Friday 2 June 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువదితొమ్మిదవసర్గ

                                     రామాయణము 

                                    అరణ్యకాండ -ఇరువదితొమ్మిదవసర్గ 

రధమును కోల్పోయి ,గధను చేతబూని సమరరంగము నందు నిలుచున్న ఖరుని చూసి ,మహాతేజశ్శాలీ అయిన శ్రీరాముడు యుద్దనియమమును  అనుసరించి ఇలా పలికెను . "ఓ నిశాచరా !(నిశ అనగా రాత్రి ,అనగా రాత్రిపూట తిరుగు వారైన రాక్షసుడు )గజాశ్వరదకాల్బలములతో కూడిన సైన్యమునకు అధిపతివైన నీవు ఘోరకృత్యములకు పాల్పడితివి . ఈ దుష్కర్మను సమస్త లోకములు ఏవగించుకుంటున్నవి . 
సమస్త ప్రాణులకు భయమును కూర్చువాడు ,హింసించువాడు ,పాపకర్మలకు ఒడిగట్టువాడు అగు పురుషుడు ముల్లోకములు కు అధిపతి అయినను మృత్యువు నుండి తప్పించుకొనలేడు . కామము వలన కానీ లోభము వలన కానీ దుష్కృత్యములకు పాల్పడి ,అందులకు పాస్చాత్తాపపడని వారు తన సర్వైశ్వర్యములను కోల్పోవును . ఓ రాక్షసుడా !మానవాళికి కీడు తలపెట్టుచు ,ఘోరమైన పాపకృత్యములకు పాల్పడేడి వారి యొక్క ప్రాణములు తీయుటకే నా తండ్రి దశరథ మహారాజు నన్ను అడవులకు పంపినాడు . 
నేడు నా బాణ దెబ్బలకు నేలకూలాయి,నరకయాతనను అనుభవించెడి నిన్ను పూర్వము నీచే చంపబడిన ,హింసించబడిన మహర్షులు విమానము నందుండి చూసెదరు . ఓ  రాక్షసాధమా !నీ ఇష్టమొచ్చినట్లు యధాశక్తి నాపై బాణములు ప్రయోగింపుము . తాటిపండు వలె అవలీలగా నేడే నీ తలను నేలగూల్చెదను . "అని శ్రీరాముడు పలుకగా ఖరుడు మిగుల క్రుద్ధుడాయెను . అతని కన్నులెర్రబారేను . పిమ్మట అతడు ఆవేశముతో వికృతముగా నవ్వుచు ,రఘువరునికి ఇట్లు సమాధానమిచ్చెను . 
" ఓ దాశరధీ !రణమునందు సాధారణ సైనికులను చంపి ,ఒక వలె నిన్ను నీవు శ్లాఘించుకొంటివి . యథార్థముగా  పరాక్రమమంతులు బలశాలురు అయిన నరశ్రేష్టులు తమ శక్తిసామర్ధ్యముల గూర్చి ఏమాత్రము గర్వింపరు . శత్రువుల రక్తచారికలు కల ఈ గధను ధరించి ,ఈ యుద్దభూమి యందు స్థిరముగా నిలిచియున్న నన్ను నీవు చూచుటలేదా ?నీ ప్రాణములు హరించుటకు గదాపాణి అయిన నేనొక్కడినే చాలు . నీ గూర్చి చెప్పవలసినది చాలా వున్నది . కానీ నేను చెప్పను . ఎందువల్లనంటే సూర్యుడు అస్తమించబోవుచున్నాడు . సూర్యాస్తమయము అయినచో యుద్ధమునకు ఆటంకము కలుగును . నీవు పదునాలుగువేలమంది రాక్షసవీరులను చంపినావు . కనుక నిన్ను చంపి దానికి ప్రతీకారము తీర్చుకొని ,వారి బంధుమిత్రుల కన్నీరు తుడిచెదను . "
అని పలికి ఖరుడు కోపముతో నిప్పులు కక్కుతూ వజ్రాయుధము వంటి గధను రాముడిపైకి విసిరెను . ఖరునిచే ప్రయుక్తమై మంటలు చిమ్ముచూ ,దారిలో కల వృక్షములను పొదలను భస్మముచేస్తూ తనవైపు వస్తున్న ఆ గధను  రాముడు తన బాణములచే తుత్తునియలు గావించెను . 


రామాయణము అరణ్యకాండ ఇరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ).తెలుగు పండితులు . 












No comments:

Post a Comment