా నీవు  ఏ   మాత్రము తెలుసుకొనలేకున్నావు . అతడు  సద్గుణములకు నిధి. బాల పరాక్రమ విషయమున అతడు ఇంద్రవరుణులతో  సమానం    
నాయనా !నీవు సీతను అపహరించుకు వచ్చినచో  ఈ లోకమునందలి రాక్షరాలనందఱను  క్షేమముగా నుందురా ?శ్రీ రాముడు కుపితుడై  ఈ రాక్షస లోకమును  నిర్మూలింపకుండునా?జానకి  నీ ప్రాణాలను హరించుటకై  పుట్టలేదు కదా! సీత దేవి  కారణముగా నాకును  ఆపద వాటిల్లదు గదా! కామప్రవృత్తిగల  నీవంటి నిరంకుశ  ప్రభువును పొందినందునకు  లంక నగరమునకును , అందలి సమస్త రాక్షసులకును , కడకు  నీకును చేటు కలుగకుండునా ?
నీవంటి కామాతురుడు, దుష్టస్వభావముగలవాడు , పాపపుఆలోచనకలవాడు , మతిలేనివాడు ఐన  రాజు  తానూ  నశించుటయేగాక  , తనబంధుమిత్రులకును , దేశప్రజలందరికిని వినాశనమును  తెచ్చిపెట్టినవాడగును. కౌసల్యా సుతుడైన   శ్రీ రాముడు  తండ్రిచే వెడలగొట్టబడలేదు  ,ఏ విధముగాను  ధర్మమార్గమును  తప్పడు.  అతడు లోభి కాడు,ఉదారుడు , సచ్చీలుడు , ఉత్తమక్షత్రియుడు  ధర్మగుణసోభితుడు  ధనుర్దారులలో  శ్రేష్ఠుడు. పర్రక్రమశాలి. క్రౌర్యమును ఎరుగనివాడు  సమస్త ప్రాణులయొక్క హితమునకే  పాటుపడుచుండువాడు  
            నాయనా!సత్యసంధుడైన  దశరధుడు  కైకేయియొక్క  కుతంత్రములలో  చిక్కుకొనుట గమనించి , ఆయన మాటను నిలబెట్టుటకై  శ్రీ రాముడు తానుగా   వనములకు వచ్చెను . కైకేయికి  ప్రియమును గూర్చుటకు , తండ్రివాగ్దానమును  నెరవేర్చుటకును   అతడు  దండకారణ్యమున  ప్రవేశించెను  
రావాణా!శ్రీ రాముడు  కఠినాత్ముడు  కాదు, సకలవిద్యావిశాదుడు. ఇంద్రియనిగ్రహముకలావాడు  , రాముని గార్చి  నీవు వినినదంతయును  పలికినవన్నియును  అసత్యములు .   ఆ సత్పురుషుని గూర్చి  నీవు  ఇట్లు పలుకతగదు . అతడు ధర్మ స్వరూపుడు  నిరూపమాన పరాక్రమశాలి, దేవతలకు  ఇంద్రుని వలె  అతడు సమస్త లోకములకును ప్రభువు .
ఓ రాక్షస ప్రభూ నీవు సీతాపహరణకు పూనుకొనుట వలన కలుగు ఫలమేమి ?రణరంగమున నీవు శ్రీరాముని కంటబడినచో ఆ క్షణమే నీవు మరణించినట్లు తలంపుము . మిగుల దుర్లభమైన ఈ రాజ్యమును ,సుఖమయమైన జీవనమును కలకాలం అనుభవింపదలిచినచో శ్రీరామునితో విరోధము పెట్టుకొనుకుము . ఓ రాక్షసరాజా !విభీషణాదులతో ,మంత్రులతో లోతుగా చర్చించి ఒక నిశ్చయమునకు రమ్ము . దీనివలన నీకు కలిగెడి మేలును ,కీడును గుర్తెరిగి తగినట్లు నడుచుకొనుట మంచిది .
ఓ రాక్షసరాజా  నీకు కోసల  రాజకుమారుడైన   శ్రీ రామునితో  యుద్ధమునకు  తలపడుట  యుక్తము  కాదు  -అని నేనైతే  తలంతును, అంతేగాక  నేను నీకు  మరియొక  విషయమును  నుడివెదను  వినుము  . అది  నీకు మేలైనది తగినది,యుక్తమైనది . 

రామాయణము అరణ్యకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  














 

Saturday 10 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదిఆరవసర్గ

                                             రామాయణము 

                                              అరణ్యకాండ -ముప్పదిఆరవసర్గ 

రావణుడు మారీచునితో "మారీచా !నేను పలికే మాటలు శ్రద్దగా ఆలకింపుడు . నేను ఆపదలో వున్నాను . ఇప్పుడు నువ్వే నాకు దిక్కు . నా సోదరుడైన ఖరుడు ,భుజబలశాలి ఐన దూషణుడు ,నాతోబుట్టువు ఐన శూర్పణఖ ,మాంసభక్షుడు ,మిగుల పరాక్రమమంతుడు ఐన త్రిశరుడు గురి తప్పని యోధులైన రాక్షసవీరులు ,ఇంకను తదితర రాక్షసులు నా ఆదేశానుసారం జనస్థానము నందు స్థిరనివాసము కలిగియున్న విషయము నీవు ఎరుగుదువు కదా ! 
ఆ రాక్షస వీరులందరిని రాముడు ఏ విరోధము లేకుండానే సమరమున పరిమార్చెను . ఆ రాముడు క్రుద్ధుడైన తండ్రిచే వెడలగొట్టబడి భార్యాసహితుడై వనములకు చేరి ,తన బలము చూసుకుని రాక్షస వీరులను హతమార్చుట కాక నా సోదరి అగు శూర్పణఖ ముక్కు చెవులు కోసి అవమానించాడు . అందువలన ఆ శ్రీరాముని భార్యను అపహరించదలిచాను . ఓ మహా వీరుడా !నీవు ,కుంభకర్ణాదులు నా పక్కన నిలువగా యుద్ధరంగమున సమస్త దేవతలను నేను లక్ష్యపెట్టను. ఓ మారీచా!అందువలన నీవు నాకు సహాయకుడై యుండుము. నీవు సర్వసమర్థుడవు,పరాక్రమమునందును ,యుద్ధము చేయుటయందును,సమరోత్సాహమునందును నీవు సాటిలేనివాడవు. పైగా ఉపాయశాలివి, మహావీరుడవు , పలువిధములగు ఉపాయములను  పన్నుట లో ఘటికుడవు అందువలన ఈ కార్యమును సాధించుటకై నేను నీ కడకు వచ్చితిని. 
ఈ సందర్భమున నీవు సహాయపడవలసిన పద్దతిని తెలిపెదను. శ్రద్దగా విను. తెల్లని చుక్కలుగాలి చిత్రమైన ఒక బంగారులేడి రూపమును పొంది,ఆ రాముని ఆశ్రమమున సీతాయెదుట సంచరింపుము . అద్భుతమైన నీ మృగరూపమును జూచి,ఆమె మిగుల మోజు  పడును. వెంటనే "ఈ బంగారలీడిని తెచ్చియుండు"అని ఆమె రామలక్ష్మణులను కోరును . అప్పుడు వారు దూరముగా వీళ్ళిపోగా ఆశ్రమమున ఒంటరిగా ఉన్న సీతను నిరాటంతముగా అవలీలగా చంద్ర కాంతులను రాహువు వాలే హరిచెదను. 
అంతటా  రాముడు భార్యావియోగకారణమున కృంగికృశించి పూవును అప్పుడు నేను తిరుగులేని మనోభాలముతో 
నిస్సంశయముగా అతనిని దెబ్బతీయగలను . 
శ్రీ రామునిపేరును వినినంతనే బుద్ధికుశలుడై మారీచుడు భయముతో వణికిపోయెను. అతని ముఖము వాడిపోయెను పెదవుల తడి ఆరిపోయెను అతడు ఎండిన పెదవులను నాలుకతో తడుపుకొనుచు,రెప్పపాటులేక 
గ్రుడ్లప్పగించి చూచుచు మృతప్రాయుడయ్యెను . అతడు మిగుల ఆర్తుడై రావణుని వైపు చూడ సాగెను. 
              ఆ మారీచుడు ఇంతకుముందే మహాహవనమునందు శ్రీ రాముని పర్రక్రమమును రుచిచూచి యుండెను అందువలన అతనిమనస్సు బయ్యందోళనకు గురియయ్యెను . కనుక అతడు రావణునకు నమస్కరించి అతనికిని,
తనకును మేలు చీకుర్చునట్టి వాస్తవ విషయములను ఇట్లు పలికెను. 

