Saturday 3 June 2017

రామాయణము అయోధ్యకాండ -ముప్పదిఒకటవసర్గ

                                          రామాయణము 

                                   అయోధ్యకాండ -ముప్పదిఒకటవసర్గ 

రావణుని గూఢచారులలో ఒకడైన అకంపనుడు జనస్థానము నుండి త్వరత్వరగా లంకకు చేరి రావణునితో ఇట్లనెను . "ఓ మహారాజా !జనస్థానమునందు యుద్ధమున ఖరునితో సహా పెక్కు మంది రాక్షస యోధులు నిహతులయిరి . నేను అతి కష్టము మీద ఇక్కడకు రాగలిగితిని . అకంపనుడు ఇలా పలికిన వెంటనే రావణుడు క్రుద్ధుడై కళ్ళెర్రచేసెను . అతడు తన చూపులతో నిప్పులు కురిపించుచు ఆ గూఢచారితో ఇలా అనెను . 
"మనోహరము నాకు ఎంతో ప్రియమైన నా జనస్థానమును ఎవడు హతమార్చెను ?వానికిక నూకలు చెల్లినట్లే . వాడు ఇంద్రుడైనను ,కుబేరుడైనను ,యముడైనను ,కడకు విష్ణువే అయినను వాడిని విడువను "అని పలుకగా ఆ గూఢచారి అకంపనుడు భయముతో ప్రణమిల్లి వణుకుతూ "దయచూడుము "అని శరణు జొచ్చెను . ఆ రాక్షసేశ్వరుడు అతనికి అభయమిచ్చెను . మనసు కుదుట పడిన పిమ్మట ఆ అకంపనుడు శ్రీరాముని గూర్చి ఇలా పలికెను . 

"దశరథ నందనుడైన శ్రీరాముడు యువకుడు ,చక్కని అంగ సౌష్టవం కలవాడు . సాటిలేని బలపరాక్రమములు కలవాడు . అతను తన తమ్ముడైన లక్ష్మణునితో కలసి జనస్థానము నందు నివాసము ఉంటూ మన రాక్షస వీరులను పరిమార్చినాడు . "అని పలుకగా రావణుడు రోషావేశములతో ఇప్పుడే నేను బయలుదేరి ఆ రామలక్ష్మణులను పరిమార్చెదనంటూ పలుకసాగెను . అప్పుడా అకంపనుడు 
"స్వామీ !ఆ శ్రీరాముడు సమస్త లోకములను నాశనము చేయగల సమర్థుడు . దేవదానవులలో ఆయనను ఎదురించి రణరంగమున నిలవగలిగినవాడెవ్వడు లేడు . ఆయనను ఎవరు జయింపలేరు . కావున అతడిని యుద్ధమున కాక మరియొక మార్గమున వధించుటకు నాకొక ఉపాయము తోచుచున్నది . సీతాదేవి ఆయన భార్య లోకోత్తరసౌందర్యవతి . నిండుజవ్వని . ఆమె అనిన రామునికి ప్రాణము ఆమెను అపహరించి తీసుకువచ్చిన యెడల రాముడే భార్యావియోగము తట్టుకొనలేక మరణించును . "అని పలికెను 
అప్పుడా రావణుడు అట్లే బాగుబాగు అని పలికి రాధాముని ఎక్కి ఆకాశ మార్గమున మారీచుని ఆశ్రమమునకు వెళ్లెను . మారీచుడే స్వయముగా రావణునికి ఎదురెళ్లి ఆహ్వానించి ,అతిధి మర్యాదలు చేసెను . పిదప అతడు "వూరకరారు మహానుభావులు . తమరు వచ్చిన పని ఏమో తెలుపుము . "అని పలికెను . అప్పుడా రావణుడు వచ్చిన పనిని తెలిపి సీతాపహరణకు మారీచుని సహాయపడవలసినదిగా కోరెను . అప్పుడు మారీచుడు "రాక్షసేంద్రా !నీకు ఎవడు ఈ సలహా చెప్పెనో కానీ అతడు నీకు మిత్రుడి రూపమున వున్నా శత్రువు . నీ వినాశనమునకే ఈ ఉపాయము నీకు చెప్పెను . 
శ్రీరాముడు సింహమువంటివాడు . సింహము జోలికి పోవుట  హానికరం . పరద్రోహ చింతలేక ప్రశాంతముగా వున్నా శ్రీరాముని కవ్వించుట తగదు . ఓ లంకాధిపా !నీమేలు కోరి నేను చెప్పేది మాటలు వినుము . లంకకు వెళ్లి నీ భార్యలతో సుఖింపుము . నీ వినాశనమును కొని తెచ్చుకొనుము . "అని పలుకగా ఆ మాటలు విన్న రావణుడు లంకా నగరము చేరి ,తన భవనమున  ప్రవేశించెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పదియొకటవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment