Sunday 11 June 2017

                             రామాయణము 

                     అరణ్యకాండ ,ముప్పది ఏడవసర్గము 

ఆ రాక్షస రాజు పలుకులు విని,మాటనేర్పరియు ,ప్రగ్న్యవంతుడును ఐన మారీచుడు అతనితో ఇట్లు నుడివెను 
           ఓ ప్రభు!  నీకు సరియైన గూఢచారులు  లేరు. నీవు  చపలుడవు.  కనుక మహా వీరుడైన శ్రీ రాముని  గూర్చి  నిజముగా నీవు  ఏ   మాత్రము తెలుసుకొనలేకున్నావు . అతడు  సద్గుణములకు నిధి. బాల పరాక్రమ విషయమున అతడు ఇంద్రవరుణులతో  సమానం    
నాయనా !నీవు సీతను అపహరించుకు వచ్చినచో  ఈ లోకమునందలి రాక్షరాలనందఱను  క్షేమముగా నుందురా ?శ్రీ రాముడు కుపితుడై  ఈ రాక్షస లోకమును  నిర్మూలింపకుండునా?జానకి  నీ ప్రాణాలను హరించుటకై  పుట్టలేదు కదా! సీత దేవి  కారణముగా నాకును  ఆపద వాటిల్లదు గదా! కామప్రవృత్తిగల  నీవంటి నిరంకుశ  ప్రభువును పొందినందునకు  లంక నగరమునకును , అందలి సమస్త రాక్షసులకును , కడకు  నీకును చేటు కలుగకుండునా ?
నీవంటి కామాతురుడు, దుష్టస్వభావముగలవాడు , పాపపుఆలోచనకలవాడు , మతిలేనివాడు ఐన  రాజు  తానూ  నశించుటయేగాక  , తనబంధుమిత్రులకును , దేశప్రజలందరికిని వినాశనమును  తెచ్చిపెట్టినవాడగును. కౌసల్యా సుతుడైన   శ్రీ రాముడు  తండ్రిచే వెడలగొట్టబడలేదు  ,ఏ విధముగాను  ధర్మమార్గమును  తప్పడు.  అతడు లోభి కాడు,ఉదారుడు , సచ్చీలుడు , ఉత్తమక్షత్రియుడు  ధర్మగుణసోభితుడు  ధనుర్దారులలో  శ్రేష్ఠుడు. పర్రక్రమశాలి. క్రౌర్యమును ఎరుగనివాడు  సమస్త ప్రాణులయొక్క హితమునకే  పాటుపడుచుండువాడు  
            నాయనా!సత్యసంధుడైన  దశరధుడు  కైకేయియొక్క  కుతంత్రములలో  చిక్కుకొనుట గమనించి , ఆయన మాటను నిలబెట్టుటకై  శ్రీ రాముడు తానుగా   వనములకు వచ్చెను . కైకేయికి  ప్రియమును గూర్చుటకు , తండ్రివాగ్దానమును  నెరవేర్చుటకును   అతడు  దండకారణ్యమున  ప్రవేశించెను  
రావాణా!శ్రీ రాముడు  కఠినాత్ముడు  కాదు, సకలవిద్యావిశాదుడు. ఇంద్రియనిగ్రహముకలావాడు  , రాముని గార్చి  నీవు వినినదంతయును  పలికినవన్నియును  అసత్యములు .   ఆ సత్పురుషుని గూర్చి  నీవు  ఇట్లు పలుకతగదు . అతడు ధర్మ స్వరూపుడు  నిరూపమాన పరాక్రమశాలి, దేవతలకు  ఇంద్రుని వలె  అతడు సమస్త లోకములకును ప్రభువు .
ఓ రాక్షస ప్రభూ నీవు సీతాపహరణకు పూనుకొనుట వలన కలుగు ఫలమేమి ?రణరంగమున నీవు శ్రీరాముని కంటబడినచో ఆ క్షణమే నీవు మరణించినట్లు తలంపుము . మిగుల దుర్లభమైన ఈ రాజ్యమును ,సుఖమయమైన జీవనమును కలకాలం అనుభవింపదలిచినచో శ్రీరామునితో విరోధము పెట్టుకొనుకుము . ఓ రాక్షసరాజా !విభీషణాదులతో ,మంత్రులతో లోతుగా చర్చించి ఒక నిశ్చయమునకు రమ్ము . దీనివలన నీకు కలిగెడి మేలును ,కీడును గుర్తెరిగి తగినట్లు నడుచుకొనుట మంచిది .
ఓ రాక్షసరాజా  నీకు కోసల  రాజకుమారుడైన   శ్రీ రామునితో  యుద్ధమునకు  తలపడుట  యుక్తము  కాదు  -అని నేనైతే  తలంతును, అంతేగాక  నేను నీకు  మరియొక  విషయమును  నుడివెదను  వినుము  . అది  నీకు మేలైనది తగినది,యుక్తమైనది . 

రామాయణము అరణ్యకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  














 

No comments:

Post a Comment