రామాయణము అరణ్యకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Friday 9 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదియైదవసర్గ

                                   రామాయణము

                                 అరణ్యకాండ -ముప్పదియైదవసర్గ 

శూర్పణఖ వచనములు విన్న రావణుడు సభలో వున్నా మంత్రులతో రాముని విషయమై చర్చించెను . పిదప మంత్రులను పంపివేసి సీతాపహరణము లో కల గుణదోషములను తర్కించుకొనెను . తన బలమును ,శ్రీరాముని బలమును పోల్చుకుని కడకు సీతాపహరణకే నిశ్చయించుకొనెను . అనుకున్నదే తడవుగా రధమును సిద్దము చేయించుకుని ఆకాశ మార్గమున అనేక ప్రాంతములను  దాటుతూ అనేక రమణీయ ప్రదేశములు దర్శించుచు తుదకు మారీచుని ఆశ్రమమునకు చేరెను . 
మారీచుడు ఆ రాక్షస రాజుకి ఎదురేగి స్వాగత సత్కారములు చేసి ,అతడితో "ఓ రాక్షస రాజా !లంక యందు అందరూ కుశలమే కదా మఱల ఒంటరిగా వెంటనే ఇచటకు వచ్చుటకు గల కారణము ఏమిటి ?"అని ప్రశ్నించగా వాక్చతురుడైన రావణుడు మారీచునితో ఇట్లనెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పదియైదవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    

                     


Thursday 8 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదినాల్గవసర్గ

                                             రామాయణము 

                                               అరణ్యకాండ -ముప్పదినాల్గవసర్గ 

నిండు సభలో అమాత్యుల నడుమ క్రుద్ధురాలై పరుష వచనములు పలుకుచున్న శూర్పణఖ ను చూచుచు ,క్రోధావేశపరుడైన రావణుడు రాముని విషయమై ఆమెను ఇట్లు ప్రశ్నించెను . " ఎవడారాముడు ?అతడెంతటి వీరుడు ?అతడి రూపురేఖలు ఎట్టివి ?అతడు దండకారణ్యమున ప్రవేశించుటకు కారణమేమి ?ఖరదూషణాదులను చంపిన అతడి ఆయుధములు ఏవి ?ఓ సుందరీ !నీ ముక్కూ చెవులూ కోసి నిన్ను వికృత రూపిణిగా చేసినదెవరు ?నాకు సవివరముగా తెలుపుము "అని పలికెను . 
అప్పుడు శూర్పణఖ "శ్రీరాముడు దశరధుని కుమారుడు . ఆజానుబాహుడు . విశాలమైనకనులు కలవాడు . నారచీరలను ,జింక చర్మమును ధరించియున్నవాడు . మన్మధుని కంటే అందగాడు . మహా పరాక్రమశాలి అయిన శ్రీరాముడు యుద్ధరంగమున అమ్ములపొద నుండి భయంకరములైన బాణములు తీసుకొనుట  కానీ శరములను ప్రయోగించుట కానీ నేను చూడలేదు . అవి అన్నియు రెప్పపాటులో జరిగిపోవుచుండును . శ్రీరాముడు తానొక్కడే రణభూమి యందు నిలిచి తీక్షణములైన బాణములను ప్రయోగించి ,ఖరదూషణాదులతో సహా పదునాలుగువేలమంది రాక్షసులను మూడు ఘడియలలో మట్టికరిపించెను . 
శ్రీరాముడు ఋషులకిచ్చిన వాగ్దానము ప్రకారము దండకారణ్యమును వారికి ఆవాసయోగ్యముగా చేసెను . అతడి తమ్ముడు  లక్ష్మణుడు రూపలావణ్యములలో పరాక్రమములలో అన్నకు ఏమాత్రము తీసిపోనివాడు . అతని చేతిలోనే నేను అవమానాలపాలయ్యాను . 'స్త్రీ ని వధించుట తగదు 'అని భావించి నన్ను విడిచిపెట్టారు . నేను ఎట్టకేలకు చావు తప్పి ఏట్లో తప్పించుకుంటిని . శ్రీరాముడి భార్య సీతాదేవి కూడా ఆయనతో వున్నది . ఆయనకు ఆమెపై కల ప్రేమ అపారం . ఆమె వనదేవత వలె ,మరో లక్ష్మీ దేవి వలె విరాజిల్లుచున్నది . మేలిమి బంగారు వన్నె కలిగినది . అందచందములలో దేవాయక్షగంధర్వ కన్నెల్లేళ్లరు ఆమె ముందు దిగదుడుపే . నేనింతవరకు ఈ భూమండలమున అట్టి సౌందర్యరాశిని చూడలేదు . 
ఆ జానకిని భార్యగా పొందినవాని అదృష్టమే అదృష్టము . ఆమె కౌగిలిసుఖములు అనుభవించినవాని భాగ్యమే భాగ్యము . అట్టి పురుషుడు అన్ని లోకములవారిలోను సర్వశ్రేష్టుడై ఇంద్రుని మించి ఖ్యాతికెక్కును . ఆమె సౌశీల్యవతి చక్కటి సౌందర్యము కలిగినది . ఆమె నీకు భార్య కాతగినది . ఆమెకు భర్తవు కాతగినవాడవు నీవే . ఓ సోదరా !ఆ సౌందర్యరాశిని నీకు భార్యను చేయుటకై ఇక్కడకు తీసుకువచ్చుటకు పూనుకుంటిని . కానీ క్రూరుడైన లక్ష్మణుడు నన్ను ఇట్లు  వికృత రూపమున చేసెను . ఓ రాక్షస రాజా !ఆశ్రమవాసి ,క్రూరుడు అయిన ఆ రాముని వధించి ,ఆ విధముగా ఖరదూషణాదిరాక్షసుల ఆత్మకు శాంతిని కూర్చుము . నీ నిశిత బాణములచే మహారధులైన రామలక్ష్మణులను పరిమార్చుము . అనాథయైన సీతతో నీ ఇష్టానుసారము సుఖియింపుము . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పదినాల్గవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Tuesday 6 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదిమూడవసర్గ

