Thursday 8 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదినాల్గవసర్గ

                                             రామాయణము 

                                               అరణ్యకాండ -ముప్పదినాల్గవసర్గ 

నిండు సభలో అమాత్యుల నడుమ క్రుద్ధురాలై పరుష వచనములు పలుకుచున్న శూర్పణఖ ను చూచుచు ,క్రోధావేశపరుడైన రావణుడు రాముని విషయమై ఆమెను ఇట్లు ప్రశ్నించెను . " ఎవడారాముడు ?అతడెంతటి వీరుడు ?అతడి రూపురేఖలు ఎట్టివి ?అతడు దండకారణ్యమున ప్రవేశించుటకు కారణమేమి ?ఖరదూషణాదులను చంపిన అతడి ఆయుధములు ఏవి ?ఓ సుందరీ !నీ ముక్కూ చెవులూ కోసి నిన్ను వికృత రూపిణిగా చేసినదెవరు ?నాకు సవివరముగా తెలుపుము "అని పలికెను . 
అప్పుడు శూర్పణఖ "శ్రీరాముడు దశరధుని కుమారుడు . ఆజానుబాహుడు . విశాలమైనకనులు కలవాడు . నారచీరలను ,జింక చర్మమును ధరించియున్నవాడు . మన్మధుని కంటే అందగాడు . మహా పరాక్రమశాలి అయిన శ్రీరాముడు యుద్ధరంగమున అమ్ములపొద నుండి భయంకరములైన బాణములు తీసుకొనుట  కానీ శరములను ప్రయోగించుట కానీ నేను చూడలేదు . అవి అన్నియు రెప్పపాటులో జరిగిపోవుచుండును . శ్రీరాముడు తానొక్కడే రణభూమి యందు నిలిచి తీక్షణములైన బాణములను ప్రయోగించి ,ఖరదూషణాదులతో సహా పదునాలుగువేలమంది రాక్షసులను మూడు ఘడియలలో మట్టికరిపించెను . 
శ్రీరాముడు ఋషులకిచ్చిన వాగ్దానము ప్రకారము దండకారణ్యమును వారికి ఆవాసయోగ్యముగా చేసెను . అతడి తమ్ముడు  లక్ష్మణుడు రూపలావణ్యములలో పరాక్రమములలో అన్నకు ఏమాత్రము తీసిపోనివాడు . అతని చేతిలోనే నేను అవమానాలపాలయ్యాను . 'స్త్రీ ని వధించుట తగదు 'అని భావించి నన్ను విడిచిపెట్టారు . నేను ఎట్టకేలకు చావు తప్పి ఏట్లో తప్పించుకుంటిని . శ్రీరాముడి భార్య సీతాదేవి కూడా ఆయనతో వున్నది . ఆయనకు ఆమెపై కల ప్రేమ అపారం . ఆమె వనదేవత వలె ,మరో లక్ష్మీ దేవి వలె విరాజిల్లుచున్నది . మేలిమి బంగారు వన్నె కలిగినది . అందచందములలో దేవాయక్షగంధర్వ కన్నెల్లేళ్లరు ఆమె ముందు దిగదుడుపే . నేనింతవరకు ఈ భూమండలమున అట్టి సౌందర్యరాశిని చూడలేదు . 
ఆ జానకిని భార్యగా పొందినవాని అదృష్టమే అదృష్టము . ఆమె కౌగిలిసుఖములు అనుభవించినవాని భాగ్యమే భాగ్యము . అట్టి పురుషుడు అన్ని లోకములవారిలోను సర్వశ్రేష్టుడై ఇంద్రుని మించి ఖ్యాతికెక్కును . ఆమె సౌశీల్యవతి చక్కటి సౌందర్యము కలిగినది . ఆమె నీకు భార్య కాతగినది . ఆమెకు భర్తవు కాతగినవాడవు నీవే . ఓ సోదరా !ఆ సౌందర్యరాశిని నీకు భార్యను చేయుటకై ఇక్కడకు తీసుకువచ్చుటకు పూనుకుంటిని . కానీ క్రూరుడైన లక్ష్మణుడు నన్ను ఇట్లు  వికృత రూపమున చేసెను . ఓ రాక్షస రాజా !ఆశ్రమవాసి ,క్రూరుడు అయిన ఆ రాముని వధించి ,ఆ విధముగా ఖరదూషణాదిరాక్షసుల ఆత్మకు శాంతిని కూర్చుము . నీ నిశిత బాణములచే మహారధులైన రామలక్ష్మణులను పరిమార్చుము . అనాథయైన సీతతో నీ ఇష్టానుసారము సుఖియింపుము . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పదినాల్గవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment