Sunday 18 June 2017

రామాయణము అరణ్యకాండ -ముప్పదితొమ్మిదవసర్గ

                                              రామాయణము 

                                            అరణ్యకాండ -ముప్పదితొమ్మిదవసర్గ 

ఓ  రావాణా! నాటియుద్దమున  శ్రీ రాముని  అనుగ్రహముచే  ఎట్టకేలకు  సురక్షితుడనై   ప్రాణములతో  బయటపడి  ఇట్లుంటిని.  ఇప్పుడుగూడ  జరిగిన మరియొక వృతాంతమున  గూర్చి తెలిపెదను  సావదానముగావినుము. 
శ్రీరాముని వలన  ఆ  విధముగా  ప్రాణాపాయస్థితికి  లోనైనను  నేను  ఆయనయెడ  విరోధభావమును  మాత్రమును  వీడలేదు.  ఒక  నాడు  మృగ  రూపమును  దాల్చిన   ఇద్దరు  రాక్షసులతో  గూడి  నేను దండకారుణ్యమున  ప్రవేశించితిని  నేను మాంసమును  భక్షించేడి   ఒక  మహాక్రూర  మృగరూపమును  ధరించి  ఆ  ఆవిడయందు  తిరుగాసాగితిని  అప్పుడు నిప్పులు  గ్రక్కుచున్న  నాలుకతో  దృఢమైన     శరీరముతో  వాడియైన  కోఱలతో మహా బలశాలినై ఉంటిని . 
ఆ విధముగా మిగుల భయంకరరూపమున నేను అగ్నిశాలలయందును ,పవిత్ర జలాశయాల తీరమునందు తపమొనరించెడి మునీశ్వరులను హింసించుచు సంచరించుచుండిని . దండకారణ్యమున ధర్మకార్యనిరతులై న తాపసులను చంపి ,వారి రక్తమాంసములు భక్షించుటయే నాపనిగా ఉండెను . నేను అట్లు తిరుగుచు ,ధర్మాత్ముడై,మునివేషములోవున్న శ్రీరాముని ,సీతాదేవిని ,లక్ష్మణుని సమీపించితిని . శ్రీరాముడు మహాబలశాలి అయినను "యితడు తాపస వృత్తిలో వున్నాడు కదా !ఎవ్వరిని హింసించడు కదా !"అని భావించి ఆయనపై నాకు కల కోపముతో బుద్ధిహీనుడనై శ్రీరాముని చంపదలచి ఆయన మీదకు దూకితిని . 
అప్పుడు శ్రీరాముడు ధనుస్సుని ఆకర్ణాంతము లాగి ,శత్రుసంహారకములైన మూడు బాణములను మాపై ప్రయోగించెను . ఆ బాణములు మా ముగ్గురిని వెంటాడినవి . ఆయన బాణముపు దెబ్బ రుచి నాకు ముందే తెలియుట చే నేను ఎలాగోలా తప్పించుకుంటిని . కానీ నా మిత్రులు ఇద్దరు ఆ బాణపు దెబ్బలకు మరణించితిరి . పిమ్మట పశ్చాత్త్తాపపడి ,దుశ్చరితలు మాని ,తపోనిష్ఠలో నిమగ్నమయితిని . ఆ రోజు నుండి నాకు ఎటు చూసినా శ్రీరాముడే కనపడుచున్నాడు . ఏ చిన్న చప్పుడు విన్నను నేను భయముతో వణికిపోవుచున్నాను . నేను నీ మంచి కోసమే ఇదంతా చెప్పుచున్నాను "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పది తొమ్మిదవసర్గ సమాప్తము . 

                                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












No comments:

Post a Comment