                                      రామాయణము 

                                 అరణ్యకాండ -ముప్పదిమూడవసర్గ 

శూర్పణఖ రూపము చూసి కానీ ,ఏడుపు చూసి కానీ రావణుడు ఏమి చలించక ఉండెను . రావణుడు చలించకపోవుట చూసిన శూర్పణఖ రోషముతో ఈ విధముగా పరుషముగా పలుకనారంభించెను . "ఓ రావణా !అడ్డుచెప్పెడివారులేక నీవు నిరంకుశడవై నిరంతరము కామభోగములలో మునిగి ,కైపెక్కివుంటివి . వినుటకు సైతం మిగుల భయంకరమైన పరిస్థితి నీ రాజ్యము నకు ఏర్పడినది . పరిపాలనా విధులు సక్రమముగా పట్టించుకోనని రాజు యొక్క కార్యము లన్నియు భంగమగును . అంతేకాక అతడు క్రమముగా రాజ్య భ్రష్టుడగును . 
నీ చుట్టూ చేరివున్న సచివులందరూ మూర్ఖులు అందువలన నీవు సమర్థులైన గూఢచారులను నియమింపలేకపోయితివి . కావున దండకారణ్యమున నీ స్వజనులందరు హతులైనను తెలుసుకొనలేక యుంటివి . అక్కడ ఏకైక వీరుడైన రాముని చేతిలో ఖరదూషణాదులతో సహా క్రూరకర్ములైన పదునాలుగువేలమంది రాక్షసయోధులు రణరంగమునకు బలియైరి . శ్రీరాముడు ఋషులకు అభమిచ్చినాడు అతడు జనస్థానమునందలి రాక్షస యోధులను అందరిని పరిమార్చి ,దానిని తన వశమునందు ఉంచుకొనినాడు . ఇప్పుడు తాపసులెల్లరు నిర్భయముగా అచట నివసించుచున్నారు . 
ఓ రావణా !నీవు గూఢచారుల సూచనలను పాటింపనివాడవు . భోగలాలసుడవై మత్తిల్లినవాడవు . నీ రాజ్యమున సంభవించిన ప్రమాదస్థితి తెలుసుకోలేకుంటివి . యుక్తాయుక్త విచక్షణ లేనివాడవు . కనుక త్వరలోనే నీ రాజ్యమునకు ముప్పు ముంచుకొనిరానున్నది . నీవు ఆపదల పాలగుట నిశ్చయము . "అని పలికెను . కొల్లలుగా సంపదలు ,తిరుగులేని సైన్యములు కలిగివుండుటచే ,దురహంకారి  అయిన రాక్షసరాజు శూర్పనఖ పేర్కొనిన తన అవగుణములను గూర్చి ఒక పర్యాయము సమీక్షించుకొనెను . పిమ్మట ఆ రావణుడు 'తొందరపడి రామునితో యుద్ధమునకు తలపడవలదు 'అని మారీచుడు పలికెను ,'శ్రీరాముని వలన నీ రాజ్యమునకు త్వరలో ముప్పు వాటిల్లనున్నది 'అని శూర్పణఖ పలికినది ఇప్పుడు నా కర్తవ్యము ఏమి ?అని దీర్ఘాలోచనలో పడెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పదిమూడవసర్గ సర్గసమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  









 

Monday 5 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదిరెండవసర్గ

                                      రామాయణము 

                                       అరణ్యకాండ -ముప్పదిరెండవసర్గ 

ఖరుడు ,త్రిశరుడు మొదలగు పదునాలుగు వేల రాక్షస వీరుల మరణమును స్వయముగా చూసిన  శూర్పణఖ భయముతో గగ్గోలుపెడుతూ అచట నుండీ రావణుని లంకా నగరమువైపు పరుగిడెను . శూర్పణఖ లంకకు వచ్చు సమయమునకు రావణుడు పుష్పకము అను పేరు కల తన భవనము మంత్రులతో కూడి ఉండెను . మంత్రుల మధ్యలో సింహాసనంపై కూర్చుని వున్న రావణుడు దేవేంద్రుడు వలె వెలిగిపోతున్నాడు . 
అట్టి సభలోకి ప్రవేశించిన శూర్పణఖ లక్ష్మణుని వలన తనకు కలిగిన వికృత రూపమును ప్రదర్శించుచు ,భయముతో వణుకుతున్నదై బిగ్గరగా ఏడుస్తూ ,గగ్గోలు పెడుతూ లంకాధిపతి అయిన రావణునితో ఈ విధముగా పలుకనారంభించెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పదిరెండవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Saturday 3 June 2017

రామాయణము అయోధ్యకాండ -ముప్పదిఒకటవసర్గ

                                          రామాయణము 

                                   అయోధ్యకాండ -ముప్పదిఒకటవసర్గ 

రావణుని గూఢచారులలో ఒకడైన అకంపనుడు జనస్థానము నుండి త్వరత్వరగా లంకకు చేరి రావణునితో ఇట్లనెను . "ఓ మహారాజా !జనస్థానమునందు యుద్ధమున ఖరునితో సహా పెక్కు మంది రాక్షస యోధులు నిహతులయిరి . నేను అతి కష్టము మీద ఇక్కడకు రాగలిగితిని . అకంపనుడు ఇలా పలికిన వెంటనే రావణుడు క్రుద్ధుడై కళ్ళెర్రచేసెను . అతడు తన చూపులతో నిప్పులు కురిపించుచు ఆ గూఢచారితో ఇలా అనెను . 
"మనోహరము నాకు ఎంతో ప్రియమైన నా జనస్థానమును ఎవడు హతమార్చెను ?వానికిక నూకలు చెల్లినట్లే . వాడు ఇంద్రుడైనను ,కుబేరుడైనను ,యముడైనను ,కడకు విష్ణువే అయినను వాడిని విడువను "అని పలుకగా ఆ గూఢచారి అకంపనుడు భయముతో ప్రణమిల్లి వణుకుతూ "దయచూడుము "అని శరణు జొచ్చెను . ఆ రాక్షసేశ్వరుడు అతనికి అభయమిచ్చెను . మనసు కుదుట పడిన పిమ్మట ఆ అకంపనుడు శ్రీరాముని గూర్చి ఇలా పలికెను . 

