Saturday 24 June 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదిరెండవసర్గ

                                                రామాయణము 

                                                 అరణ్యకాండ -నలుబదిరెండవసర్గ 

మారీచుడు ఆ విధముగా పరుష వాక్యములు పలికినప్పటికీ రావణుడిపై కల భయముతో "సరే వెళ్ళెదము "అని పలికి శ్రీరామాశ్రమమునకు వెళ్ళుటకు అంగీకరించెను . అప్పుడు రావణుడు సంతోషముతో మారీచుని కౌగలించుకుని ,తన రథముపై ఎక్కించుకుని శ్రీరామాశ్రము దగ్గరలోకి తీసుకెళ్లి ,బంగారు లేడీగా మారి రాముని దూరముగా తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించెను . మారీచుడు రావణుని ఆజ్ఞ ప్రకారము బంగారు వర్ణము వెండి మచ్చలు కల సుందరమైన లేడీగా మారి ఆ రామాశ్రమ పరిసర ప్రాంతములలో తిరుగాడసాగెను . 
కొంతసేపు పచ్చికను మేస్తూ ,ఇంకొంతసేపు ఎగురుతూ ,పరిగెడుతూ ,కొంతసేపు విశ్రమిస్తూ సీతాదేవి కంట పడవలెనని అది ఆ చుట్టుపక్కలననే తిరగాడా సాగెను . మిగిలిన జింకలు ,జంతువులూ వాటికి కల పరిజ్ఞానంతో అది మామూలు మృగము కాదని గ్రహించి దూరముగా పారిపోయెను . జాతి లక్షణము న ఆ రాక్షసులు జంతువులను భుజించువాడే అయినను ఇప్పుడు వాటిని స్పృశించి ఊరకుండెను కానీ భుజించుటలేదు . 
అలా రెండు ఘడియల కాలము గడిచిన పిమ్మట రామపత్ని అగు సీతాదేవి పూజకు పూలు కోయుటకై ఆశ్రమము వెలుపలికి వచ్చెను . ఆమె వృక్షములు ,మొక్కలు చుట్టూ పూలు కోయుటకై తిరుగాడసాగెను ఆమె పరమ సాధ్వి . పెక్కు కాలము(13 సంవత్సరములు ) వనవాసము చేసిన పతివ్రతాశిరోమణి . ఆమె రమ్యమైన ఆ మృగమును చూచెను . జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి వివిధములగు రత్నశోభతో విలసిల్లుచున్న అట్టి లేడిని ఇదివరలో చూచి ఎరుగదు . అందువలన ఆమె మిక్కిలి ఆశ్చర్యముతో కళ్ళు పెద్దవి చేసి దానిని చూసేను . 

రామాయణము అరణ్యకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం .  ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  





    

No comments:

Post a Comment