Wednesday 28 June 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదియైదవసర్గ

                                          రామాయణము 

                                         అరణ్యకాండ -నలుబదియైదవసర్గ 

సీతాదేవి వనము నుండి వినబడిన ఆర్తస్వరమును తన భర్తదేయని తలంచి 'ఆ రఘువరుని ఆదుకొనుటకై వెంటనే వెళ్లుము 'అని లక్ష్మణునితో పలికెను . "లక్ష్మణా !మీ అన్నగారి ఆర్తనాదము విన్నప్పటి నుండి నా మనసు నిలకడ లేదు . ఆయనకు ఏ ఆపద వాటిల్లినదో అని నాకు మిక్కిలి భయముగా వున్నది . రాక్షసుల మధ్య చిక్కుకుని బాధపడుతున్నారేమో అని నాకు సందేహము కలుగుచున్నది . నీవు శీఘ్రముగా వెళ్లి ఆయనకు తోడ్పడు "అని పలికెను . 
ఆ మాటలు విన్నను లక్ష్మణుడు 'సీతను రక్షించుచు నీవు ఇచటనే వుండు 'అన్న తన అన్న మాటలు జ్ఞప్తికి వచ్చుటచే కదలక అక్కడే ఉండెను . అది చూసిన సీతాదేవి మిక్కిలి క్రుద్ధురాలై "లక్ష్మణా !నీ సోదరునియెడ పైకి ప్రేమ నటించుచుంటివే కానీ ,నిజముగా నీవు ఆయనపాలిటి శత్రువువు . ఏలననగా ఇట్టి ఆపద సమయము నందు నీవు ఆయనకడకు  చేరుటలేదు . నీవు నా మీద కోరికతో రాముని హానిని అభిలషించుచుంటివి . కావుననే శ్రీరాముడు సంకట స్థితిలో ఉండగా ఆ విషయము పక్కన పెట్టి ,ఇక్కడ నన్ను రక్షించు నెపముతో ఉండుటలో అంతరార్ధము ఏమున్నది ?
భర్త ఆపద పాలైనట్లు భావించుచున్న సీతయొక్క మానసికస్థితి భయకంపితమైన లేడిస్టితి వలె ఉండెను . ఆమె శోకమగ్నయై కన్నీరుమున్నీరుగా ఏడ్చుచు ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు ఆమెతో ఈ విధముగా వచించెను . "ఓ వైదేహి !ముల్లోకములవారు ,తిరుగులేని బలములతో ఇంద్రాది దేవతలతో కూడి వచ్చినను ,శ్రీరాముని ఎదుర్కొనలేరు . ఆయనకు ఎట్టి కీడు సంభవించదు . నీ భర్త ఆ మృగమును చంపి శీఘ్రముగనే తిరిగి వచ్చును . నన్ను నమ్ము నిన్ను వంటరిగా వదిలి నేను వెళ్ళలేను . ఇదంతా రాక్షస మాయ అని నా అనుమానము "అని పలుకగా 
ఆ మాటలు విని భర్త ప్రేమ అధికముగా కల ఆ సీతా దేవి మిక్కిలి క్రుద్ధురాలై "దుష్టుడా !పాపాత్ముడా !వంశమునకు చెడ్డపేరు తెచ్చువాఁడా !శ్రీరాముడు వంటరిగా వనములకు వచ్చుట చూసి నీవు నన్ను పొందవలెననెడి క్రూర బుద్దితో ఆయన వెంట వచ్చితివి లేదా మాకు హాని తలపెట్టుటకై ఆ భరతుడి నిన్ను పంపివుండవచ్చు . ఓ సౌమిత్రీ !ఎట్టి పరిస్థితిలో నీ కోరిక కానీ భరతుడి పన్నాగము కానీ నెరవేరదు . నా భర్త లేకుండా ఈ భూతలం మీద ఒక్కక్షణము కూడా బతికి ఉండలేను . నీ కళ్లెదుటే నా ప్రాణములు తీసుకొనెదను . "అని మిక్కిలి పరుష వాక్యములు పలుకగా లక్ష్మణుడు 
"అమ్మా !నీవు నాకు పరమపూజ్యురాలైన దేవతవు . నా సహజస్వభావము బట్టీ నేను అన్నగారి ఆజ్ఞను పాలించుటయందే నిరతుడనై ఉంటిని . అట్టి నన్ను సాధారణ స్త్రీ వలె ఇట్లు శంకించుచున్నావు . అమ్మా !నీవు పొరబడుచున్నావు . దీనివలన ఏమి కీడు రానున్నదో ,తల్లీ నాకు అపశకునములు గోచరించుచున్నవి . మల్లి తిరిగి  నిన్ను మా అన్న గారితో కలిసియుండగా చూసేది భాగ్యము నాకు కలుగునో లేదో   అని నాకు సందేహము కలుగుచున్నది . "అని పలుకగా 
లక్ష్మణుడు శ్రీరాముడి వద్దకు వెళ్ళుటకు జాప్యము చేస్తున్నాడని భావించిన సీతాదేవి మిక్కిలి ఆవేశముతో "లక్ష్మణా !శ్రీరాముడికి దూరమై నేను ఒక్క క్షణమైనను బతకజాలను అందులకై గోదావరిలో దూకెదను ,ఉరివేసుకొందును ,లేదా పర్వత శిఖరము నుండి క్రిందపడెదను . తీవ్రమైన విషము త్రాగెదను ,అగ్నిలో ప్రవేశింతును ,ఎట్టి పరిస్థితిలో పరపురుషుడిని తాకను "అని పలికి . అనంతరము ఆమె గుండెలు బాదుకొనుచు ఏడవసాగెను . సీతాదేవి మొండివైఖరి ఆమె పలికిన తీవ్ర వచనములను సమాధానమౌ చెప్పలేక చేసేది లేక ఆమెకు నమస్కరించి మనస్సులో ఈమెను ఒంటరిగా విడిచి వెళ్ళుట వలన ఇదే ఆపద వచ్చునేమో అని భయపడుతూ ఎట్టకేలకు మనసు దిటవు చేసుకునిలక్ష్మణుడు  శ్రీరాముడు వెళ్లిన వైపుగా బయలుదేరెను . 

రామాయణము అరణ్యకాండ నలుబదియైదవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  









 

No comments:

Post a Comment