"దశరథ నందనుడైన శ్రీరాముడు యువకుడు ,చక్కని అంగ సౌష్టవం కలవాడు . సాటిలేని బలపరాక్రమములు కలవాడు . అతను తన తమ్ముడైన లక్ష్మణునితో కలసి జనస్థానము నందు నివాసము ఉంటూ మన రాక్షస వీరులను పరిమార్చినాడు . "అని పలుకగా రావణుడు రోషావేశములతో ఇప్పుడే నేను బయలుదేరి ఆ రామలక్ష్మణులను పరిమార్చెదనంటూ పలుకసాగెను . అప్పుడా అకంపనుడు 
"స్వామీ !ఆ శ్రీరాముడు సమస్త లోకములను నాశనము చేయగల సమర్థుడు . దేవదానవులలో ఆయనను ఎదురించి రణరంగమున నిలవగలిగినవాడెవ్వడు లేడు . ఆయనను ఎవరు జయింపలేరు . కావున అతడిని యుద్ధమున కాక మరియొక మార్గమున వధించుటకు నాకొక ఉపాయము తోచుచున్నది . సీతాదేవి ఆయన భార్య లోకోత్తరసౌందర్యవతి . నిండుజవ్వని . ఆమె అనిన రామునికి ప్రాణము ఆమెను అపహరించి తీసుకువచ్చిన యెడల రాముడే భార్యావియోగము తట్టుకొనలేక మరణించును . "అని పలికెను 
అప్పుడా రావణుడు అట్లే బాగుబాగు అని పలికి రాధాముని ఎక్కి ఆకాశ మార్గమున మారీచుని ఆశ్రమమునకు వెళ్లెను . మారీచుడే స్వయముగా రావణునికి ఎదురెళ్లి ఆహ్వానించి ,అతిధి మర్యాదలు చేసెను . పిదప అతడు "వూరకరారు మహానుభావులు . తమరు వచ్చిన పని ఏమో తెలుపుము . "అని పలికెను . అప్పుడా రావణుడు వచ్చిన పనిని తెలిపి సీతాపహరణకు మారీచుని సహాయపడవలసినదిగా కోరెను . అప్పుడు మారీచుడు "రాక్షసేంద్రా !నీకు ఎవడు ఈ సలహా చెప్పెనో కానీ అతడు నీకు మిత్రుడి రూపమున వున్నా శత్రువు . నీ వినాశనమునకే ఈ ఉపాయము నీకు చెప్పెను . 
శ్రీరాముడు సింహమువంటివాడు . సింహము జోలికి పోవుట  హానికరం . పరద్రోహ చింతలేక ప్రశాంతముగా వున్నా శ్రీరాముని కవ్వించుట తగదు . ఓ లంకాధిపా !నీమేలు కోరి నేను చెప్పేది మాటలు వినుము . లంకకు వెళ్లి నీ భార్యలతో సుఖింపుము . నీ వినాశనమును కొని తెచ్చుకొనుము . "అని పలుకగా ఆ మాటలు విన్న రావణుడు లంకా నగరము చేరి ,తన భవనమున  ప్రవేశించెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పదియొకటవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Friday 2 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదియవసర్గ

