Friday 2 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదియవసర్గ

                                           రామాయణము 

                                            అరణ్యకాండ -ముప్పదియవసర్గ 

"ఓ ఖరా !నీవు క్రూరుడవు ,నీచుడవు క్షుద్రమైన బుద్ది కలవాడవు ,నిత్యమూ బ్ర్రాహ్మణులను భాదించువాడవు కనుక నీవలన ఎప్పుడు ఏ ఆపద వచ్చిపడునో అని భయముతో మునీశ్వరులు అగ్నికి హవిస్సులు అర్పించుచున్నారు . నేడు వారి ఆశను నేను నిజము చేసెదను . " అని శ్రీరాముడు పలుకగా ఖరుడు మిక్కిలి రోషావేశములకు లోనై రాముడిని భయపెట్టుచు "ఓయీ !నిజముగా నీవు అహంకారివి . భయపడవలసిన సమయములో నిర్భయుడవై ,మంచి చెడులను మఱచి మాట్లాడుచున్నావు . నీకు మృత్యువు ఎదురయినను ఎరుగకున్నావు . "అని పలికి 
ఆ ఖరుడు రాముని దెబ్బతీయుటకై సాధనమునకై చుట్టూ కలయ చూసి సమీపమునే కల ఒక పెద్ద మద్ది చెట్టును చూసి దాని మొదలు పట్టుకుని బిగ్గరగా అరుస్తూ దాన్ని పీకి శ్రీరాముడిపైకి విసిరి ఓయీ రామా !ఇక నీవు చచ్చినట్టే "అని పలికెను . తన పైకి వచ్చుచున్న మద్దిచెట్టును  తన బాణములతోముక్కలు చేసి ,రాముడు క్రుద్ధుడై  ఎర్రబారగా పెక్కు బాణములు ప్రయోగించి ఖరుడిని చీల్చి చెండాడెను . రాముని బాణములకు ఖరుని శరీరము నుండీ రక్తము జలాధారాల వలె ఎడతెరిపి లేకుండా ప్రసవించెను . 
ఆ విధముగా నెత్తురోడుతున్న శరీరముతోనే ఖరుడు రాముని పరిమార్చుటకు రామునిపైకి దూకేను . రాముడు ఖరునిపై అస్త్రములు ప్రయోగించుటకై రెండడుగులు వెనుకకు వేసెను . అప్పుడు రాముడు ఒక దివ్యాస్త్రమును సంధించి విల్లుని ఆకర్ణాంతములాగి వదిలెను . ఆ బాణము పెద్ద శబ్దము చేస్తూ ఖరుడి వక్షస్థలముని చీల్చెను . రాముడి ఆ బాణముచే ఖరుడు మృత్యుముఖమునకు వెళ్లెను . 
పిమ్మట రాజర్షులు ,దేవతలు అచటికి చేరి మిక్కిలి సంతోష ముఖములతో రాముని ఆరాధించిరి . వారు అందరూ "రామా !రాక్షసులను చంపి మాకు మహోపకారం చేసినావు . ఇప్పుడిక మునులు అందరూ ఈ దండకారణ్యమున భయము లేకుండా తమతమ విధులను నెరవేర్చుకొనెదరు "అని పలికిరి . పిమ్మట దేవతలు రామునిపై పుష్పవర్షము కురిపించిరి . పిమ్మట వారందరూ శ్రీరాముని తమ అభినందనలతో ముంచెత్తిరి . పిమ్మట వారందరూ వారివారి స్థానములకు వెళ్లిరి . ఇంతలో లక్ష్మణుడు సీతాదేవితో గుహనుండి వెలుపలికి వచ్చి ఆశ్రమములోకి సీతాదేవిని చేర్చెను . అంత లక్ష్మణుడు రాముని పూజించెను . 
మహావీరుడైన శ్రీరాముడు మూడుగడియలలోనే రాక్షసులందరిని పరిమార్చి మునుల భయము తొలగించి ఊరట కలిగించెను . తన భర్త యొక్క అపూర్వ విజయమునకు అద్భుతమైన శౌర్యపరాక్రమములకు జానకి పరమానందభరితురాలై చెక్కుచెదరని నిబ్బరంతో ఉన్న తన ప్రాణేశ్వరుని పట్టరాని సంతోషముతో కౌగియించుకొనెను . 


రామాయణము అరణ్యకాండ ముప్పదియవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment