Tuesday 6 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదిమూడవసర్గ

                                      రామాయణము 

                                 అరణ్యకాండ -ముప్పదిమూడవసర్గ 

శూర్పణఖ రూపము చూసి కానీ ,ఏడుపు చూసి కానీ రావణుడు ఏమి చలించక ఉండెను . రావణుడు చలించకపోవుట చూసిన శూర్పణఖ రోషముతో ఈ విధముగా పరుషముగా పలుకనారంభించెను . "ఓ రావణా !అడ్డుచెప్పెడివారులేక నీవు నిరంకుశడవై నిరంతరము కామభోగములలో మునిగి ,కైపెక్కివుంటివి . వినుటకు సైతం మిగుల భయంకరమైన పరిస్థితి నీ రాజ్యము నకు ఏర్పడినది . పరిపాలనా విధులు సక్రమముగా పట్టించుకోనని రాజు యొక్క కార్యము లన్నియు భంగమగును . అంతేకాక అతడు క్రమముగా రాజ్య భ్రష్టుడగును . 
నీ చుట్టూ చేరివున్న సచివులందరూ మూర్ఖులు అందువలన నీవు సమర్థులైన గూఢచారులను నియమింపలేకపోయితివి . కావున దండకారణ్యమున నీ స్వజనులందరు హతులైనను తెలుసుకొనలేక యుంటివి . అక్కడ ఏకైక వీరుడైన రాముని చేతిలో ఖరదూషణాదులతో సహా క్రూరకర్ములైన పదునాలుగువేలమంది రాక్షసయోధులు రణరంగమునకు బలియైరి . శ్రీరాముడు ఋషులకు అభమిచ్చినాడు అతడు జనస్థానమునందలి రాక్షస యోధులను అందరిని పరిమార్చి ,దానిని తన వశమునందు ఉంచుకొనినాడు . ఇప్పుడు తాపసులెల్లరు నిర్భయముగా అచట నివసించుచున్నారు . 
ఓ రావణా !నీవు గూఢచారుల సూచనలను పాటింపనివాడవు . భోగలాలసుడవై మత్తిల్లినవాడవు . నీ రాజ్యమున సంభవించిన ప్రమాదస్థితి తెలుసుకోలేకుంటివి . యుక్తాయుక్త విచక్షణ లేనివాడవు . కనుక త్వరలోనే నీ రాజ్యమునకు ముప్పు ముంచుకొనిరానున్నది . నీవు ఆపదల పాలగుట నిశ్చయము . "అని పలికెను . కొల్లలుగా సంపదలు ,తిరుగులేని సైన్యములు కలిగివుండుటచే ,దురహంకారి  అయిన రాక్షసరాజు శూర్పనఖ పేర్కొనిన తన అవగుణములను గూర్చి ఒక పర్యాయము సమీక్షించుకొనెను . పిమ్మట ఆ రావణుడు 'తొందరపడి రామునితో యుద్ధమునకు తలపడవలదు 'అని మారీచుడు పలికెను ,'శ్రీరాముని వలన నీ రాజ్యమునకు త్వరలో ముప్పు వాటిల్లనున్నది 'అని శూర్పణఖ పలికినది ఇప్పుడు నా కర్తవ్యము ఏమి ?అని దీర్ఘాలోచనలో పడెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పదిమూడవసర్గ సర్గసమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  









 

No comments:

Post a Comment