                                           రామాయణము 

                                            అరణ్యకాండ -ముప్పదియవసర్గ 

"ఓ ఖరా !నీవు క్రూరుడవు ,నీచుడవు క్షుద్రమైన బుద్ది కలవాడవు ,నిత్యమూ బ్ర్రాహ్మణులను భాదించువాడవు కనుక నీవలన ఎప్పుడు ఏ ఆపద వచ్చిపడునో అని భయముతో మునీశ్వరులు అగ్నికి హవిస్సులు అర్పించుచున్నారు . నేడు వారి ఆశను నేను నిజము చేసెదను . " అని శ్రీరాముడు పలుకగా ఖరుడు మిక్కిలి రోషావేశములకు లోనై రాముడిని భయపెట్టుచు "ఓయీ !నిజముగా నీవు అహంకారివి . భయపడవలసిన సమయములో నిర్భయుడవై ,మంచి చెడులను మఱచి మాట్లాడుచున్నావు . నీకు మృత్యువు ఎదురయినను ఎరుగకున్నావు . "అని పలికి 
ఆ ఖరుడు రాముని దెబ్బతీయుటకై సాధనమునకై చుట్టూ కలయ చూసి సమీపమునే కల ఒక పెద్ద మద్ది చెట్టును చూసి దాని మొదలు పట్టుకుని బిగ్గరగా అరుస్తూ దాన్ని పీకి శ్రీరాముడిపైకి విసిరి ఓయీ రామా !ఇక నీవు చచ్చినట్టే "అని పలికెను . తన పైకి వచ్చుచున్న మద్దిచెట్టును  తన బాణములతోముక్కలు చేసి ,రాముడు క్రుద్ధుడై  ఎర్రబారగా పెక్కు బాణములు ప్రయోగించి ఖరుడిని చీల్చి చెండాడెను . రాముని బాణములకు ఖరుని శరీరము నుండీ రక్తము జలాధారాల వలె ఎడతెరిపి లేకుండా ప్రసవించెను . 
ఆ విధముగా నెత్తురోడుతున్న శరీరముతోనే ఖరుడు రాముని పరిమార్చుటకు రామునిపైకి దూకేను . రాముడు ఖరునిపై అస్త్రములు ప్రయోగించుటకై రెండడుగులు వెనుకకు వేసెను . అప్పుడు రాముడు ఒక దివ్యాస్త్రమును సంధించి విల్లుని ఆకర్ణాంతములాగి వదిలెను . ఆ బాణము పెద్ద శబ్దము చేస్తూ ఖరుడి వక్షస్థలముని చీల్చెను . రాముడి ఆ బాణముచే ఖరుడు మృత్యుముఖమునకు వెళ్లెను . 
పిమ్మట రాజర్షులు ,దేవతలు అచటికి చేరి మిక్కిలి సంతోష ముఖములతో రాముని ఆరాధించిరి . వారు అందరూ "రామా !రాక్షసులను చంపి మాకు మహోపకారం చేసినావు . ఇప్పుడిక మునులు అందరూ ఈ దండకారణ్యమున భయము లేకుండా తమతమ విధులను నెరవేర్చుకొనెదరు "అని పలికిరి . పిమ్మట దేవతలు రామునిపై పుష్పవర్షము కురిపించిరి . పిమ్మట వారందరూ శ్రీరాముని తమ అభినందనలతో ముంచెత్తిరి . పిమ్మట వారందరూ వారివారి స్థానములకు వెళ్లిరి . ఇంతలో లక్ష్మణుడు సీతాదేవితో గుహనుండి వెలుపలికి వచ్చి ఆశ్రమములోకి సీతాదేవిని చేర్చెను . అంత లక్ష్మణుడు రాముని పూజించెను . 
మహావీరుడైన శ్రీరాముడు మూడుగడియలలోనే రాక్షసులందరిని పరిమార్చి మునుల భయము తొలగించి ఊరట కలిగించెను . తన భర్త యొక్క అపూర్వ విజయమునకు అద్భుతమైన శౌర్యపరాక్రమములకు జానకి పరమానందభరితురాలై చెక్కుచెదరని నిబ్బరంతో ఉన్న తన ప్రాణేశ్వరుని పట్టరాని సంతోషముతో కౌగియించుకొనెను . 


రామాయణము అరణ్యకాండ ముప్పదియవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









రామాయణము అరణ్యకాండ -ఇరువదితొమ్మిదవసర్గ

                                     రామాయణము 

                                    అరణ్యకాండ -ఇరువదితొమ్మిదవసర్గ 

రధమును కోల్పోయి ,గధను చేతబూని సమరరంగము నందు నిలుచున్న ఖరుని చూసి ,మహాతేజశ్శాలీ అయిన శ్రీరాముడు యుద్దనియమమును  అనుసరించి ఇలా పలికెను . "ఓ నిశాచరా !(నిశ అనగా రాత్రి ,అనగా రాత్రిపూట తిరుగు వారైన రాక్షసుడు )గజాశ్వరదకాల్బలములతో కూడిన సైన్యమునకు అధిపతివైన నీవు ఘోరకృత్యములకు పాల్పడితివి . ఈ దుష్కర్మను సమస్త లోకములు ఏవగించుకుంటున్నవి . 
సమస్త ప్రాణులకు భయమును కూర్చువాడు ,హింసించువాడు ,పాపకర్మలకు ఒడిగట్టువాడు అగు పురుషుడు ముల్లోకములు కు అధిపతి అయినను మృత్యువు నుండి తప్పించుకొనలేడు . కామము వలన కానీ లోభము వలన కానీ దుష్కృత్యములకు పాల్పడి ,అందులకు పాస్చాత్తాపపడని వారు తన సర్వైశ్వర్యములను కోల్పోవును . ఓ రాక్షసుడా !మానవాళికి కీడు తలపెట్టుచు ,ఘోరమైన పాపకృత్యములకు పాల్పడేడి వారి యొక్క ప్రాణములు తీయుటకే నా తండ్రి దశరథ మహారాజు నన్ను అడవులకు పంపినాడు . 
నేడు నా బాణ దెబ్బలకు నేలకూలాయి,నరకయాతనను అనుభవించెడి నిన్ను పూర్వము నీచే చంపబడిన ,హింసించబడిన మహర్షులు విమానము నందుండి చూసెదరు . ఓ  రాక్షసాధమా !నీ ఇష్టమొచ్చినట్లు యధాశక్తి నాపై బాణములు ప్రయోగింపుము . తాటిపండు వలె అవలీలగా నేడే నీ తలను నేలగూల్చెదను . "అని శ్రీరాముడు పలుకగా ఖరుడు మిగుల క్రుద్ధుడాయెను . అతని కన్నులెర్రబారేను . పిమ్మట అతడు ఆవేశముతో వికృతముగా నవ్వుచు ,రఘువరునికి ఇట్లు సమాధానమిచ్చెను . 
" ఓ దాశరధీ !రణమునందు సాధారణ సైనికులను చంపి ,ఒక వలె నిన్ను నీవు శ్లాఘించుకొంటివి . యథార్థముగా  పరాక్రమమంతులు బలశాలురు అయిన నరశ్రేష్టులు తమ శక్తిసామర్ధ్యముల గూర్చి ఏమాత్రము గర్వింపరు . శత్రువుల రక్తచారికలు కల ఈ గధను ధరించి ,ఈ యుద్దభూమి యందు స్థిరముగా నిలిచియున్న నన్ను నీవు చూచుటలేదా ?నీ ప్రాణములు హరించుటకు గదాపాణి అయిన నేనొక్కడినే చాలు . నీ గూర్చి చెప్పవలసినది చాలా వున్నది . కానీ నేను చెప్పను . ఎందువల్లనంటే సూర్యుడు అస్తమించబోవుచున్నాడు . సూర్యాస్తమయము అయినచో యుద్ధమునకు ఆటంకము కలుగును . నీవు పదునాలుగువేలమంది రాక్షసవీరులను చంపినావు . కనుక నిన్ను చంపి దానికి ప్రతీకారము తీర్చుకొని ,వారి బంధుమిత్రుల కన్నీరు తుడిచెదను . "
అని పలికి ఖరుడు కోపముతో నిప్పులు కక్కుతూ వజ్రాయుధము వంటి గధను రాముడిపైకి విసిరెను . ఖరునిచే ప్రయుక్తమై మంటలు చిమ్ముచూ ,దారిలో కల వృక్షములను పొదలను భస్మముచేస్తూ తనవైపు వస్తున్న ఆ గధను  రాముడు తన బాణములచే తుత్తునియలు గావించెను . 


రామాయణము అరణ్యకాండ ఇరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ).తెలుగు పండితులు . 












Thursday 1 June 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువది ఎనిమిదవసర్గ

                               రామాయణము 

                               అరణ్యకాండ -ఇరువది ఎనిమిదవసర్గ 

అరివీర భయంకరుడైన ఖరుడు తన ఎదుటే శ్రీరాముడు త్రిశరుడు ,దూషణుడు ,ఇంకా తన పదునాలుగువేలమంది వీరులను ఒంటిచేత్తో పరిమార్చిన శ్రీరాముని చూసి ,భయముతో చెమటలు పోయగా ధైర్యము సడలిపోయెను . అయినను ధైర్యము కూర్చుకుని రణరంగము లోకి దిగి శ్రీరాముడిపై బాణములు వేయసాగెను . ఖరుడు తన వాడి బాణములతో శ్రీరాముని గాయ పరిచేను . శ్రీరాముని బాణము చాపము ,విరగగొట్టెను . శ్రీరాముని శరీరము నుండి రక్తము స్రవించసాగెను . 
అంత శ్రీరాముడు క్రుద్ధుడై విష్ణుచాపమును ధరించి ,ఖరుడి ధనుర్భాణములు ,ముక్కలు చేసెను . అతని ధ్వజపతమును ధ్వంసము చేసెను . రధమును ధ్వంసము చేసెను . రాధా సారధిని చంపెను . ఖరుడిని గాయపరిచేను . దేవతలు ,ఋషులు అందరూ అది చూసి రాముని పొగడ సాగిరి . 

రామాయణము అరణ్యకాండ ఇరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .